Burning Topic: భారత్‌తో డుబుల్ గేమ్ ఆడుతున్న మాల్దీవ్స్!
Burning Topic: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పాకిస్థాన్ పర్యటనలో ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయి రక్షణ, భద్రత సహా 20 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Burning Topic: భారత్‌తో డుబుల్ గేమ్ ఆడుతున్న మాల్దీవ్స్!
Burning Topic: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తాజాగా మూడు రోజుల పాటు పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో చర్చలతో పాటు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, పోలీసింగ్, పౌర విమానయానం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పర్యాటకం తదితర రంగాల్లో 20 ఒప్పందాలు కుదిరాయి.
ప్రస్తుతం సుమారు 1.3 కోట్ల డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండేళ్లలో 20 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందాలు తమ మధ్య సహకారానికి కొత్త అధ్యాయమని ముయిజ్జు అభివర్ణించారు. 11 ఏళ్ల తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన వేళ ఈ పర్యటన జరిగింది.
పాకిస్థాన్‌లో ఎన్నికైన ప్రభుత్వ సారధి షెహబాజ్ షరీఫ్ కన్నా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలకంగా మారడం తెలిసిందే. ఆయనతో మాల్దీవ్స్ అధ్యక్షుడు జరిపిన చర్చల్లో ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారం, సంస్థాగత సంబంధాలు, సైనిక శిక్షణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పాక్ సాయుధ దళాల వృత్తి నైపుణ్యాన్ని మహమ్మద్ ముయిజ్జు ప్రశంసించారు. కాగా మాల్దీవ్స్ అధ్యక్షుని పాకిస్థాన్ పర్యటన సాధారణ దౌత్య పర్యటన స్థాయిలో లేదు.
ఆ దేశంతో ఏకంగా 20 ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా పరిధిని దాటినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాల్దీవ్స్ ఒకవైపు భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సహకారాన్ని పెంచుకునేందుకు అడుగులు వేయడం అనుమానాలకు తావిస్తోంది. ముయిజ్జు పర్యటన ప్రాంతీయ రాజకీయాల్లో ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయట పెడుతోంది.
హిందూ మహాసముద్రంలోని కీలక సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవులు భారత్‌కు వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశం.అలాంటి దేశం పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సంబంధాలను విస్తరించడం సహజంగానే మన దేశానికి ఆందోళన కలిగించాల్సిన అంశం. ఈ ఒప్పందాల ద్వారా మాల్దీవుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరం ఏర్పాటవుతోందని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు.
అయితే మాల్దీవ్స్ తన విదేశాంగ విధానాన్ని సవరించుకొని భారత్ తో పాటుగా అన్ని దేశాలతో సంబంధాలను విస్తరిస్తోందా? అనే సందేహం కూడా వస్తోంది. ముయిజ్జుతో షరీఫ్.. కశ్మీర్, సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ వైఖరిని వివరించారు. అయితే ఈ అంశాల్లో పాకిస్థాన్ వైఖరికి ముయిజ్జు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కాగా సార్క్‌ను తిరిగి క్రియాశీలం చేయాలని ముయిజ్జు కీలక ప్రతిపాదన చేశారు. 2016లో మన దేశంపై పాకిస్థాన్ ఉగ్రదాడి తర్వాత సార్క్ సమావేశాల నిర్వహణలో ప్రతిష్టంభన ఏర్పడింది.
మహమ్మద్ ముయిజ్జు రాజకీయ ప్రస్థానంలో భారత వ్యతిరేక వైఖరి మొదటి నుంచీ కీలకంగా ఉంది. 2023 జరిగిన మాల్దీవ్స్ అధ్యక్ష ఎన్నికల్లో ‘ఇండియా అవుట్’ ప్రచారంతో ఆయన అధికారంలోకి వచ్చారు. అనంతరం మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక సిబ్బందిని వెనక్కి పంపించి, వారి స్థానంలో పౌర సాంకేతిక సిబ్బందిని నియమించారు.
ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే కొద్ది కాలంలోనే ఆయన ఇండియా ఔట్ విధానం బెడిసికొట్టి ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని మోదీ లక్ష ద్వీప్ పర్యటన రంగ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలపై మాల్దీవ్స్ మంత్రులు నోరు పారేసుకోవడంతో, ఆగ్రహించిన భారతీయులు ఆ దేశ పర్యాటకు రంగాన్ని బహిష్కరించారు. దీంతో తప్పయిపోయిందని చెంపలేసుకున్నారు మొయిజ్జు. తన దేశాన్ని ఆదుకోవాలని వేడుకోవడంతో పెద్ద మనసుతో అంగీకరించారు ప్రధాని మోదీ.
2024లో భారత్, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు ముయిజ్జు. తమ దేశ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ పనులు పురోగతిలో ఉన్న సమయంలో మన దేశానికి షాక్ ఇచ్చారు. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించారు.
తాజాగా పాకిస్థాన్‌తో మాల్దీవ్స్ సంబంధాలు ఏర్పరచుకొని రక్షణ, సముద్ర భద్రత సహకారాన్ని పెంచుకోవడం కొత్త చర్చకు కారణమైంది. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే పాకిస్థాన్‌తో వ్యూహాత్మక సంబంధాలను విస్తరించాలనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అవి భారత్-మాల్దీవుల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అన్నది రానున్న పరిణామాలే నిర్ణయించనున్నాయి.
మాల్దీవులు చైనాతో అతిగా చేతులు కలపడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పలేదు. చైనా తన 'బెల్ట్ అండ్ రోడ్' ప్రాజెక్టుల కింద భారీగా అప్పులు ఇచ్చింది. తమ సార్వభౌమత్వానికి ప్రమాదం రావడంతో పాటు చైనా నుండి ఆశించిన స్థాయిలో ఆర్థిక సాయం అందకపోవడంతో, మాల్దీవ్స్ తిరిగి భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకుంది. మన దేశం మాల్దీవులకు రూ 4,850 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొడిగించింది. ఆ ద్వీప దేశ వార్షిక రుణ చెల్లింపు బాధ్యతలను 40 % మేర తగ్గించింది.
ఇప్పుడు పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం వల్ల మాల్దీవులకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కష్టకాలంలో మాల్దీవులను సకాలంలో ఆదుకునే సామర్థ్యం పాక్‌కు చాలా పరిమితం. మాల్దీవులకు నిత్యావసరాలు, మందులు, అత్యవసర సాయం, మౌలిక వసతుల కల్పనలో ఏ అవసరం పడ్డా సమీపంలోని భారత్ మీదే ఆధారపడక తప్పదు.
మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక స్వతంత్ర పగడపు ద్వీప దేశం. ఇది భారత ప్రధాన భూభాగానికి లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవులకు దక్షిణంగా, శ్రీలంకకు నైరుతి దిశలో, విస్తరించి ఉంది. భౌగోళికంగా చిన్నదైనా భారత్‌కు అత్యంత కీలకమైన పొరుగు దేశాలలో ఇది ఒకటి. అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగపడే సముద్ర రవాణా మార్గాలు మాల్దీవుల సమీపం నుంచే వెళ్తాయి.
మన చెందిన దాదాపు 50% విదేశీ వాణిజ్యం, 80% ఇంధన దిగుమతులు ఈ కీలక మార్గాల ద్వారానే జరుగుతాయి. భారత విదేశాంగ విధానమైన నైబర్ వుడ్ ఫస్ట్, విజన్‌కు మాల్దీవులు అతి ముఖ్యం. ఇప్పటికే చైనా ఇక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ముసుగులో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. తాజాగా పాకిస్థాన్ కూడా మాల్దీవుల మీద కన్నేసింది. అది భారత భద్రతకు నేరుగా ముప్పుగా మారుతుంది. అందుకే మాల్దీవులను చైనా, పాకిస్థాన్‌ల వలలో చిక్కుకోకుండా చూడటం అత్యవసరం.




