Burning Topic: బ్రెజిల్‌లో డి సిల్వా చారిత్రాత్మక విజయం!

Burning Topic: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా విజయం సాధించి నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Oct 2026 7:38 AM IST
Burning Topic
X

Burning Topic: బ్రెజిల్‌లో డి సిల్వా చారిత్రాత్మక విజయం!

Burning Topic: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా ఘన విజయం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.లూలాకు మొత్తం 6.42 కోట్ల ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు ఫ్లావియో బోల్సనారోకు 5.98 కోట్ల మాత్రమే దక్కాయి. 44.3 లక్షల ఓట్ల మెజారిటీతో లులా విజయం సాధించారు.

తొలి విడత పోలింగ్‌లో ప్రత్యర్థి కంటే వెనుకబడిన లూలా.. రెండో విడతలో వ్యూహాన్ని మార్చుకుని ఓటర్ల మద్దతు కూడగట్టారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, నేరాలు, ప్రజల భద్రత వంటి అంశాలు ఎన్నికల్లో కీలకంగా మారాయి. బోల్సోనారో నేరాలపై కఠిన చర్యలు, ఆహార ధరల తగ్గింపు వంటి హామీలు ఇవ్వగా.. లూలా సామాజిక సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలపై దృష్టి సారించారు. ఇప్పటికే మూడుసార్లు బ్రెజిల్ అధ్యక్ష పదవి నిర్వహించిన లులా డ సిల్వా నాలుగోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛన ప్రాయమే.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించే లూలా డా సిల్వా బ్రెజిల్ అధ్యక్ష పదవిలో మరోసారి కూర్చోవడం కొత్త చర్చకు తెరలేపింది. ఈ ఫలితాన్ని కేవలం ఒక దేశ ఎన్నికల విజయంగా కాకుండా.. వామపక్ష రాజకీయాలు, జాతీయ సార్వభౌమాధికారం, అమెరికా ప్రభావం వంటి అంశాలతో ముడిపెట్టి పెడుతున్నారు. లాటిన్ అమెరికాలోని పలు దేశాలపై పెత్తనం విస్తరిస్తున్న ట్రంప్‌కు బ్రెజిల్ కొరకరాని కొయ్యగా మారిపోయింది.

మెక్సికో, బ్రెజిల్ వంటి ప్రధాన దేశాల్లో వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న నాయకత్వం కొనసాగడం ఆయనకు మింగుడు పడని అంశం. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను, అమెరికా పెత్తనాన్ని లూలా గతంలో చాలా సార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో లూలా విజయం అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనుకునే వర్గాలకు ఊరటనిస్తోంది. ఈ ఎన్నికల ఫలితం అమెరికా-బ్రెజిల్ సంబంధాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ పొరుగున ఉన్న వెనిజువెలాలో రాత్రికి రాత్రి అధ్యక్షుడిని సైతం అక్రమంగా నిర్బంధించడం.. తన మాటలు వినే వ్యక్తికి అధికారం కట్టబెట్టడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే.. వెనిజువెలాలోని చమురుపై పెత్తనం మాదేనని అధ్యక్షుడు ట్రంప్‌ ఈమధ్యే వ్యాఖ్యానించారు కూడా. ఇలాంటి పరిస్థితినే బ్రెజిల్‌లోనూ తీసుకొచ్చేందుకు అమెరికా చేసిన ప్రయత్నం లులా గెలుపుతో బెడిసికొట్టింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తన మిత్రుడైన జైర్ బోల్సోనారో తనయుడు ఫ్లావియో బోల్సోనారోపై విజయం సాధించడం ట్రంప్‌కు మింగుడు పడటం లేదు.

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. పోలింగ్ సమయాన్ని పొగడించడాన్ని, ఓట్ల లెక్కింపు తీరును తప్పుపట్టారు. బ్రెజిల్ ఎన్నికలపై అమెరికా తరఫున ఏవైనా చర్యలు తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా, "నేను బ్రెజిల్ కోసం పోటీ చేయడం లేదు, అమెరికా కోసం చేస్తున్నాను అని స్పందించారు.

మరోవైపు ఎన్నికల్లో విజయోత్సవాలను జరుపుకుంటున్న లూలా డ సిల్వా.. బ్రెజిల్‌ దేశం ఎవరి సొత్తో కాదని అమెరికాపై పరోక్షంగా ధ్వజమెత్తారు. మతం, లింగం వంటి అంశాల ఆధారంగా వివక్ష చూపబోనని, ప్రజలందరినీ గౌరవిస్తానని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రత్యర్థి బోల్సనారో వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. కాగా బ్రెజిల్‌లో ద్రవ్యోల్బణం, ప్రజల భద్రత, అవినీతి ఆరోపణలు, రాజకీయ విభజన వంటి సమస్యలు లూలాకు సవాలుగా మారనున్నాయి.

