Off The Record: పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా?
Off The Record: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలవ్వనున్న పాదయాత్రల సీజన్.
Off The Record: పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా?
Off The Record: అధికారంలోకి రావడం కోసం పొలిటికల్ పార్టీలకు పాదయాత్ర ప్రధాన అస్త్రంగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యాత్రలకు ప్రత్యేక చరిత్రలు ఉన్నాయి.
ఉమ్మడి ఏపీలో.. ఆ తర్వాత విభజన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అనేక మంది నేతలు పాదయాత్రలు చేసి తమ పార్టీలకు జవసత్వాన్ని తీసుకువచ్చారు. మరి కొంత మంది నేతలు అధికార పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు వారి బాటలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీమంత్రి కేటీఆర్ నడవనున్నారట. త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుండి ఉంటుంది అనే చర్చ స్టార్ట్ అయింది.
2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి 2027 నుంచే.. ఎన్నికల సంగ్రామానికి గులాబీ దళం సన్నద్ధం అయ్యేందుకు ప్రణాళికలు రచ్చిస్తోంది. అందులో భాగంగానే వచ్చే సంవత్సరం నుంచే.. బీఆర్‌ఎస్ వివిధ కార్యక్రమాలతో పార్టీ బిజీ బిజీగా ఉండనుందట. ఈ సంవత్సరం మెంబర్ షిప్ డ్రైవ్, పార్టీ బలోపేతం కార్యక్రమాలు, ghmc ఎన్నికలు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది నుంచి అగ్రనేతలు నియోజకవర్గాల వారిగా యాత్ర చేపట్టనున్నారట. ఐతే గులాబీ బాస్ కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్ యాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ బస్సు యాత్ర అన్ని నియోజకవర్గాలను కలుపుతూ ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా బస్సు యాత్ర షెడ్యూల్ కూడా ఖరారు చేస్తారని తెలుస్తుంది. ఆ టైంలో..పార్టీ నేతలను కలుపుకొని వెళ్లే విధంగా ఒక కార్యచరణ కూడా సిద్ధం చేసుకోవాలని భావిస్తుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైంది కారు పార్టీ. లోక్‌సభ ఎన్నికల్లోనూ దెబ్బ తిన్నది. పైగా ఆ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేల్లో పది మంది హస్తానికి చేరువైయ్యారు. దీంతో ఏడాది కాలంగా.. పార్టీలో మళ్లీ ఉత్సాహం నింపే కార్యక్రమాలు జోరందుకున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ చేజారకుండా భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో.. పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్,హరీష్ రావు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రజల మధ్య ఉంటూ వివిధ కార్యక్రమాలకు స్వీకారం చుడుతున్నారు. 2027లో పాదయాత్రకు కేటీఆర్ సిద్ధం అవుతున్నారు.
పాదయాత్రతో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్ పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2012లో వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబు సైతం పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్ళడంతో షర్మిల పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతలు పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2014 తర్వాత తెలంగాణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేశారు. ఇక 2019లో అధికారంలోకి రావడం కోసం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నిర్వహించారు. 2019 ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యారు.
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుస పాదయాత్రలు చేశారు నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి పాదయాత్ర చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేశారు. హాత్ సే హాత్ జోడో పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. పీపుల్స్ మార్చ్ పేరుతో భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
ఇక రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. తెలంగాణలో కేసీఆర్ బస్ యాత్రతో పాటు కేటీఆర్ పాదయాత్ర చేయనున్నారట. కేటీఆర్ పాదయాత్ర షెడ్యూల్..కేసీఆర్ బస్ యాత్ర షెడ్యుల్ ఖరారైన తర్వాత హరీష్ రావు కేసీఆర్ తో పాటు బస్ యాత్రలో ఉంటారా లేదా హరీష్ రావు కూడా పాదయాత్ర చేస్తారా అనేది క్లారిటీ వస్తుందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అలాగే కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్రలు నియోజకవర్గాల వారిగా ఉంటాయా? అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. పాదయాత్ర, బస్ యాత్రలతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుకోవడంతో పాటు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని గులాబీ దళం భావిస్తోంది. మరి బిఆర్ఎస్‌కు ఈ యాత్రలు అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయో అనేది వేచి చూడాలి.




