Off The Record: మామా-అల్లుళ్ల గొడవ?.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?
Off The Record: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయ సెగలు పుడుతున్నాయి.
Off The Record: మామా-అల్లుళ్ల గొడవ?.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?
Off The Record: ఏపీలోని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో.. రాజకీయమే సెపరేటు. టీడీపీ నుంచి ఇక్కడ వరుసగా గెలిచిన కొమ్మాలపాటి శ్రీధర్‌ను 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన నంబూరి శంకరరావు ఓడించారు. 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఆయనకు బంధుత్వం ఉంది. అమరావతి వ్యవహారంలో నాటి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరించినా.. నంబూరి శంకరరావు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు తన హయాంలోనే ప్రభుత్వం నుంచి నిధులు, అనుమతులు తెప్పించారు. ఆ సమయంలో టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా.. తన పని తాను చేసుకుపోయారనే అభిప్రాయం ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి వేవ్‌లో ఆయన సైతం పెదకూరపాడు నుంచి ఓడిపోయారు.
2024లో నంబూరి శంకరరావుపై టీడీపీ నుంచి ఆయన అల్లుడు బాష్యం ప్రవీణ్ పోటీ చేసి విజయం సాధించారు. అనతికాలంలోనే టీడీపీ అధినాయకత్వానికి దగ్గరయ్యారు. రాజధాని పొరుగు నియోజకవర్గం కావటంతో ప్రాధాన్యత పెరిగింది. అయితే, బంధుత్వం ఉన్నా, నంబూరి శంకర రావు - భాష్యం ప్రవీణ్ మధ్య మాత్రం రాజకీయంగా సవాళ్లు - ప్రతిసవాళ్లు తగ్గటం లేదు. నియోజకవర్గంలో తన హయాంలోనే అసలైన అభివృద్ధి జరిగిందని ఇప్పటికీ శంకరరావు వాదన కొనసాగిస్తున్నారు. తాను తీసుకొచ్చిన పనులనే ప్రవీణ్ కొనసాగిస్తున్నారని, ఆ అయిదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని సవాల్ చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రవీణ్ మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాతే నియోజకవర్గంలో కొత్తగా అభివృద్ధి పనులు జరగుతున్నాయని ప్రవీణ్ చెబుతున్నారు.
నియోజకవర్గంలో కీలకమైన బెల్లంకొండ - అమరావతి రోడ్డు పనులు తానే తీసుకొచ్చానని ప్రవీణ్ చెబుతున్నారు. ప్రజల వద్దకు పాలన అంటూ ఎమ్మెల్యే ప్రవీణ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా 100రోజులు -100 గ్రామాల సందర్శనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఇదే సమయంలో మరోసారి మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు తెర మీదకు వచ్చారు. తాను చేసిన పనులను ప్రస్తావిస్తున్నారు. ఇలా.. అభివృద్ధి విషయంలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఇద్దరు తాము చేసామంటే తామే చేసామన్న వాదన వినిపిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. నియోజకవర్గంలో పనులు కొనసాగటం మాత్రం స్థానికంగా ప్రజలకు కలిసొచ్చే అంశంగా మారుతోంది.
ఇదే సమయంలో సున్నితమైన నియోజకవర్గం కావటంతో.. రాజకీయ ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా... పనుల విషయంలో పోటీ ఉంటేనే మంచి జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న రాజకీయం ఈ నియోజకవర్గంలో ఎవరికి కలిసి వస్తుందో చూడాలి.




