Off The Record: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ

Off The Record: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ షాక్! పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు బీజేపీలో చేరనున్నారా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 May 2026 6:34 AM IST
Off The Record
X

Off The Record: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ

Off The Record: పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నేపథ్యంలో రోజురోజుకూ అనేక సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. దీదీకి కుటుంబంలోనే కాక పార్టీలోనూ అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ మూగరోధన అనుభవించిన తృణమూల్ నేతలు ఆ పార్టీ ఓడిపోవడంతో.. బడా కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నారట. ఫలితంగా.. తృణమూల్ కాంగ్రెస్‌లో భారీ చీలిక వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారట. తృణమూల్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వీరంతా టీఎంసీ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ పెద్దల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారట. కమలదళం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తృణమూల్‌కు టాటా.. వీడ్కోలు చెప్పేసి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారట.

ఇటీవల జరిగిన బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం మూటకట్టుకోవడంతో ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయి. సుమారు 15 ఏళ్ల అధికారానికి చెక్ పెడుతూ బీజేపీ.. చారిత్రక ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీఎంసీ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. టీఎంసీకి చెందిన 29 మంది లోక్‌సభ సభ్యుల్లో దాదాపు 12 మంది ఎంపీలు ఇప్పటికే కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. మరో ఐదారుగురు ఎంపీలతో కూడా చర్చలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తం మీద 19 నుంచి 20 మంది ఎంపీలను ఒకే తాటిపైకి తెచ్చి, ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేలా ఒక పక్కా వ్యూహం అమలవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడింట రెండు వంతుల మంది పార్టీ మారిపోతే దాన్ని విలీనం కేటగిరీలో చేర్చడం ద్వారా అనర్హతా వేటును తప్పించుకోవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ లెక్కన 20 మంది ఎంపీలు పార్టీ మారితే వారిపై అనర్హత వేటు పడే ఛాన్సే లేదు.

రాజ్యసభ ఎంపీలు సైతం ఫిరాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టాక్. ప్రస్తుతం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 13 మంది సభ్యులు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కనీసం 8 మంది రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు వినికిడి. లోక్‌సభలో ఇప్పటికే మెజారిటీ ఎంపీలు చేజారిపోయే పరిస్థితి నెలకొంది. అటు రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైతే పరిస్థితి ఏంటన్న ప్రశ్న నెలకొంది. ఈ వార్తలు నిజమై రాజ్యసభ ఎంపీలు కూడా తిరుగుబాటుకు పాల్పడితే పార్లమెంటులో టీఎంసీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో ఈ వలసలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఈ తిరుగుబాటు, వలసలు, అసంతృప్తుల పరిణామం మమతా బెనర్జీకి, అభిషేక్ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ కానుందన్న వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా భావించే కొందరు నేతలు కూడా పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత పార్టీలో నాయకత్వంపై అసంతృప్తి పెరిగినట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతేకాక భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న నేతలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారట. ఇలా ఉంటే మునిగిపోనున్న పార్టీని కాపాడుకోవడానికి టీఎంసీ అధినాయకత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందట. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తమ నేతలెవరూ పార్టీని వీడే అవకాశం లేదనీ టీఎంసీ హైకమాండ్ వాదిస్తోంది. అయితే నేతలు వరుసగా పార్టీని వీడితే టీఎంసీ మళ్లీ కోలుకోవడం అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story