Off The Record: కర్నూల్ సెంటర్ లో చూసుకుందాం?

Off The Record: కర్నూలు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి టీజీ భరత్‌పై వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన అవినీతి ఆరోపణలు చేయగా.. దానికి మంత్రి భరత్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 May 2026 7:03 AM IST
Off The Record
X

Off The Record: కర్నూల్ సెంటర్ లో చూసుకుందాం?

Off The Record: కర్నూలు జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఇన్నాళ్లు నాయకులు హుందాగా రాజకీయం చేస్తూ వచ్చారు. వ్యక్తిగత విషయాలను కూడా చాలా హుందాగా మాట్లాడి రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రత్యర్థిపై నేరుగా ఎటాక్ చేస్తున్నారట. దీంతో కర్నూలులో రాజకీయం వేడెక్కింది.. మరి రానున్న రోజుల్లో ఈ రాజకీయం ఎక్కడి వరకు వెళ్తుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

పారిశ్రామిక వేత్తగా పేరు ఉన్న టీజీ వెంకటేష్ ప్రజాసేవలో ముందుంటారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్తూ ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చారు. రాజకీయ విమర్శలు చేసినా హుందాగా చేస్తారు. 1999లో ఒకసారి, 2009లో రెండోసారి టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. రోశయ్య హయాంలో రాష్ట్ర మంత్రిగా కూడా టీజీ వెంకటేష్ పనిచేశారు.

ఆయన వారసుడిగా టీజీవీ గ్రూప్ చైర్మన్ టీజీ భరత్ గుప్తా 2019 ఎన్నికల్లో ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన రాజకీయం వేరుగా ఉంటుంది. ఒకరితో మాట పడే అవకాశం లేకుండా తన బ్రాండ్ ఏంటో తెలిసే విధంగా రాజకీయం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. తనను నమ్ముకున్న కేడర్‌ కోసం పనిచేస్తూ వచ్చారు. గత ప్రభుత్వంలో నాయకులపై కేసులు, దాడులు ఇలా ఇబ్బందులకు గురిచేసినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కున్నారు.

2024 ఎన్నికల్లో టీజీ భరత్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక పూర్తి స్థాయిలో కర్నూలు అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయనకు మంత్రి పదవి లభించింది. ఓ వైపు రాష్ట్రానికి పరిశ్రమలు, కర్నూలును పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఒక్క కర్నూలులోనే 10వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా మంత్రి టీజీ భరత్ గుప్తా.. వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వ్యవహారం వైసీపీ నేతలకు కలిసి వచ్చింది. మొదట ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న టీడీపీ ఆ తర్వాత డిఫెండ్ చేయడం మొదలు పెట్టింది. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బాలును పోలీసులు స్టేషన్‌కు పిలవడం.. విచారణ పేరుతో తనను ఇబ్బంది పెడుతున్నారని బాలు చేయి కోసుకోవడంతో పొలిటికల్ యుద్ధం పెరిగింది. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు 3 టౌన్ స్టేషన్ వద్ద ధర్నాకు పిలునిచ్చారు.

దీనికి కౌంటర్ గా టీడీపీ ఇంచార్జి సునీల్‌ను కొట్టారని టిడిపి నాయకులు పెద్ద ఎత్తున కర్నూలులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒకే సెంటర్ లో మొదట టీడీపీ ఆ తర్వాత వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా..వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రతిరోజు కోటి రూపాయలు తీసుకుంటున్నారని, ఓ ఫార్మా కంపెనీ నుంచి 45కోట్లు తీసుకున్నారని మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు బైరెడ్డి.

తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి మంత్రి టీజీ భరత్ కౌంటర్ ఇచ్చారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక జోకర్ అని కేవలం ప్రత్యర్థులపై మాట్లాడానికి వైసీపీ అతన్ని వాడుకుంటుందని, ఇప్పటివరకు సిద్ధార్థ్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని టీజీ భరత్ ఎద్దేవా చేశారు. బైరెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. అతనిపై క్రిమినల్, సివిల్ డిఫార్మషన్ వేస్తామని దమ్ము ఉంటే కర్నూలు టికెట్ తెచ్చుకొని తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. తాను అందరిలాగా కాదని టీజీ భరత్ అంటే ఏంటో చూస్తారని వైసీపీ నాయకులను హెచ్చరించారు మంత్రి. దీంతో కర్నూలులో టీడీపీ vs వైసీపీ అన్నట్లుగా రాజకీయం మారిపోయింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story