Off The Record: కేసీఆర్ కు బిగ్ షాక్?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం! మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 May 2026 6:31 AM IST
Off The Record
X

Off The Record: కేసీఆర్ కు బిగ్ షాక్?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ టూర్ హీట్ పెంచుతోందా..? ప్రధాని పర్యటనతో కాషాయ పార్టీ గేర్ మార్చనుందా..? ప్రధాని రాక అభివృద్ధి మంత్రమా..? ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టడమా..? మూడు కార్పొరేషన్ మేయర్ పీఠాలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారా..? రాజకీయ, సామాజిక, ఆర్థిక బలమున్న నేతలపై బీజేపీ కన్నేసిందా..? నిజంగానే బీజేపీ కన్ను మల్లారెడ్డి ఫ్యామిలీపై పడిందా..? మల్కాజిగిరి కార్పోరేషన్ మేయర్ పీఠం ప్రీతిరెడ్డికేనా..? ఎంపీ ఈటల భవిష్యత్ ఏంటి..? ఇంతకీ బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి..? లెట్స్ వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్...

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పైకి అభివృద్ధి కార్యక్రమాలే కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం మరో చర్చ నడుస్తోంది. మూడు రాష్ట్రాల గెలుపు జోష్ మంత్రంతో బీజేపీ అధిష్టానం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టిందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే మూడు మేయర్ పీఠాలే లక్ష్యంగా ప్లాన్ సిద్ధం చేసిందట లోటస్ పార్టీ. ప్రధాని టూర్ వేళ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. ఇక ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన నేతలకు గాలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసిందట బీజేపీ అధినాయకత్వం. హైదరాబాద్ నగరం పరిపాలనా సౌలభ్యం కోసం స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం.. జీహెచ్ఎంసీని మూడు కార్పోరేషన్లుగా విభజించింది.. హైదరాబాద్ 150, సైబరాబాద్ 76, మల్కాజ్‌గిరి 74 వార్డులుగా.. మొత్తం 300 డివిజన్లు చేసింది.. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల మధ్య గ్రేటర్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పార్టీల మధ్య హీట్ పెరిగింది.

గ్రేటర్ ఎన్నికలపై కమల దళం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలను సెమీఫైనల్‌గా అధిష్టానం భావిస్తోంది. మూడు మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా మల్కాజిగిరి కార్పొరేషన్‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందట. మేయర్ పీఠం గెలుపు మంత్రాన్ని జపిస్తోందట. అదే కార్పోరేషన్‌లో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలంగా ఉన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబంపై దృష్టి పడిందట. పూలమ్మినా, పాలమ్మినా అంటూ అన్ని వర్గాల ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు మల్లన్న. ఇప్పటికే మల్లారెడ్డి కుటుంబం.. రాజకీయంగా కొత్త దారి చూస్తోందనే టాక్ లేకపోలేదు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడం... ఇంకోవైపు కోడలు ప్రీతిరెడ్డి.. బీజేపీ ఆఫీస్‌కి వెళ్లడం.. ఇవన్నీచూస్తుంటే.. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగానే అంతా డీల్ సెట్ చేసుకున్నారనే టాక్ ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో రీసౌండ్ చేస్తోంది. అయితే ప్రీతిరెడ్డి మాత్రం కేవలం యూనివర్సిటీ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే మోదీని కలిసినట్టు ఆమె స్పష్టం చేశారు. అయినా.. ఈ భేటీ వెనుక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మల్కాజిగిరి కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రీతిరెడ్డిని రంగంలోకి దించాలనే వ్యూహంతో బీజేపీ ప్లాన్ వేసినట్టు జోరుగా చర్చ నడుస్తోంది. మాజీమంత్రి మల్లారెడ్డికి స్థానికంగా బలమైన నెట్‌వర్క్, అదే కార్పోరేషన్ పరిధిలో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉండటం, స్థానిక నేతలతో పట్టు.. ఇవన్నీ లెక్కలేసుకున్న బీజేపీ.. మల్లారెడ్డి కుటుంబంపై స్పెషల్ ఫోకస్ పెట్టిందంటున్నారు. మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ అధినాయకత్వం ఒక ప్రత్యేక వ్యూహమే రచించినట్టు టాక్.

