Burning Topic: శివసేన UBT ఖాళీ.. షిండే గూటికి ఆరుగురు ఎంపీలు!

Burning Topic: ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీలకు భారీ షాక్ తగిలింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Jun 2026 6:25 AM IST
Burning Topic
X

Burning Topic: శివసేన UBT ఖాళీ.. షిండే గూటికి ఆరుగురు ఎంపీలు!

Burning Topic: అంతర్గత తిరుగుబాట్లతో ఉక్కిరి బిక్కిరవుతున్న శివసేన యూబీటీ, తృణమూల్ పార్టీల తాజాగా పెద్ద దెబ్బే తిగిలింది. ఉన్న తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో ఏకంగా ఆరుగురు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడంతో ఉద్ధవ్ ఠాక్రే శిబిరం ఢీలా పడింది. అసలైన శివసేన తమదేనని రెబల్ ఎంపీలు చాటుకున్నారు. అటు తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి పెద్ద షాకే ఇచ్చారు తిరుగుబాటు ఎమ్మెల్యేలు. సీనియర్ నేత అనూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు రితబ్రత బెనర్జీ. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల్లో మరిన్ని ట్విస్టులు ఉంటాయని చెబుతున్నారు

మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన-యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీలు అధికారికంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో చేరారు. లోక్‌సభలో శివసేన UBTకి తొమ్మిది మంది ఎంపీలు ఉండగా, అందులో ఏకంగా ఆరుగురు పార్టీ మారారు.

సంజయ్​ హరిభావూ జాదవ్​, సాహెబ్​ రాజారామ్ వాక్​చౌరే, ఓంప్రకాశ్​ భూపాల్​ సింగ్​, నింబాల్కర్​, సంజయ్​ దినా పాటిల్​, సంజయ్​ ఉత్తమ్​రావ్​ దేశ్​ముఖ్​, నగేశ్​ బాపూరావ్​ పాటిల్ అస్తికర్లను స్వాగతించారు షిండే. ఈ పరిణామంతో లోక్‌సభలో షిండే వర్గం శివసేన ఎంపీల బలం 7 నుంచి 13కి పెరిగింది. తాజా పరిణామంతో తిరుగుబాటు ఎంపీల రాజకీయ భవితవ్యంపై కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. మూడింట రెండొంతుల మెజారిటీ ఎంపీలు శివసేన-యూబీటీని వీడటంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం లేదు.

తాజా పరిణామంతో శివసేనపై ఏక్‌నాథ్ షిండే పట్టు మరింత పెరిగింది. అలాగే మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం మరింతగా పెరిగింది. ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతంగా పూర్తయిందని ఏక్‌నాథ్ షిండే ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ రోజు ఇక్కడ నా పక్కన ఏకంగా ఆరు పులులున్నాయి. ఈసారి మేం సిక్స్‌ కొట్టాం’అని తెలిపారు.

ఈ ఎంపీలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన రాజకీయ దురంధరులు అంటూ పొగిడారు. వీరి చేరిక కోసం పక్కా ప్రణాళికతో చేపట్టిన ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతంగా పూర్తయిందంటూ చెప్పుకొచ్చారు. వీరంతా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాలేదు. తమ నియోజక వర్గాల బాగు కోసం వచ్చారని తెలిపారు 2022లో ఏక్‌నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే నుంచి విడిపోయి, పార్టీని రెండుగా చీల్చిన సంగతి తెలిసిందే. తాము చేసిన తిరుగుబాటుకు ప్రజల మద్దతు లభించిందని, ప్రస్తుతం శివసేనకు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారాయన

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కేవలం ముగ్గురు ఎంపీలే వచ్చారు. అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. దీనితో తిరుగుబాటు చేసిన ఆరుగురు ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారు షిండే వర్గంలో చేరడంతో ఆపరేషన్ టైగర్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. నాలుగేళ్లలో రెండుసార్లు పార్టీలో చీలిక రావడంతో శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉద్ధవ్ భావోద్వేగానికి లోనయ్యారు.

తనకు నాయకునిగా కొనసాగాలన్న కాంక్ష లేదని , పార్టీ నన్ను వద్దనుకుంటే బాధ్యతల నుంచి వైదొలిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీకి చెందిన వారు తదుపరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని ముందుకు వస్తే సంతోషిస్తానని పేర్కొన్నారు. కాగా కాగా ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎంపీలను దూషించి ఇప్పుడు వారిని వెనక్కి రమ్మడం ఏం పద్దతి అని ప్రశ్నించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌. శ

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ తిరుగుబాటు వర్గం మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాకులు ఇస్తోంది. టీఎంసీలో అసెంబ్లీ నుంచి ప్రారంభమైన విభేదాలు తరువాత పార్లమెంట్ వరకు విస్తరించగా, ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణానికే చేరుకున్నాయి ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్‌కతాలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్‌తో పాటు ఎమ్మెల్యేలు ఫిర్హాద్ హకీమ్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావెద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ అన్సారీకి పార్టీ కోశాధికారి బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తూ ఈ ఎన్నిక నిర్వహించినట్లు రితబ్రత తెలిపారు.

అరూప్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. హౌరా ప్రాంతానికి చెందిన ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, మమత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం టీఎంసీలో తిరుగుబాటు వర్గం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అరూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఒకప్పుడు మమతకు నమ్మినబంటుగా ఉన్న నేతే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా, 2022లో ఏర్పాటైన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు.

మమతా బెనర్జీపై వ్యక్తిగతంగా తామకు ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు రితబ్రత బెనర్జీ. ఆమె కోరుకుంటే తమ వర్గంలో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించవచ్చన్నారు. మమతకు తమ వద్ద గౌరవప్రదమైన స్థానం ఉంటుందని తెలిపారు. తాజా నిర్ణయాలకు సంబంధించి సమాచారాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని రితబ్రత బెనర్జీ చెప్పారు. పార్టీ అసలైనదా కాదా అన్నది తాము నిర్ణయించేది కాదని, ఎన్నికల సంఘమే దానిపై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొత్త నాయకత్వం ఏర్పడిన నేపథ్యంలో త్వరలోనే పార్టీ సంస్థాగత వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని రితబ్రత వెల్లడించారు. జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీతో పాటు అధికార ప్రతినిధుల బృందాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. దీంతో టీఎంసీలో రెండు వర్గాల మధ్య అధికార పోరు మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు అధికారిక మమతా బెనర్జీ బృందం వేగంగా స్పందించింది. . ఒకవైపు తిరుగుబాటు వర్గం తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తుండగా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులు, నాయకత్వంపై పోరు మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి దాకా ఇది కేవలం రాజకీయ తిరుగుబాటులా కనిపించినా.. అసలు పోరు ఎన్నికల సంఘం వద్ద జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. "అసలైన తృణమూల్ కాంగ్రెస్‌" ఎవరిది? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికుంది? తిరుగుబాటు వర్గం అసలు బలం ఎంత? మమతా బెనర్జీ తదుపరి అడుగు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లోనే తేలనున్నాయి. అందుకే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క అంశంపైనే ఉంది... టీఎంసీ సంక్షోభం అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలైందని చెబుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story