Burning Topic: బెంగాల్ లో బీజేపీ బ్రహ్మాస్త్రం.. దీదీ అష్టదిగ్బంధనం!

Burning Topic: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీకి టెన్షన్. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోటలకు బీటలు?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 11:27 AM IST
Burning Topic
X

Burning Topic: బెంగాల్ లో బీజేపీ బ్రహ్మాస్త్రం.. దీదీ అష్టదిగ్బంధనం!

Burning Topic: అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ పశ్చిమ బెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి టెన్షన్ పెరుగుతోంది. బెంగాల్ శాసనసభకు 294 స్థానాలకు గాను 2026 ఏప్రిల్ 23, 29.. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు 2026 మే 4న విడుదల కానున్నాయి. ఈ రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా తృణమూల్​కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. 2011లో వామ పక్ష ప్రభుత్వ పాలన అంతరించిన తర్వాత మమతా బెనర్జీ బలమైన నాయకురాలిగా ఎదిగారు. బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న దీదీకి తాజాగా పెను సవాల్ ఎదురవుతోంది. బెంగాల్‌లో ఇక తనకు ఎదురు లేదని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో.. అకస్మాత్తుగా బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 సీట్లు గెలుచుకోవడం టీఎంసీకి షాక్ తెప్పించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఈసారి కూడా బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

పశ్చిమ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 నుంచి 1977 వరకూ 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగింది. ఆ 1977లో అధికారంలోకి వచ్చిన సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయి. 2011లో వామపక్షాలను ఓడించడం ద్వారా మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అయితే మమత పాలనలో పశ్చిమ బెంగాల్ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పారిశ్రామికంగా వెనుకబడింది. నిరుద్యోగం, పేదరికం మరింతగా పెరిగాయి. ఇంతకాలం సంతుష్టీకరణ రాజకీయాలను అవలంభిస్తు టీఎంసీని బీజేపీ ఇప్పుడు గట్టిగా నిలదీస్తోంది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వంటి అవినీతి అంశాలు పార్టీ ప్రతిష్టకు సవాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ‘దీదీ’కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈసారి ఆమెకు ప్రధాన శత్రువులు ప్రతిపక్షాలు కాదు.. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణే అని విశ్లేషకులు అంటున్నారు.

తాజా ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్ జరగనుంది. కాగా 152 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 35,97,704 మంది ఓటర్ల భవితవ్యం ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ మీదే ఆధారపడి ఉంది. బంగ్లాదేశీ చొరబాటు ఓటర్లే పునాదిగా నిర్మించుకున్న కంచుకోటను ఈసీ ఓటర్ల సవరణ ప్రక్రియ బలంగా కొడుతోందని టీఎంసీ భావిస్తోంది. విచారణలో ఉన్న 60.06 లక్షల మంది ఓటర్లలో ఏప్రిల్ 5 నాటికి 57 లక్షల కేసులను ఈసీ పరిష్కరించింది. ముస్లిం జనాభా అధికంగా ఉండే నార్త్ దినాజ్‌పూర్‌లోని ఒక్క 'గోల్పోఖర్' నియోజకవర్గంలోనే 78,475 మంది ఓటర్లు విచారణలో ఉండగా.. గిరిజన జనాభా అధికంగా ఉండే బంకురా, పురూలియా జిల్లాలను పూర్తిగా కలిపినా ఆ సంఖ్య 72,694 మాత్రమే ఉండటం గమనార్హం. మైదానంలో తమకు ప్రతిపక్షమే లేదు. ఎన్నికల సంఘంతోనే పోరాడుతున్నాం అంటోంది టీఎంసీ

టీఎంసీకి ఈసారి ఎన్నికల గణాంకాలు ఏమాత్రం సానుకూలంగా లేవు. 2021లో 55 స్థానాల్లో టీఎంసీ 15,000 లోపు మెజారిటీతో బయటపడింది. అందులో 39 చోట్ల మెజారిటీ 10 వేల లోపే. ఒకవేళ ఏమాత్రం వ్యతిరేక పవనాలు వీచినా, ఈ 55 సీట్లు చేజారి, టీఎంసీ బలం 170కి పడిపోతుంది.2024 లోక్‌సభ లెక్కల ప్రకారం చూస్తే, అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 వేల లోపు స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాలు 69కి పెరిగాయి. మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీపూర్, మానిక్తల, రాస్ బిహారీలలో మార్జిన్ తగ్గగా.. రాజార్‌హట్-గోపాల్‌పూర్‌లో మెజారిటీ కేవలం 74 ఓట్లే! ఈ లెక్కన స్వల్ప స్వింగ్ వచ్చినా టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 146కి పడిపోయే ప్రమాదం ఉంది. ముస్లిం బెల్ట్ అయిన నార్త్ దినాజ్‌పూర్, మాల్డా, ముర్షిదాబాద్, బీర్భూమ్ లలోని 52 స్థానాలతో పాటు, సౌత్, నార్త్ 24 పరగణాలు, హౌరా జిల్లాల్లో టీఎంసీకి ఎదురులేదని చెబుతున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లు దాటినా అది తమకు పెద్ద ప్రమాద హెచ్చరికేనని టీఎంసీ అంటోంది. తాజాగా తృణమూల్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ముందు మరో పహల్గాం దాడి జరుగుతుందా..? బీజేపీ దగ్గర దానికి సంబంధించి బ్లూప్రింట్ రెడీగా ఉంది.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ కతాను టార్గెట్ చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పినా మోదీ మాట్లాడక పోవడమేంటి..? మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.. అని ప్రధాని మోదీ ఎందుకు అనలేకపోయారు. దీని ప్లానింగ్ ముందే రెడీ గా ఉందా..? ఎలక్షన్స్ ముందు మరో పహల్గాం దాడికి సిద్ధమయ్యారా..? అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ ఘాటుగా స్పందించింది. మైనారిటీల ఓటు బ్యాంకు కోసమే మమతా ఈ వ్యాఖ్యలు చేసిందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ పార్టీ అని ఆరోపించారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story