Burning Topic: బ్రెజిల్ అధ్యక్షునిగా మరోసారి లులూ!
Burning Topic: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నాయకుడు లుయిజ్ ఇనాసియో లులా డిసిల్వా చారిత్రాత్మక విజయం సాధించి నాల్గవసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
Burning Topic: బ్రెజిల్ అధ్యక్షునిగా మరోసారి లులూ!
Burning Topic: వయసు కేవలం అంకె మాత్రమేనని, బలమైన ప్రజాదరణ, దృఢ సంకల్పం ఉంటే రాజకీయాల్లో అసాధ్యమైనది ఏదీ లేదని బ్రెజిల్ వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వా నిరూపించారు. తన 80వ ఏట 'పార్టిడో దోస్ త్రబల్హాదోర్స్' పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారు. తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కుమారుడు ఫ్లావియో బోల్సోనారోను ఓడించి నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
సుపీరియర్ ఎలక్టోరల్ కోర్ట్ వెల్లడించిన ఫలితాల ప్రకారం లూలాకు 51.79% ఓట్లు రాగా, ఫ్లావియో బోల్సోనారోకు 48.21% ఓట్లు దక్కాయి. వాస్తవానికి అక్టోబర్ 3న జరిగిన తొలి రౌండ్ పోలింగ్‌లో ఫ్లావియో బోల్సోనారో స్వల్ప ఆధిక్యత సాధించారు. ఆయనకు 47.03% ఓట్లు, లులాకు 45.16% వచ్చాయి. అయితే ఎవరు కూడా 50 % శాతం ఓట్లు సాధించకపోవడంతో అక్బోబర్ 25న రెండో విడత పోలింగ్ అనవార్యమైంది. ఈ పోలింగ్‌లో సుమారు 44 లక్షల ఆధిక్యతతో లులూ చారిత్రిక విజయం సాధించారు.
తాజా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో నిత్యావసర వస్తువుల ధరలు, నేరాలు, అవినీతి ఆరోపణలు ప్రధాన ఎజెండాగా మారాయి.. పెరిగిన జీవన వ్యయం, ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులను ఆకట్టుకోవడానికి లూలా కీలక ప్రతిపాదనలు చేశారు. చిన్న వ్యాపారుల పన్ను పరిమితి పెంపు, వినియోగదారుల అప్పుల పునర్వ్యవస్థీకరణ, కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆన్లైన్ బెట్టింగ్‌లపై నిషేధం వంటి హామీలు తటస్థ ఓటర్లను ఆయన వైపు తిప్పాయి.
శాంతిభద్రతల అంశంపై లూలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారి విషయంలో నేరపూరిత బాధ్యత వయస్సును తగ్గించే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడం ద్వారా సంప్రదాయ ఓటర్ల విశ్వాసాన్ని కూడా చూరగొన్నారు. అయితే నాలుగోసారి అధికారంలోకి వస్తున్న లూలాకు భవిష్యత్తులో తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఎదురుకానున్నాయి. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కత్తి మీద సాముగా మారనుంది.
బ్రెజిల్లో సైనిక పాలన సాగుతున్న సమయంలో, కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వా 1980లో 'పార్టిడో దోస్ త్రబల్హాదోర్స్' పార్టీని స్థాపించారు. దీని అర్థం వర్కర్ప్ పార్టీ. దీనిని స్థాపించడంలో లులా కీలక పాత్ర పోషించారు. సమాజంలో ఆదాయ అసమానతలను తగ్గించడం, పేదరిక నిర్మూలన, కార్మిక సంక్షేమమే ఈ పార్టీ ప్రధాన ఎజెండా. 2003 అధ్యక్ష ఎన్నికల్లో లులా తొలిసారి ఘన విజయం సాధించి వరుసుగా రెండు పర్యాయాలు 2011 వరకు కొనసాగారు.
బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా వరుసగా రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవిలో కొనసాగడానికి వీలుంటుంది. దీంతో వర్కర్స్ పార్టీ తరఫున తన ప్రధాన అనుచరురాలు దిల్మా రౌసెఫ్‌ను అభ్యర్థిగా నిలబెట్టి, ఆమెను గెలిపించుకున్నారు. కాగా 2016 లో అప్పటి అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అవినీతి ఆరోపణలతో అభిశంసనకు గురి కావడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది.
2018 ఎన్నికల్లో వర్కర్స్ పార్టీపై సోషల్ లిబరల్ పార్టీ ఘన విజయం సాధిచడంతో జైర్ బోల్సోనారో అధ్యక్షునిగా వచ్చారు. అవినీతి ఆరోపణలతో లులాను జైలుకు పంపడంతో ఆయన పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. కాగా కరోనాతో పాటు తీవ్ర ఆర్థిక సంక్షోభ, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంతో విఫలమయ్యారు. నిరుద్యోగం, పేదరికం ఎక్కువవడంతో 2022 ఎన్నికల్లో ప్రజలు తిరిగి వర్కర్స్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో లులా డా సిల్వా మూడోసారి దేశాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.
