OFF THE RECORD: ప్రతిపక్షాలకు ముచ్చెమటలు..గేర్ మార్చిన కేటీఆర్!

OFF THE RECORD: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు. తాను మారానని, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Nov 2026 8:04 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: ప్రతిపక్షాలకు ముచ్చెమటలు..గేర్ మార్చిన కేటీఆర్! 

OFF THE RECORD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయంగా దూకుడు పెంచారట. పార్టీకి పెద్ద దిక్కుగా అంతా తానై ముందుకు నడిపిస్తున్నారట. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాక్షేత్రంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారట. ప్రజా సమస్యలు మొదలుకొని అధికార పార్టీ హామీల వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గళం విప్పి.. గులాబీ దళాన్ని బలోపేతం చేస్తున్నారట.

అయితే కేటీఆర్ ఎవరిని కలవరు.. ఎవరికీ టైమ్ ఇవ్వరు.. అన్నది కొందరు గులాబీ నేతల్లో వినిపించే గుసగుసలు. కానీ ఈ వాదనలకు భిన్నంగా నేను మారాను అని చెబుతున్నారు కేటీ రామారావు. ఇంతకీ ఆయన నిజంగానే మారారా..?

బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తుంది. ఈ మూడేళ్ల కాలంలో అధినేత కేసీఆర్ స్వయంగా ప్రజా క్షేత్రంలో కనిపించింది, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడింది చాలా అరుదు. అయినప్పటికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన వ్యూహాత్మక పనితనంతో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించారట. కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి రాలేదన్న లోటు రాకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారట.

అంటే.. నిజంగానే కేటీఆర్.. బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అన్నీ తానై పార్టీకి పెద్ద దిక్కుగా మారారా..? అధినేత అదేశాల మేరకు పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో వందకు వందశాతం సక్సెస్ అయ్యారా..? పార్టీ భవిష్యత్తుకు ఢోకా లేదు అన్న నమ్మకాన్ని కూడగట్టుకున్నాట..? పార్టీ శ్రేణులు మొదలు.. ముఖ్య నేతల వరకు అందరూ తన లీడర్ షిప్‌లో పని చేయడం, క్షేత్రస్థాయిలో కేడర్.. లీడర్ కలిసి పని చేసేలా చూడటం, పార్టీలో బేధాభిప్రాయాలకు తావు లేకుండా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించడంలో విజయం సాధించారా..?

అంటే అవునంటున్నారు కేటీఆర్. ఓవైపు పార్టీ బలోపేతం, మరోవైపు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే విషయంలో రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నానంటున్నారు.

ప్రజా సమస్యలపై గళం విప్పే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు అన్నట్టుగా ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచింది బిఆర్ఎస్. అన్ని వర్గాలకు అండగా ఉంటూ వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులోభాగంగా.. ఎవరు కలవాలన్నా, తమ ఆపద చెప్పుకోవాలన్నా తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ సిద్ధంగా ఉందంటున్నారు కేటీఆర్.

అంతేకాదు.. గతంలో ఎవరైనా కేటీఆర్‌ను కలవాలంటే కష్టంగా ఉండేదన్న అవవాదును చెరిపేశానంటున్నారు. నేను ఇప్పుడు మారిన మనిషిని.. కేడర్‌కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు కేటీఆర్. కార్యకర్తలను కలవడమే కాదూ.. ప్రతి రోజూ 5 వేలకు పైగా వాట్సాప్ మెసేజ్‌లకు బదులు కూడా ఇస్తున్నారట.

ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని, ప్రతిపక్ష నేత కేసీఆర్ కనిపించరన్న మాట రాకుండా కేటీఆర్ అన్నీ తానే పార్టీని పరుగులు పెట్టిస్తున్నారట. ప్రభుత్వ వైఫల్యాలను చాకచక్యంగా ప్రజలకు వివరిస్తున్నారట.

రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానిపై ప్రజా పోరాటాలు నిర్మించడంలో.. ఓ అడుగు ముందే ఉంటున్నారట కేటీఆర్. హైడ్రా నుంచి మూసీ వరకు బాధితులకు పార్టీ తరపున అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారట. క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేశారు. ముఖ్యంగా ఎన్ నినో ప్రభావంతో తెలంగాణపై కరువు ఛాయలు అలుముకున్న నేపథ్యంలో.. తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు కేటీఆర్.

కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాల వల్లే.. తెలంగాణ నేలపై కరువు వచ్చిందని.. వందల టీఎంసీల నీళ్లు కిందకు పోతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఎత్తిపోయలేదని, దాని ఫలితంగానే నేడు రైతులకు సాగు నీటి కష్టాలు వచ్చాయని.. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయాయని ప్రతి వేదికపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అందులో భాగంగానే.. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో.. రైతు గర్జన సభలు నిర్వహించారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఓవైపు కాంగ్రెస్ సర్కార్‌ను, మరోవైపు ఉత్తరాదిలో కాస్త బలంగా ఉన్న బీజేపీనీ.. బలహీనపరిచే ప్రయత్నం చేశారు. గతంలో బీఆర్ఎస్ బలమైన కోటలుగా ఉన్న ఉత్తర తెలంగాణలో.. మళ్లీ పాగ వేయాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రైతులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ హయాంలో.. పంటలకు సాగునీరు అందించామని, యూరియా కొరత లేకుండా చూసుకున్నామని, అలాగే సకాలంలో రైతుబంధు వేసి రైతులను కండ్లల్లో పెట్టుకుని చూసుకున్నామని గుర్తు చేశారు కేటీఆర్.

ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్‌లో చేరికలు కూడా ఎక్కువే అవుతున్నాయి. ఎప్పడైనా అధికార పార్టీలో ఎక్కువగా చేరికలు ఉంటాయి. కానీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయట. బీఆర్ఎస్.. ప్రజా పోరాటాలు, పర్యటనలు మాని, కేవలం సోషల్ మీడియాలో పోస్టులు, ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యిందన్న అపవాదును చెరిపే ప్రయత్నం చేస్తున్నారట.

సందర్భానుసారంగా జిల్లాల్లో పర్యటనలు.. అక్కడి లీడర్లను కలుస్తూ కేడర్‌లో జోష్ నింపుతూ.. భవిష్యత్ ఎన్నికలపై భరోసా ఇస్తున్నారట. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న మనోధైర్యాన్ని ఇస్తున్నారట. ఫార్మూలా ఈ-కారు రేస్ వంటి కేసులను ఎదుర్కొంటూనే.. సర్కార్‌పై సమరశంఖం పూరిస్తున్నారు.

ఇది కేవలం బీఆర్ఎస్‌లో జరుగుతున్న రాజకీయ హడావిడా..? లేక కేటీఆర్ నిజంగానే పూర్తిగా మారిపోయారా..? అన్న చర్చ అయితే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. తాను పూర్తిగా మారానని, ఇకపై కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. అయితే, ఆయన మాటల్లోని నిజాయితీ ఏంటో, కేటీఆర్ నిజంగా మారారో లేదో రాబోయే రోజుల్లో ప్రజలే తేల్చాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్