Burning Topic: మాల్దీవ్స్ చైనా కోసం భారత్‌ను వదిలేస్తుందా!

Burning Topic: భారత్ సాయంతో బ్రిడ్జ్ నిర్మించి, కీలకమైన థిలాఫుషి పోర్ట్ కాంట్రాక్ట్‌ను చైనాకు అప్పగించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2026 8:39 AM IST
Burning Topic
X

Burning Topic: మాల్దీవ్స్ చైనా కోసం భారత్‌ను వదిలేస్తుందా!

Burning Topic: తేలుకు కుట్టడం సహజ గుణం. దానికి ఎంత మేలు చేసినా తన విష పూరిత స్వభావాన్ని మార్చుకోదు. ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు చేస్తున్న పని ఇదే. గతంలో భారత వ్యతిరేక వైఖరి అవలంభించి తీవ్రంగా నష్టపోయి, తప్పయిపోయిందని చెంపలేసుకున్నారాయన. తన ‘ఇండియా ఔట్‌’ విధానం బెడిసి కొట్టడంతో తమను ఆదుకోవాలంటూ ఇండియానే వేడుకున్నారు. మన దేశం పెద్ద మనసు చేసుకొని ఆయన మొరను అంగీకరించింది. 2024లో భారత్‌, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్‌ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు ముయిజ్జు. తమ దేశ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ పనులు పురోగతిలో ఉన్న సమయంలో మన దేశానికి షాక్ ఇచ్చారు. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్‌ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించారు.

మాల్దీవుల రాజధాని మాలేలోని ఓడ రేవులపై రద్దీని తగ్గించి థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. థిలాఫుషికి భారత్‌ భారీ కనెక్టివిటీ వంతెనను నిర్మిస్తోంది. గ్రేటర్‌ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్‌వేలను భారత్‌ నిర్మిస్తోంది. మొత్తం 400 మిలియన్‌ డాలర్ల రుణం, మరో 100 మిలియన్‌ డాలర్ల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టుకు భారత్‌ మద్దతు ఇస్తోంది. ఈ దశలో మాల్దీవుల ప్రభుత్వం థిలాఫుషి పోర్ట్‌ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్‌ ఇంజినీరింగ్‌ కంపెనీకి అప్పగించించి దుష్టబుద్దిని చాటుకుంది. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్‌ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. అంటే సాయం చేసేది భారత్‌. ఫలితం దక్కేది మాత్రం చైనాకు.

మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక స్వతంత్ర పగడపు ద్వీప దేశం. ఇది భారత ప్రధాన భూభాగానికి లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవులకు దక్షిణంగా, శ్రీలంకకు నైరుతి దిశలో, విస్తరించి ఉంది. భౌగోళికంగా చిన్నదైనా భారత్‌కు అత్యంత కీలకమైన పొరుగు దేశాలలో ఇది ఒకటి.అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగపడే సముద్ర రవాణా మార్గాలు మాల్దీవుల సమీపం నుంచే వెళ్తాయి. మన చెందిన దాదాపు 50% విదేశీ వాణిజ్యం, 80% ఇంధన దిగుమతులు ఈ కీలక మార్గాల ద్వారానే జరుగుతాయి. భారత విదేశాంగ విధానమైన నైబర్ వుడ్ ఫస్ట్, విజన్‌కు మాల్దీవులు అతి ముఖ్యం. హిందూ మహాసముద్ర ప్రాంతంపై కన్నేసిన చైనా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ముసుగులో మాల్దీవుల్లో తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. అది భారత భద్రతకు నేరుగా ముప్పుగా మారుతుంది. అందుకే మాల్దీవులను చైనావలలో చిక్కుకోకుండా చూడటం భారత్‌కు అత్యవసరం.