జైర్ బోల్సోనారో మద్దతుదారులు ఓటమిని అంగీకరించకుండా కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనాలపై దాడులు చేశారు. దీంతో ఆయనకు జైలు శిక్ష పడింది. బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆయనకు 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ లిబరల్ పార్టీ తరపున జైర్ బోల్సోసారో కుమారుడు ఫ్లావియో బోల్సోనారో అధ్యక్ష అభ్యర్థిగా నిలిచినా విజయం సాధించలేకపోయారు.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా డిసిల్వా విజయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సాక్ కలిగించింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో చైనా ప్రభావం పెరగకుండా చూసేందుకు ఆయన బోల్సోనారోకు మద్దతుగా నిలిచారు. బోల్సోనారోను జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ యంత్రాంగం బ్రెజిల్‌పై ఆర్థిక సుంకాలు విధించడానికి కూడా వెనుకాడలేదు. వామపక్ష వర్కర్స్ పార్టీని ఓడించడానికి బోల్సోనారో కుటుంబమే సరైన ప్రత్యామ్నాయమని ట్రంప్ బృందం భావించింది.
అయితే లూలా డా డిసిల్వా మళ్లీ బోల్సోనారో వద్దు’ అనే నినాదంతో భారీ ర్యాలీలు నిర్వహించడం, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం, సంక్షేమ పథకాలు, ప్రజా రవాణాపై ఇచ్చిన హామీలు ఆయనను విజయం వైపు నడిపించాయి. ఇప్పుడు బ్రెజిల్ విదేశాంగ విధానం ఎలా కొనసాగుతుందన్న ఆసక్తి నెలకొంది. లూలా బ్రెజిల్ స్వతంత్ర విదేశాంగ విధానానికి, చైనా సహా గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మరోవైపు సెర్బియాలో విద్యార్థుల నేతృత్వంలోని "స్టూడెంట్ లిస్ట్ - స్టూడెంట్స్ విన్" ఉద్యమ కూటమి చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ అసాధారణ ఫలితంతో గత 14 ఏళ్లుగా సాగుతున్న పాలకుడు అలెగ్జాండర్ వూచిక్ హవాకు ముగింపు పడింది. సెర్బియాలోని మొత్తం 250 పార్లమెంటు స్థానాలకు గాను, విద్యార్థుల కూటమి 135 నుండి 140 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో విజయం దిశగా దూసుపోయింది. వూచిక్ నేతృత్వంలోని SNS కూటమి కేవలం 105 స్థానాలకే పరిమితమైంది.
విద్యార్థుల కూటమికి సుమారు 52% ఓట్లు రాగా, వూచిక్ పార్టీకి 32.3% ఓట్లు లభించాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి, గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనివిధంగా సుమారు 65 శాతం పోలింగ్ నమోదు చేశారు. పోలింగ్ ముగిసిన రెండు గంటల్లోనే అధ్యక్షుడు అలెగ్జాండర్ వూచిక్ తన ఓటమిని అంగీకరించడంతో, సెర్బియాలోని పలు నగరాల్లో ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు.
2024లో నోవి సాద్ రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది మరణించిన విషాద ఘటన తర్వాత చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ దుర్ఘటనకు అవినీతే కారణమని ఆరోపిస్తూ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తరఫున పోటీ చేసిన అభ్యర్థులలో ఎక్కువ మంది విద్యావేత్తలు, కళాకారులు వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులే ఉన్నారు.
వీరికి రాజకీయ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అవినీతిని అణచివేయడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగి విజయం సాధించారు. మరోవైపు, ఈ చారిత్రాత్మక విజయాలపై యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, హంగేరీ ప్రధాని పీటర్ మాగ్యార్ విద్యార్థులకు అభినందనలు తెలిపి, చట్టబద్ధత, అవినీతి నిర్మూలనలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. తాము స్వేచ్ఛా దేశంలో జీవిస్తున్నట్లు భావిస్తున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు బల్గేరియా అధ్యక్ష ఎన్నికల తొలి విడతలో స్పష్టమైన విజయం ఎవరికీ దక్కలేదు. రికార్డు స్థాయిలో తక్కువ పోలింగ్ నమోదవడం అక్కడి రాజకీయాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సూచిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు ఇలియానా యొటోవా, పాశ్చాత్య దేశాలతో సన్నిహిత సంబంధాలకు మద్దతు ఇచ్చే ఆండ్రే గ్యురోవ్ మధ్య నవంబర్ 1న రెండో విడత పోటీ జరగనుంది. తొలి విడతలో యొటోవాకు సుమారు 35 శాతం, గ్యురోవ్కు 32 శాతానికి పైగా ఓట్లు వచ్చినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి.
బల్గేరియా ఎన్నికల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నల్ల సముద్రంలో భద్రతా సమస్యలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కీలక అంశాలుగా నిలిచాయి. రష్యాతో సంబంధాలు, ఉక్రెయిన్‌కు మద్దతు, యూరోపియన్ యూనియన్‌తో భవిష్యత్తు సంబంధాలపై ఇద్దరు అభ్యర్థుల వైఖరుల్లో తేడాలున్నాయి. అందుకే రెండో విడత పోటీపై ఆసక్తి పెరిగింది.