అమెరికావిధిస్తున్న సుంకాలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య లూలా తిరిగి అధికారంలోకి రావడం బ్రెజిల్ తన ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే వైఖరిని కొనసాగించవచ్చనే సంకేతాలను ఇస్తోంది. అయితే అమెరికా-బ్రెజిల్ సంబంధాలు పూర్తిగా మారిపోతాయని చెప్పలేం. కానీ అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

మరోవైపు బ్రెజిల్‌లో లూలా డ సిల్వా మరోసారి అధ్యక్షునిగా ఎన్నికవడం భారత్‌కు శుభపరిణామంగా చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న బ్రెజిల్‌.. బ్రిక్స్‌లోనూ కీలక సభ్యదేశం. బ్రిక్స్‌ కూటమిలో భారత్‌, బ్రెజిల్‌ కలిసి పనిచేయడం అంతర్జాతీయ వేదికలపై కీలకంగా మారనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ఇరు దేశాలు కోరుతున్నాయి.

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక, రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా ఈ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నది వాటి అభిప్రాయం. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ప్రాధాన్యం కలిగిన అంశం. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, కీలక ఖనిజాలు, అంతర్జాతీయ పాలన వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత విస్తరించేందుకు లూలా విజయం దోహదపడుతుంది.

లూలా డ సిల్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా డిజిటల్‌ భాగస్వామ్యం, కీలక ఖనిజాలు, అరుదైన భూ మూలకాలు, ఔషధ రంగ సహకారం, గనుల సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. తయారీ రంగాన్ని విస్తరించడంతోపాటు దిగుమతి చేసుకునే కీలక ముడి పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న భారత్‌ లక్ష్యాలకు ఈ సహకారం ఉపయోగపడనుంది.

వ్యవసాయం, జీవ ఇంధనాలు, ఇంధన రంగాల్లో బ్రెజిల్‌కు ఉన్న అనుభవం.. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, సమాచార సాంకేతికత, ఔషధాలు, ఇంజినీరింగ్‌లో భారత్‌ సామర్థ్యాలతో కలిస్తే ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది. లూలా భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్‌, బ్రెజిల్‌ కలిసి పనిచేస్తే గ్లోబల్‌ సౌత్‌ గొంతుక మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో వినిపిస్తుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచాలని లూలా గతంలో ప్రతిపాదించారు. భారత్‌-బ్రెజిల్‌ వాణిజ్య లావాదేవీలను అమెరికా డాలర్లకు బదులుగా రూపాయి, బ్రెజిలియన్‌ రియల్‌ కరెన్సీల్లో నిర్వహించే అవకాశాన్ని పరిశీలించవచ్చని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీని రూపొందించే ప్రయత్నం చేయడం లేదని కూడా స్పష్టం చేశారు.

స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు సాధ్యమైతే మారకపు ఖర్చులను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, మారకపు రేట్లలో మార్పులు, చెల్లింపుల వ్యవస్థలు, వాణిజ్య అసమతుల్యత వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. దీనివల్ల డాలర్‌ ఆధారిత లావాదేవీలు వెంటనే ముగిసిపోతాయని భావించకూడదు.పునరుత్పాదక ఇంధనం, ఇథనాల్‌ మిశ్రమం, స్థిరమైన విమాన ఇంధనాల రంగాల్లోనూ సహకారానికి అవకాశాలున్నాయి. భారత్‌-బ్రెజిల్‌ సంబంధాల బలోపేతం ద్వారా లాటిన్‌ అమెరికాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించవచ్చు.

భారత్‌, బ్రెజిల్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2025లో 25 శాతానికిపైగా పెరిగి 15.21 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2024లో ఇది 12.20 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2026 తొలి ఆరు నెలల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుమారు 8.77 బిలియన్‌ డాలర్లకు చేరి, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 37 శాతం వృద్ధి నమోదైంది. 2025 జులైలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్‌ పర్యటన సందర్భంగా ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

భారత్‌ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు, రసాయనాలు, వ్యవసాయ రసాయనాలు, ఇంజినీరింగ్‌ వస్తువులు, వస్త్రాలు బ్రెజిల్‌కు ఎగుమతి అవుతున్నాయి. బ్రెజిల్‌ నుంచి ముడి చమురు, సోయాబీన్‌ నూనె, చక్కెర, పత్తి, ఇనుప ఖనిజం భారత్‌కు వస్తున్నాయి. ఔషధాలు, వ్యవసాయం వంటి రంగాల్లో మార్కెట్‌ అవకాశాలను విస్తరించాల్సిన అవసరం ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్