Off The Record: అవినీతికి కొమ్ముకాస్తున్న అసిఫాబాద్ పోలీసులు?
Off The Record: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసు అధికారుల అక్రమాలు, రేషన్ బియ్యం దందాలు, గంజాయి రవాణా, నకిలీ విత్తనాల కేసులో ఎస్సై అరెస్ట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.
Off The Record: అవినీతికి కొమ్ముకాస్తున్న అసిఫాబాద్ పోలీసులు?
Off The Record: తెలంగాణ సరిహద్దు జిల్లా కావడంతో కొమురం భీమ్ ఆసిఫాబాద్లో అక్రమ రవాణాకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతుంటారు. అయితే వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత వహిస్తున్న వ్యవస్థలోనే కొందరు అధికారులు అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. అక్రమ రవాణాదారుల నుంచి అందుతున్న మామూళ్ల మత్తులో కొందరు ఖాకీలు కళ్లు మూసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి వ్యాపారం నిర్భయంగా సాగుతోంది. పశువుల అక్రమ రవాణా సరిహద్దు మార్గాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. అయినా పోలీసుల చర్యలు మాత్రం కనిపించడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇంతటితో ఆగలేదు. నేరాలను అణచివేయాల్సిన టాస్క్ఫోర్స్ విభాగంలో పని చేసిన ఒక ఎస్ఐ ఏకంగా నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారంలో అరెస్టవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారే.. అన్నదాతల జీవితాలతో చెలగాటమాడాడనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆ అధికారి గతంలో కూడా వివాదాల్లో చిక్కుకుని సస్పెన్షన్ ఎదుర్కొన్నప్పటికీ.. తిరిగి విధుల్లోకి వచ్చాక పద్ధతి మార్చుకోకుండా మరింత బరితెగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసు శాఖలో అంతర్గత పర్యవేక్షణ ఉందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఒక అధికారి తప్పు చేస్తే అది వ్యక్తిగత తప్పిదంగా భావించొచ్చు. కానీ వరుసగా పోలీసు అధికారుల పేర్లు అక్రమాల జాబితాలో వెలుగులోకి వస్తుంటే.. అది వ్యవస్థ వైఫల్యానికి సంకేతమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక తాజాగా బయటపడిన బెజ్జూర్ ఎస్ఐ వ్యవహారం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు మధ్యవర్తిత్వం వహించడంతో పాటు.. ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం పెద్ద కలకలం రేపింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పోలీసు అధికారి చేయాల్సిన పని నేరాన్ని అడ్డుకోవడం. కానీ ఆరోపణల ప్రకారం అదే అధికారి అక్రమాలకు సహకరించడం, వసూళ్లకు పాల్పడటం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఖాకీ డ్రెస్సుకు గౌరవం తీసుకురావాల్సిన అధికారులే మచ్చ తీసుకొస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇలాంటి సంఘటనలపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ బదిలీలతో సరిపెట్టడం సరైన పరిష్కారం కాదని సామాజిక వర్గాలు అంటున్నాయి. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, తప్పు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే డిపార్ట్మెంటల్ యాక్షన్తో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని కోరుతున్నారు.
ఎందుకంటే.. ప్రజలకు పోలీసులపై నమ్మకం ఉండటమే శాంతిభద్రతల వ్యవస్థకు బలమైన పునాది. ఆ నమ్మకమే కూలిపోతే పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉంది. ప్రజలను రక్షించాల్సిన రక్షకభటులే భక్షకులుగా మారుతున్నారనే భావన సమాజంలో పెరిగితే.. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం.
ఇప్పుడు అందరి చూపు ఉన్నతాధికారుల వైపు మళ్లింది. కొమురం భీమ్ జిల్లాలో వేళ్లూనుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అక్రమ నెట్వర్క్పై కఠిన చర్యలు తీసుకుంటారా..? అవినీతి ఆరోపణల్లో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతారా..? లేక గతంలాగానే ఈ వ్యవహారం కూడా కాలగర్భంలో కలిసిపోతుందా..?
రేషన్ బియ్యం నుంచి గంజాయి వరకు.. నకిలీ విత్తనాల నుంచి వసూళ్ల వరకు.. ఒకటి కాదు, రెండు కాదు.. వరుస ఘటనలు పోలీసు శాఖ ప్రతిష్ఠను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు ఒక్కటే ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీ.. చట్టాన్ని అమ్ముకుంటే, న్యాయం కోసం సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి..? కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఖాకీల అక్రమాలకు బ్రేక్ పడుతుందా..? లేక ఈ దందాలు మరింత విస్తరిస్తాయా.. ?




