Jordar Varthalu: ప్లాస్టిక్ వద్దని చేయాల్సింది నినాదాలు కాదు.. ఈ ఊరి వాళ్లలా ఆచరించాలి

Jordar Varthalu: ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి నిజామాబాద్ జిల్లా మచ్చర్ల గ్రామస్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 April 2026 7:28 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ప్లాస్టిక్ వద్దని చేయాల్సింది నినాదాలు కాదు.. ఈ ఊరి వాళ్లలా ఆచరించాలి

Jordar Varthalu: పట్నం పబ్లిక్కుతోటి పోల్తె పల్లె పబ్లిక్కు బాగా ఉషారైతున్నరుల్లో ఈనడ్మ. శానా తెల్వికస్తున్నరు ఊరు జనాలు. ఎన్నికల్ల ఓట్లేసుట్ల పోటీవడ్తున్నరు.. బెల్టుషాపులను మూసుట్ల పోటీవడ్తున్నరు.. ప్లాస్టిభూతాన్ని తర్మికొట్టుట్ల అస్సల్కే తగ్గుతలేరు పల్లెటూరోళ్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మచ్చర్ల ఊరు గిది. ప్లాస్టికును తర్మికొట్టే తీర్మాణం జేశిర్రు గీ ఊరొల్లు సుతం. పేపర్ ప్లేట్లు, పేపర్ గిలాసలు, ప్లాస్టికు కవర్లు ఏది గుడ వాడకూడదని రూల్సు తెచ్చిర్రు. కవర్ల వాడకుంట దాతల సాయంతోటి ప్లాస్టికు రహిత సంచులు పంచిపెట్టిర్రు ఊరంత. అట్లనే పాన్లు, గుట్కాలు అమ్ముడు గుడ బందు పెట్టిచ్చిర్రు. 25 ఏండ్లు నిండని పొల్లగాండ్లు సిగిరేట్లు అమ్ముడు సుతం నడ్వకుంట జేశిర్రు. ఆఖర్కు కిరాణ దుకాండ్లల్ల, మాంసం కొట్లల్ల గుడ కవర్ల వాడుడు బందు జేశిర్రు. రూల్సు ఎవ్వలు తప్పినా బండకు బండ ఐదువేలు జుర్మాన కట్టిపిస్తరట ఈకాన్నుంచి. అందుకే ఇప్పుడు మచ్చర్ల ఊరిల ఏడ సూశినా ప్లాస్టీకు ముచ్చటే లేదు. ‎ఆఖర్కు శాయ దుక్నాలల్ల గుడ స్టీలు గిలాసలే వాడుతున్నరుల్ల. తీర్మాణం జేశి నెల సుతం గాలేదు.. అప్పుడే మస్తు మారిందుల్ల మచ్చర్ల ఊరు. ఇగో ఇనుర్రి.

క్యాన్సర్ బీమారి శెయ్యంగ ఇద్దరు ముగ్గురు జీవిడ్శేటాళ్లకు ఊరు జనాలు మొత్తం కల్శి కట్టుగ ఒకటే మాట మీద నిలవడ్డరు. కని, ఎంత ప్లాస్టీకును వద్దనుకున్నా.. పెండ్లిండ్లు, ఫంక్షన్లనంగ ప్లాస్టీకు లేంది నడ్వయి గదా మరి, అసోంటప్పుడు ఎట్లా అనంటే.. గీ అన్న సర్కారుకు ఒక మంచి ఐడియా ఇచ్చిండు. ఊరిల జర్గేటి ఫంక్షన్లల్ల ప్లాస్టీకు వాడకుంట ఐదువేల స్టీలు ప్లేట్లు కొన్కచ్చిర్రట. అట్లనే సర్కారొల్లు బత్కమ్మ శీరలు అసోంటి బందుపెట్టయినా.. ప్రతీ ఊరూరుకు స్టీలు ప్లేట్లు గిలాసలు పంచిపెడ్తె.. అన్ని ఊర్లల్ల ప్లాస్టీకు బందైతదన్నట్టు జెప్తున్నడు గీ అన్న. మంచి ముచ్చటే. సూడాలె మరి సర్కారొల్లు అసోంటి నిర్ణయం ఏమన్న జేత్తరో లేదో కని, మొత్తానికి గీ ఊరును తెలంగాణ అంతటున్న పల్లెలన్ని ఆదర్శంగ తీస్కోవాల్ననయితె కోరుతున్నం మా జోర్దార్ వార్తల తర్పునిగ.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story