Burning Topic: కాంగ్రెస్ లోకి మమతా బెనర్జీ? కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం?

Burning Topic: తృణమూల్ కాంగ్రెస్ (TMC) కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందా? మమతా బెనర్జీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Jun 2026 6:58 AM IST
Burning Topic
X

Burning Topic: కాంగ్రెస్ లోకి మమతా బెనర్జీ? కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం?

Burning Topic: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పార్టీలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా టీఎంసీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చీలిపోవడం, కొందరు పార్టీని వీడటంతో తీవ్ర అసమ్మతి చోటుచేసుకుంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతుండటంతో టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండీ కూటమి సమావేశంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు అన్నీ విభేదాలు వదిలి, కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమిలోని పార్టీల మధ్య మరింత సమన్వయం, ఐక్యత అవసరం అని నొక్కిచెప్పారు. ఆ తర్వాత మరిన్ని కీలక పరిణమాలు చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టీఎంసీ నేతల వరుస భేటీలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మమతా బెనర్జీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్య భేటీ జరిగింది. అంతకు ముందు ఇండీ కూటమి సమావేశంలో వీరిద్దరూ ఆలింగనం చేసుకున్న ఒక ఫొటోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అయితే ఆ ఇరువురు మహిళా నేతల సమావేశానికి సంబంధించిన వివరాలను మాత్రం ఇరు పార్టీలు అధికారికంగా వెల్లడించలేదు. అయితే టీఎంసీలో సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని సోనియా గాంధీ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు కొంత సమయం కావాలని మమతా బెనర్జీ కోరినట్టు చెబుతున్నారు. మరోవైపు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​బెనర్జీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ పార్టీ విలీనం ఖాయం అనే ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

టీఎంసీ అంతర్గత విభేదాలు, పలువురు ప్రముఖుల పార్టీని వీడుతున్న సమయంలోనే ఈ సంప్రదింపులు జరుగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌పై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల ప్రతిపక్షం బలోపేతం అవుతుందని.. బీజేపీని ఎదుర్కోవడం సులభమవుతుందని మమతకు సోనియా సూచించినట్లు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీవంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్‌లో కలవాలని శివసేన ఉద్దవ్‌ వర్గం నేత సంజయ్‌ రౌత్ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో టీఎంసీ వర్గాలు స్పందించక తప్పలేదు.. కాంగ్రెస్‌లో తృణమూల్ కాంగ్రెస్​విలీనం కానుందనే ప్రచారం నిరాధారమైన వార్తగా స్పష్టం చేశారు. మరోవైపు విలీన కథనాలకు కాంగ్రెస్‌ కూడా ఖండించింది. అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ఇండీ కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్లు వెల్లడించారు.

మరోవైపు కాంగ్రెస్‌లో తృణమూల్ కాంగ్రెస్ విలీనం అనే వార్తలు పశ్చిమ బెంగాల్‌లో ప్రకంపణలు రేపాయి. బెంగాల్ కాంగ్రెస్ నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.మమతను తీసుకుంటే 15 ఏళ్ల టీఎంసీ అరాచక, అవినీతి పాలన ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడుతుందని అంటున్నారు. అధిష్ఠానంపై పూర్తి నమ్మకం ఉంది.. మమతా బెనర్జీతో పొత్తు ఉండదని సీనియర్‌ నేత అబ్దుల్‌ మన్నాన్‌ వ్యాఖ్యానించారు. మురికినీరు కలిస్తే స్వచ్ఛమైన నీరు కూడా కలుషితమవుతుంది అని తెలిపారు. మరో సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి కూడా విలీన వార్తలపై ఘాటుగా స్పందించారు. ‘పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ను తుడిచేయాలన్న లక్ష్యంతో ఒకప్పుడు మమత పార్టీని చీల్చారు.. ఇప్పుడు ఆమే.. గాంధీ కుటుంబం మద్దతు కోరుతున్నారు. ఎవరు చేసిన రాజకీయ చర్యలకు వారు బాధ్యత వహించాల్సిందే’’ అని స్పష్టం చేశారాయన. అయితే రేపు ఏదైనా జరగవచ్చు అని వ్యాఖ్యానించారు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ శంకర్.

మమతా బెనర్జీ 1998లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత తృణమూల్​ కాంగ్రెస్ స్థాపించారు. ఈ పార్టీని బలోపేతం చేసి 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా కమ్యూనిస్టుల 34 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడారు. ఆ తర్వాత వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయాలను నమోదు చేశారు మమత. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో టీఎంసీ ఘెరంగా ఓడిపోయింది. ఆ తర్వాత పరిణమాల్లో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబాటు చేశారు. మొత్తం 80 మంది శాసనసభ్యుల్లో 58 మంది టీఎంసీ శాసనసభా పక్షం నుంచి విడిపోయారు. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందారు. తమదే అసలైన తృణమూల్‌ అని, కాంగ్రెస్‌లో విలీనమయ్యే ఉద్దేశం ఎంత మాత్రం లేదని తెలిపారాయన. తమకు మద్దతిస్తున్న ఎమ్యెల్యేల సంఖ్య 58 నుంచి 64కు పెరిగిందని అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభం ఇప్పట్లో ఆగేలా లేదు. ఢిల్లీకి కూడ పాకింది. ఎంపీ కాకోలి ఘోష్​ దస్తీదార్ నేతృత్వంలో 20 మంది తిరుగుబాటు ఎంపీలు తాము టీఎంసీ నుంచి వేరుగా ఉంటామని లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లాకు లేఖ రాశారు. వీరిలో భారత మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్, నటి సయోనీ ఘోష్, నటుడు శత్రుఘ్న సిన్హా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎంపీలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు అవసరమైన పార్లమెంటరీ పార్టీలో మూడింట రెండు వంతుల మెజారిటీని సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఎంసీ సీనియర్‌ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ తన రాజ్యసభ సీటుకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్‌.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో భేటీ అయ్యారు. 2021లో కాంగ్రెస్‌ నుంచి టీఎంసీలోకి చేరిన సుష్మిత ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story