భారత దేశానికి మాల్దీవుల భద్రత ఎంత అవసరమో, ఆ దేశానికి మన దేశం సాయం కూడా అంతే అవసరం. 1988లో మాల్దీవుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సైనిక కుట్ర జరగింది. ఆయన సాయం కోసం నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీకి అర్ధరాత్రి వేళ ఫోన్ చేశారు. భారత సైన్యం కేవలం 9 గంటల వ్యవధిలో "ఆపరేషన్ కాక్టస్" పేరుతో ప్యారాచుట్ల ద్వారా మాల్దీవుల రాజధాని మాలేలో దిగి ఈ తిరుగుబాటును అణచివేసింది. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా కేవలం 18 గంటల్లో ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసి మాల్దీవుల ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. ఈ ఘటన అంతర్జాతీయంగా భారత వ్యూహాత్మక శక్తిని చాటిచెప్పింది. మన దేశం మాల్దీవులకు ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన భాగస్వామిగా చూస్తూ, ఆ దేశ సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్తృతమైన సహాయాన్ని అందించింది.

భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న వేళ మొహమ్మద్ ముయిజ్జూ తెర మీదకు వచ్చారు. 2023లో ఆయన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసినప్పుడు తన ప్రచారంలో "ఇండియా అవుట్" నినాదాన్ని ఉపయోగించారు. భారత్‌ను దూరం పెట్టి, చైనాకు మరింత దగ్గరవ్వడం ఈ వ్యూహంలో భాగం. ఎన్నికల్లో విజయం సాధించగానే చైనా అనుకూల ఎజెండాను మొదలు పెట్టారు. ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు కాగానే చైనాలో పర్యటించి, ఆ దేశంతో అనేక రక్షణ, మౌలిక వసతుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మాల్దీవులలో సహాయక చర్యల కోసం ఉన్న సుమారు 80 మంది భారత సైనికులను వెనక్కి వెళ్లాలని పట్టుబట్టారు. ఈ సైనిక ఉనికి తమ దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తోందని వాదించారు. ఆహార భద్రత, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆయన తీసుకున్న నిర్ణయం భారత్‌కు వ్యూహాత్మకంగా ఆందోళన కలిగించింది.

అయితే మొయిజ్జు అవలంభించిన భారత్‌తో శత్రుత్వ విధానం కారణంగా మాల్దీవులు ఇబ్బందుల్లో పడ్డాయి. 2024 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన పర్యటనకు వెళ్లారు. అక్కడి దృశ్యాలను సోషల్ మీడియా ద్వారా పంచుకొని స్వదేశీ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని దేశ ప్రజలకు పిలుపుఇచ్చారు. అయితే మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు మోదీపై తీవ్ర అభ్యంతరకర, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది భారతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా "బాయ్‌కాట్ మాల్దీవ్స్" ఉద్యమాన్ని చేపట్టారు. దీనివల్ల మాల్దీవుల పర్యాటక రంగం భారీగా నష్టపోయింది, అప్పటి వరకూ పర్యాటకులలో భారతీయులదే అగ్రస్థానం. భారత పర్యాటకులు రాకపోవడంతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థతీవ్ర నష్టాలను చవిచూసింది. దీనితో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

మాల్దీవులు చైనాతో అతిగా చేతులు కలపడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పలేదు. చైనా తన 'బెల్ట్ అండ్ రోడ్' ప్రాజెక్టుల కింద మాల్దీవులలో విమానాశ్రయం ఆధునికీకరణ, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు ఇచ్చింది. మాల్దీవుల మొత్తం విదేశీ అప్పుల్లో దాదాపు 40% పైగా కేవలం చైనా నుంచే ఉంది. తమ సార్వభౌమత్వానికి ప్రమాదం రావడంతో పాటు చైనా నుండి ఆశించిన స్థాయిలో ఆర్థిక సాయం అందకపోవడంతో, మాల్దీవుల ప్రభుత్వం తన తప్పును గ్రహించి తిరిగి భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గతేడాది భారత ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించినప్పు మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డారు. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మన దేశం మాల్దీవులకు రూ 4,850 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొడిగించింది. ఆ ద్వీప దేశ వార్షిక రుణ చెల్లింపు బాధ్యతలను 40 శాతం మేర తగ్గించింది.

అయితే మాల్దీవులు పూర్తిగా భారత్‌ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. భారత్‌ నిర్మిస్తున్న బ్రిడ్జ్ చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్‌ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్‌గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల చైనాకు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. 2024లో భారత్‌, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని చేయాలని నిర్ణయించినా, అది చైనాకు ఇవ్వడం ద్వారా మొయిజ్జు వెన్నుపోటు అర్థమైపోయింది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్‌కు సున్నితమైన అంశం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story