అతిపెద్ద పార్లమెంట్‌ కావడంతోపాటు అత్యధిక ఓట్లు, హిందూ ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా ఉండటంతో మల్కాజిగిరి కార్పొరేషన్‌ను కాషాయ జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ పక్కా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి కోడలు, ప్రముఖ విద్యావేత్త, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ కలిగిన ప్రీతిరెడ్డి‌పై బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగం చేయనుందన్న టాక్ లేకపోలేదు. ఇందుకు కారణమూ లేకపోలేదట. ప్రీతిరెడ్డి స్వయంగా డాక్టర్. పైగా వైస్ ఛైర్ ‌పర్సన్‌ హోదాలో మల్లారెడ్డి విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులను ఒంటి చేత్తో డీల్ చేయడంలో నేర్పరి. మీడియా ఫోకస్ కూడా ఎక్కువే. డివోషనల్, కల్చరల్ యాక్టివిటీస్‌లోనూ ఆమె చలాకీగా ఉంటారు. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలని ఉందన్న మనసులో మాటను ఆమె పలు ఇంటర్వ్యూల్లో బయటపెట్టారు. అంటే.. ఓ చేత్తో విద్యాసంస్థల నిర్వహణ.. మరో చేత్తో రాజకీయాల చేస్తానని ఆమె చెప్పకనే చెప్పారన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ప్రధాని మోదీ విధానాలపై పొగడ్తలు, ఆపరేషన్ సింధూర్‌పై ప్రశంసలు, భాగ్యనగర్ పేరు మార్పు, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి శోభాయాత్ర కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడం.. మోదీతో భేటీ, ఇంఛార్జితో భేటీ, గతంలో బండి సంజయ్‌తో లంచ్ మీట్.. ఇలా ఏ సందర్భం చూసినా.. బీజేపీ విధానాల పట్ల ప్రీతిరెడ్డి ఆకర్షితురాలయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. వీటినిబట్టి చూస్తే మల్లారెడ్డి కోడలు కచ్చితంగా కమలవనంలో చేరుతారనడానికి బలమైన సంకేతాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి.. ఒక్కరే బీజేపీవైపు అడుగులు వేస్తున్నారా..? లేక మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం బీజేపీలో ఎంట్రీకి గ్రౌండ్ రెడీ అయిందా..? అన్న గుసగుసలు లేకపోలేదు.

ఇటీవల బీజేపీ ఇంఛార్జి చంద్రశేఖర్ తివారీతో గంటపాటు సాగిన భేటీలో ప్రీతిరెడ్డి కొన్ని ప్రతిపాదనలు చేశారని వినికిడి. డీలిమిటేషన్ జరిగితే మా ఫ్యామిలీకి 4 టికెట్లు ఇవ్వాలని, మల్కాజిగిరి పార్లమెంట్‌లో ఒక సీటు తనకు, మేడ్చల్‌లో ఒక సీటు భద్రారెడ్డికి, రెండో సీటు మల్లారెడ్డికి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మూడో సీటు ఇవ్వాలని అడిగారన్నచర్చ కూడా రీసౌండ్ చేసింది. అయితే ఆ ప్రతిపాదనలకు బీజేపీ మాత్రం కాస్త గట్టిగానే బ్రేక్ వేసిందట. ముందు పార్టీలో చేరి పని చేయండి.. ఆ తర్వాత టికెట్ల సంగతి చూద్దాం అని చెప్పినట్టు సమాచారం. డీలిమిటేషన్ నేపథ్యంలో ముందే భరోసా ఇస్తే భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు రావొచ్చని బీజేపీ భావిస్తోందట. ఇక మల్లారెడ్డి ఫ్యామిలీ తన వ్యాపార విస్తరణ కోసం దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే బీజేపీవైపు ప్రీతిరెడ్డి చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తెరపైకి మల్లారెడ్డి కోడలు బీజేపీ మేయర్ అభ్యర్థి అంటూ ప్రచారం మహానగరమంతా చుట్టేస్తోందట.

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో.. ప్రీతిరెడ్డిని బీజేపీలో చేర్చుకొని రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మల్కాజిగిరి మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ చూస్తోందట. ఇలా ఉంటే.. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి..? అన్న చర్చ కూడా జోరందుకుంది. నిజంగానే ప్రీతిరెడ్డి.. బీజేపీలో చేరితే.. ఈటల ఆమెను స్వాగతిస్తారా..? ఏకంగా ఈటలకే చెక్ పెట్టేందుకు ప్రీతిరెడ్డిని బీజేపీ రంగంలోకి దించుతోందా..? అన్న చర్చ కూడా లేకపోలేదు. ఈపాటికే పార్టీలో వర్గపోరుతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఈటలకు మల్లారెడ్డి కుటుంబం చేరితే.. ఎదురయ్యే పరిస్థితుల ప్రభావంపై సస్పెన్స్ నెలకొంది. ఈటల కూడా తన సొంత ఇలాకా.. హుజురాబాద్‌పై ఆసక్తికరంగా ఉన్నారని, అందుకే ప్రీతిరెడ్డిని మల్కాజిగిరి బరిలో దించేందుకు బీజేపీ స్కెచ్ వేసిందని చెబుతున్నారు.

మొత్తానికి ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ మల్లారెడ్డి కుటుంబం గాని.. ప్రీతిరెడ్డి సింగిల్‌గా గానీ మోదీ సమక్షంలో కాషాయ తీర్థం తీసుకుంటారా..? లేదా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాషాయం కండువా కప్పుకోవడం నిజమే అయితే.. మల్కాజిగిరి ఎంపీ సీటే అసలు టార్గెట్టా..? మేయర్ రేసులో నిలుస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. ఇంతకీ ప్రధాని టూర్‌‌లో ఏం తేలనుందో చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story