Off The Record: ఎల్లారెడ్డిలో బీజేపీ పెద్ద దిక్కు ఎవరు?
Off The Record: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాయకత్వ లోపంతో సతమతమవుతున్న బీజేపీ. వడ్డేపల్లి సుభాష్ రెడ్డి నిష్క్రమణ తర్వాత క్షేత్రస్థాయిలో పెరిగిన గందరగోళం.
Off The Record: ఎల్లారెడ్డిలో బీజేపీ పెద్ద దిక్కు ఎవరు?
Off The Record: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల బలం ఉంది. ఇక్కడ ఇప్పటివరకు కాషాయ జెండా అధికారికంగా ఎగరకపోయినా, ప్రతి ఏటా కార్యకర్తల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఏకంగా 14.5 శాతం ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు.
అయితే, ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో సుభాష్ రెడ్డి పార్టీకి దూరమై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫిర్యాదుతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, ఆయన రాజకీయంగా సైలెంట్ కావడం జరిగిపోయాయి. సుభాష్ రెడ్డి నిష్క్రమణతో ఎల్లారెడ్డి బీజేపీకి పెద్దదిక్కు కరువయ్యారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి "నేనున్నానంటూ" అడపా దడపా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పటికీ, స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు చేస్తుండటంతో కేడర్ తలలు పట్టుకుంటోందట.
మరో నాయకుడు టీవీల్లో ఎక్కువగా, గ్రౌండ్‌లో తక్కువగా కనిపిస్తుండగా, మాజీ ఎంపీ బీబీ పాటిల్ సైతం ఎల్లారెడ్డిపై కన్నేసి భవిష్యత్తులో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరికివారే "తామే పెద్దన్నలం" అని చెప్పుకుంటూ విడివిడిగా తిరుగుతుండటంతో కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొందట.
నియోజకవర్గంలో సరికొత్త నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతున్నప్పటికీ, పార్టీని సమన్వయం చేసే బలమైన నాయకుడు లేకపోవడం పెద్ద లోటుగా మారింది. కార్యకర్తలు మాత్రం తమను నడిపించే ఒకే ఒక ‘కరెక్ట్ లీడర్’ కోసం ఎదురు చూస్తున్నారు. కామారెడ్డిలో సాధించిన గెలుపు జోష్ ఎల్లారెడ్డికి కూడా విస్తరించాలంటే, ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుని.. నియోజకవర్గ బాధ్యతలను క్షేత్రస్థాయి కేడర్‌తో మమేకమయ్యే సరైన నేతకు అప్పగించి, కార్యకర్తల్లో భరోసా నింపాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది.




