Off The Record: నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఇంచార్జ్ ఎవరు!

Off The Record: గువ్వల బాలరాజు రాజీనామా తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్‌లో నాయకత్వ శూన్యత. కొత్త అధ్యక్షుడి ప్రకటనపై అధిష్టానం మౌనం. కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2026 7:51 AM IST
Off The Record
X

Off The Record: నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఇంచార్జ్ ఎవరు! 

Off The Record: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేగా పార్టీ బాధ్యతలను మోసిన గువ్వల బాలరాజు గులాబీ గూటిని వీడి ఇతర పార్టీలోకి వెళ్లడంతో జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

ఒక ముఖ్య నేత పార్టీని వీడటంతో జిల్లాలో నాయకత్వ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై నమ్మకంతో కేడర్ ఎంతో కొంత ధైర్యంగా ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో జిల్లాను నడిపించే సారథి లేకపోవడం కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది.

గువ్వల బాలరాజు పార్టీ వీడిన సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ, వీలైనంత త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గానికి అందరూ మెచ్చే వ్యక్తిని ఇన్‌చార్జిగా నియమిస్తామని, అలాగే కొత్త జిల్లా అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు.

కానీ, ఆ హామీలిచ్చి ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. అధిష్టానం నుంచి స్పష్టత రాకపోవడంతో కిందిస్థాయి శ్రేణుల్లో, గ్రామస్థాయి కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి గూడుకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతానికి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంతో పాటు అచ్చంపేట నియోజకవర్గ బరువు బాధ్యతలను కూడా తాత్కాలికంగా నెట్టుకొస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోగలిగింది.

అయితే, ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల బాధ్యతలను పూర్తిస్థాయిలో మోయడం కష్టతరంగా మారుతోందన్న టాక్ బలంగానే ఉంది. జిల్లా పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆయన మరింత ఉత్సాహంగా పని చేసేవారని కేడర్ భావించింది. కానీ, అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మర్రి జనార్దన్ రెడ్డి కూడా తన దృష్టిని అచ్చంపేటపై పూర్తిగా కేంద్రీకరించలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అచ్చంపేట పూర్తి బాధ్యతలను మర్రి జనార్దన్ రెడ్డికి లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అప్పగిస్తారని తొలుత అందరూ భావించారు. అయితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేవలు రాష్ట్రస్థాయిలో పార్టీకి అవసరమున్న కారణంగా ఆయనకు అచ్చంపేటలో పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది.

మర్రి లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లలో ఎవరికో ఒకరికి జిల్లా పూర్తి స్థాయి పగ్గాలు అప్పగించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఒకవేళ వీరు కాకపోతే, యువ నాయకులు మధు, శ్రీకాంత్ లాంటి వారికి అవకాశం ఇచ్చి పార్టీని కాపాడుకోవాలని కారు గుర్తు శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి.

క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే నాయకత్వ లోపానికి అధిష్టానం తక్షణమే తెరదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిని, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిని త్వరగా నియమించి, కేడర్‌ను ఒకతాటిపైకి తీసుకురావాలని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్