Off The Record: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారా ?
Off The Record: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు డిమాండ్ వెనుక శ్రీబాగ్ ఒప్పందం, రాయలసీమ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షలు ఉన్నాయి. ప్రభుత్వాల హామీలు నిరసనల పూర్తి విశ్లేషణ.
Off The Record: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారా ?
Off The Record: ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక రాష్ట్రానికి తొలి రాజధానిగా కొనసాగింది. ఆ తర్వాత 1956లో ఏపీ అవతరణతో రాజధాని హైద్రాబాద్‌కు తరలి వెళ్లగా.. కర్నూలులో హైకోర్టు ఉండాలన్న వాదనలు బలంగా వినిపించాయి.
అంతకు ముందు 1937లో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య జరిగిన శ్రీబాగ్’ ఒప్పందంలోనూ...రాజధాని–హైకోర్టుల్లో ఒకటి రాయలసీమలో ఉండేలా నిర‌్ణయించారు. కానీ అది నెరవేరలేదు. తెలంగాణ విడిపోయాక అమరావతి రాజధానిగా ఏపీ పాలన మొదలైంది.
అప్పుడు కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ జిల్లాల న్యాయవాదులు, రాజకీయ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 2019 ఎన్నికల సమయంలో కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని బిజెపి తన రాయలసీమ డిక్లరేషన్ లో పొందుపరిచింది. ఆ ఎన్నికల్లో పవర్‌లోకి వచ్చిన జగన్.. అనూహ్యంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
అందులో కర్నూల్ ను న్యాయ రాజధానిగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా సిబిఐ కోర్టు, లోకాయుక్త, నేషనల్ యూనివర్సిటీ మరికొన్ని కోర్టులను కర్నూల్లో ఏర్పాటు చేశారు. అయితే టిడిపి 2024 ఎన్నికల ప్రచారంలో కర్నూల్ లో హైకోర్టు కాకుండా.. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని జిల్లా పర్యటన సందర్భంగా తెలిపారు. కర్నూల్‌లోని సి క్యాంప్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలసేకరణ చేస్తున్నట్లు జిల్లా మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇటీవల కర్నూల్ లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ 90 రోజుల్లో కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మొదట హైకోర్టు కావాలని డిమాండ్ చేసిన పార్టీలు, న్యాయవాదులు ఇప్పుడు హైకోర్టు బెంచ్ కావాలని అడుగుతున్నారు. దీనివెనుక పెద్ద రాజకీయం ఉందని రాయలసీమ వాసులు మాట్లాడుకుంటున్నారు. హైకోర్టు డిమాండ్ పై ఇటు వైసిపి, అటు కుటమి పార్టీలు రాజకీయం చేస్తూ వచ్చాయి తప్ప.. చిత్తశుద్ధితో కార్యాచరణ చేపట్టలేదని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే అమరావతి రాజధానిగా హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైకోర్టు నిర్మాణంపై ఇటీవలే క్యాబినెట్లో నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టకుండా ఉండేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. అమరావతిలోని ప్రస్తుత హైకోర్టు చుట్టున్న భూములను
వివిధ రాజకీయ పార్టీల లీడర్లు, బడాబాబులు కొనడంతో వాటి ధరల పెరుగుదల కోసం ..కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా దాని ఊసే ఎత్తకుండా మరుగున పడేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కర్నూలులో కేవలం హైకోర్టు బెంచ్ చాలన్న భావనను.. రాయలసీమ వాసుల్లో బలంగా నాటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు కర్నూలు నగరంలో అనువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నా పార్టీ అధినేతలు మాత్రం రాజకీయం చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వంలో జగన్నాథ గట్టుపై లా యూనివర్సిటీ కోసం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు.
హైకోర్టు బెంచ్ ద్వారా కర్నూలుకు ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రభుత్వం కూడా మొదట హైకోర్టు బెంచ్ ఏర్పాటు అని చెప్పి ఇప్పుడు సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం చూస్తే కర్నూలులో అసలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుందా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు అని చెప్పిన బీజేపీ, జనసేన పార్టీలు పూర్తిగా సైలెంట్ అయిపోయాయి. టీడీపీ పార్టీ నేతలు మాత్రం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని త్వరలోనే అన్ని అనుమతులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రులు మాట్లాడుతున్నారని కానీ కర్నూలులో మాత్రం అలాంటి పనులు జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
పెద్ద మనుషుల ఒప్పందాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం అసలు హై కోర్టు బెంచ్ అయినా ఏర్పాటు చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఓవైపు పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు.
ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులు హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కర్నూలును నిర్లక్ష్యం చేయకుండా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుందో లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.




