Off The Record: పాలమూరు చైర్మన్ పదవి దక్కేది ఎవరికి!
Off The Record: మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్ పదవికై కాంగ్రెస్‌లో ముక్కోణపు పోటీ. రేవంత్ రెడ్డి నిర్ణయంపై పెరిగిన ఉత్కంఠ.
Off The Record: పాలమూరు చైర్మన్ పదవి దక్కేది ఎవరికి!
Off The Record: ప్రస్తుతం మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. ముడా చైర్మన్ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో కొత్త చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్‌లో చర్చలు వేగం పుంజుకున్నాయి. సాధారణంగా నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే ప్రతిసారీ రాజకీయ పోటీ కనిపిస్తుంటుంది. కానీ ఈసారి ముడా చైర్మన్ పదవికి మాత్రం ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. కారణం.. పాలమూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పట్టణ విస్తరణ, నిధుల సమీకరణలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించడం.
ఈ నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తమకు అనుకూల వ్యక్తికే ఈ పదవి దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా కేంద్రానికి చెందిన నాయకులు మాత్రం ముడా చైర్మన్ పదవి తిరిగి మహబూబ్‌నగర్ పట్టణానికే కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పీఠం మూడు ప్రాంతాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వైపు చూస్తే.. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ పదవి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతకు దక్కడంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ నాయకులను బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిలో ఒకరికి ముడా చైర్మన్ పదవి ఇప్పిస్తానని ఆయన బహిరంగంగానే హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో మధుసూదన్ రెడ్డి ఈ పదవిని తన నియోజకవర్గానికే తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మరోవైపు జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌కు చెందిన నాయకుల వాదన భిన్నంగా ఉంది. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ మహబూబ్‌నగర్ పట్టణానికి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సుందరీకరణ పనులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు నిధుల కొరతతో నెమ్మదిగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ముడా చైర్మన్ పదవి జిల్లా కేంద్రానికే దక్కితే ప్రభుత్వంతో సమన్వయం సులభమవుతుందని, భారీ నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు వాదిస్తున్నారు.
ఈ కారణంగానే ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా ముడా చైర్మన్ పదవి మహబూబ్‌నగర్ పట్టణ నాయకుడికే దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సిట్టింగ్ చైర్మన్ కూడా జిల్లా కేంద్రానికి చెందినవారే అయినప్పటికీ.. అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి అదే ప్రాంతానికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వాదనను జడ్చర్ల, దేవరకద్ర వర్గాలు అంగీకరించడం లేదని సమాచారం. ఇప్పటివరకు జిల్లా కేంద్రానికే ప్రాధాన్యత దక్కిందని, ఈసారి తమ నియోజకవర్గాలకు అవకాశం రావాలని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ వ్యవహారంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అనిరుధ్ రెడ్డి గత కొంతకాలంగా తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సొంత ప్రభుత్వంపైనే పలుమార్లు విమర్శలు చేసిన ఆయన.. ఇటీవల నిధుల కోసం అవసరమైతే దీక్షకు కూడా సిద్ధమంటూ వ్యాఖ్యానించారు. "నా నియోజకవర్గానికి నిధులు రాకపోతే దీక్షలో చచ్చాకైనా ఇవ్వండి" అనే స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అనిరుధ్ రెడ్డి అసంతృప్తిని తగ్గించడానికి కూడా ముడా చైర్మన్ పదవి జడ్చర్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. జడ్చర్లకు చెందిన నాయకుడికి ఈ పదవి దక్కితే స్థానికంగా తన రాజకీయ బలం మరింత పెరుగుతుందని అనిరుధ్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా తన ప్రయత్నాల్లో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన.. అదే అనుబంధాన్ని ఉపయోగించి తన వర్గానికి ఈ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవరకద్రకు ఈ పదవి వస్తే అక్కడ కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత అసంతృప్తిని తగ్గించవచ్చని మధుసూదన్ రెడ్డి అధిష్టానానికి వివరిస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల మధ్య ముడా చైర్మన్ పదవి ఇప్పుడు కేవలం ఒక నామినేటెడ్ పోస్టుగా కాకుండా రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మక పదవిగా మారింది. ఎందుకంటే ముడా పరిధిలోని అభివృద్ధి ప్రణాళికలు, భూవినియోగ అంశాలు, పట్టణాభివృద్ధి పనులు భవిష్యత్తు రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ పదవిని దక్కించుకున్న నాయకుడు రాబోయే ఎన్నికల నాటికి జిల్లా రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందుకే ప్రస్తుతం మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల మధ్య ఈ పదవి కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేల ప్రతిష్ట, మరోవైపు జిల్లా కేంద్ర అభివృద్ధి వాదన, ఇంకోవైపు ప్రభుత్వ సమీకరణాలు.. ఇలా అనేక అంశాలు ఈ ఒక్క నియామకం చుట్టూ తిరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే జరుగుతున్న ఈ పోరుకు తుది తీర్పు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి భుజాలపై పడింది. ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు ప్రాధాన్యం ఇస్తారా..? లేక జిల్లా కేంద్ర అభివృద్ధి పేరుతో మరోసారి మహబూబ్‌నగర్‌కే అవకాశం కల్పిస్తారా..? లేదా రాజకీయ సమతూకం కోసం కొత్త సమీకరణాన్ని తెరపైకి తీసుకొస్తారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరి ముడా పీఠం చివరకు ఎవరిని వరించబోతోంది..? జడ్చర్ల పంతం నెగ్గుతుందా..? దేవరకద్ర వ్యూహం ఫలిస్తుందా..? లేదా జిల్లా కేంద్రం మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా..? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న నామినేటెడ్ పదవుల జాబితాలోనే దాగి ఉంది. అప్పటివరకు పాలమూరు రాజకీయాల్లో ముడా చైర్మన్ పదవే హాట్ టాపిక్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.




