Off The Record: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్-బీఆర్ఎస్ నిరసనలు!
Off The Record: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసనలపై కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్నిచోట్ల నిరసనలు జరగకపోవడంపై ఆరా తీసి, నేతలకు హెచ్చరికలు జారీ చేశారు
Off The Record: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్-బీఆర్ఎస్ నిరసనలు!
Off The Record: తెలంగాణలో ప్రతిపక్షంలోకి వచ్చాక బిఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ రెండున తొలిరోజు కార్యక్రమంలో 119లోని 114 నియోజకవర్గాలలో కార్యక్రమాలు చేశారు.
మిగతా 5 నియోజవర్గాలలో కార్యక్రమాలు చేయలేదట. కార్యక్రమాన్ని చాలా చోట్ల ఘనంగా నిర్వహించినప్పటికీ కొన్నిచోట్ల మాత్రం నాయకుల మధ్య ఆధిపత్యపోరు కనిపించిందట. అధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారట గులాబీ పెద్దలు.
ముఖ్యంగా ఖమ్మంలోని అశ్వారావుపేటలో మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కావడంతో ఎవరికి వారు నిరసనలు చేపట్టారట. లోకల్‌గా వీళ్ళ మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి కూడా నష్టం జరుగుతుందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ హైకమాండ్ నిరసనలకు పిలుపునిచ్చినప్పటికీ ఆ ఐదు నియోజకవర్గాలలో ఆ ఊసే లేదట. మరికొన్ని చోట్ల అంతగా పార్టీ శ్రేణులు యాక్టివ్‌గా కనిపించలేదట. ఈ నివేదికలు తెప్పించుకున్న పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారట.
ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఎవరు..? అక్కడ ఉన్న ఇన్చార్జిలు ఎవరు..? వాళ్ళు ఎందుకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదన్న దానిపై పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టిందట. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ పాల్గొంటున్నారు ఏ నియోజకవర్గంలో ఏఏ నేతలు హాజరు కావడం లేదు..? అనేది పార్టీ ఆరా తీస్తోంది..
వెయ్యి రోజుల కాంగ్రెస్ వైఫల్యాలపై.. రోడ్డెక్కిన గులాబీ దళంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారట. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు, బాధ్యులతో కేటీఆర్.. పార్టీ నిరసనలపై సమగ్రంగా చర్చించారట.
ఎవరెవరు యాక్టివ్‌గా ఉన్నారు..? సైలెంట్ మోడ్‌లో ఉంటే.. అందుకు రీజనేంటి..? అనే విషయాలపై ఆయన ఆరా తీశారని సమాచారం. ప్రతిరోజు నిరసన చేపట్టడంతోపాటు ప్రజల్లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బాకీ కార్డులను డోర్ టు డోర్ పంపిణీ చేయాలని సూచించారట.
ఏడు రోజులపాటు జరిగే ఈ నిరసనల్లో పార్టీ నాయకులందరూ విధిగా పాల్గొనాలని ఆదేశించారట. అంతేకాకుండా ముఖ్య నాయకులు ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్‌లోనే కాక నియోజకవర్గం మొత్తం కవర్ చేయాలని హుకూం జారీ చేశారట.
అధకార కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో పార్టీకి ఆదరణ పెరుగుతోందని కేడర్‌తో కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. అదే సమయంలో నేతలకు సుతిమెత్తగా చురకలు కూడా అంటించారట.
ఇలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమే కాక.. వారి వారి పనితీరుపై లోతైన విశ్లేషణ కూడా చేశారట. కొన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్న కేటీఆర్.. ఆ నివేదికలు చూపెట్టి.. పనితీరు మార్చుకోవాలని కూడా స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చారట. రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానం సూచనలు నాయకులను యాక్టివ్ మోడ్‌లోకి తీసుకొస్తాయో చూడాలి.




