Off The Record: కాంగ్రెస్ నేతల మధ్య నీటి యుద్ధం!
Off The Record: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల మధ్య డిండి ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులపై చెలరేగిన జల వివాదం. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు.
Off The Record: కాంగ్రెస్ నేతల మధ్య నీటి యుద్ధం!
Off The Record: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీటిని అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2015లో 'డిండి ఎత్తిపోతల పథకం' చేపట్టింది. కృష్ణా నది నుంచి ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కూడా ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన 'ఏదుల' రిజర్వాయర్ నుంచి రోజుకు 0.55 టీఎంసీల చొప్పున ఎత్తిపోసి.. 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని డిండి రిజర్వాయర్ ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తరలించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఏదుల నుంచి టన్నెల్, కెనాల్ ద్వారా కృష్ణా జలాలను ఉల్బల్ బరాజ్, అక్కడి నుంచి పోతిరెడ్డిపల్లి బరాజ్ మీదుగా నల్లగొండకు తరలించాలని నిర్ణయించారు.
కానీ, సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రెండు జిల్లాల నేతలు, రైతులు, అధికారుల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. అధికార కాంగ్రెస్‌లోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా ప్రయోజనాలను కాపాడాలని, ఏదుల నుంచి నీటి తరలింపునకు అడ్డుకట్ట వేయాలని వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మాత్రం ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయించే బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజాన వేశారు. దీంతో నల్లగొండ రాజకీయాల్లో పట్టున్న ఉత్తమ్ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కాగితాలపై డిండి ఎత్తిపోతల బ్యారేజీ తంతు పూర్తయినా, క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. భూసేకరణ ప్రక్రియకు పాలమూరు జిల్లా అధికారులు మోకాలడ్డుతుండటంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఏదుల నుంచి నీటిని తరలిస్తే తమ ప్రాంత ప్రయోజనాలకు గండి పడుతుందని మహబూబ్‌నగర్ జిల్లా నేతలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పాలమూరు నేతలు పాదయాత్రలు, ధర్నాలు చేస్తుండటంతో.. అధికారులు భూసేకరణ జోలికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇది కాస్తా రెండు జిల్లాల మధ్య జలజగడానికి దారితీసి, తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
ఇలా ఒకే పార్టీ ప్రభుత్వంలో, పక్కపక్కనే ఉన్న రెండు జిల్లాల మధ్య నీటి వివాదం ముసలం పుట్టిస్తుండటంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు. తెలంగాణలో ప్రాంతాల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదాలు తలెత్తకుండా చూడాలని సూచించారు.
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని.. అదే సమయంలో ఏదుల రిజర్వాయర్ నుంచి రెండు జిల్లాలకు నీటి కేటాయింపులపై సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని ఇరు జిల్లాల నేతలకు స్పష్టం చేశారు.
అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇస్తున్న ఈ హితవును ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నేతలు ఎంతవరకు పాటిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుల దాహార్తిని తీర్చడం ఎంత ముఖ్యమో, మరోవైపు పాలమూరు రైతాంగం ప్రయోజనాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు ప్రాంతాల మధ్య సమన్వయం సాధించడంలో ప్రభుత్వం ఏ రకమైన మధ్యేమార్గం అనుసరిస్తుందనే దానిపైనే పొలిటికల్ హీట్ ఆధారపడి ఉంది. కేవలం రాజకీయ నినాదాల కంటే, శాస్త్రీయమైన నీటి పంపిణీ జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి.. సొంత ప్రభుత్వ హయాంలోనే జిల్లాలవారీగా రాజుకున్న ఈ నీటి మంటలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్‌గా మారాయి. ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా ఆశలు, సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు జిల్లా ఆందోళనల మధ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. గుత్తా సలహా ఈ పొలిటికల్ హీట్‌ను ఎంతవరకు తగ్గిస్తుందో వేచి చూడాలి.




