Off The Record: మంచిర్యాల బీజేపీలో అసంతృప్తి

Off The Record: మంచిర్యాల జిల్లా బీజేపీలో కొత్త కమిటీ ఎంపిక దుమారం రేపింది. రఘునాథ్ వెరబెల్లిపై ఆరోపణలు చేస్తూ అసమ్మతి నేతలు తిరుగుబాట పట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Oct 2026 8:00 AM IST
Off The Record
X

Off The Record: మంచిర్యాల బీజేపీలో అసంతృప్తి

Off The Record: మంచిర్యాల జిల్లా బీజేపీ కొత్త కమిటీ ప్రకటనతో మొదలైన అసంతృప్తి.. ఇప్పుడు రోడ్డున పడింది. కీలక నేతల తీరుతో విసిగి వేశారిన నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గాలకు కమిటీలో తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని.. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను, కార్యకర్తలను పక్కనపెట్టి కొందరు నేతలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ, దళిత, ఇతర సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం దక్కలేదని అసమ్మతి వర్గం ప్రశ్నిస్తోంది. పార్టీ బూత్ స్థాయి నిర్మాణం, క్షేత్రస్థాయి కార్యకర్తల కంటే వ్యక్తిగత వర్గాలకు ప్రాధాన్యం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక రఘునాథ్ వెరబెల్లి చుట్టూ జిల్లా పార్టీలో అసమ్మతి రాజకీయాలు తిరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల వ్యవహారాల్లో అంతర్గతంగా కొందరు నేతలు ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను అసమ్మతి వర్గం తెరపైకి తెస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ నుంచి బీఫారాల కేటాయింపు వరకు.. పార్టీ అభ్యర్థులకు నష్టం కలిగించేలా అంతర్గతంగా నిర్ణయాలు జరిగాయని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ వివాదం ఇక్కడితో ఆగడం లేదు. పార్టీ నిధులు, నాయకత్వ నిర్ణయాలు, వ్యక్తిగత వర్గాలకు ప్రాధాన్యం వంటి అంశాలపైనా అసమ్మతి వర్గం ప్రశ్నలు సంధిస్తోంది. అధిష్టానం నుంచి వచ్చే నిధులు, కార్యక్రమాల నిర్వహణపై పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన కోట్లాది రూపాయల నిధులను కొందరు నేతలు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థులకు సరిగ్గా పంచకుండా కొందరు కీలక నాయకులు నొక్కేశారన్న విమర్శలు లేకపోలేదు.

సరిగ్గా డబ్బులు పంచితే మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టి‌పేట మున్సిపాలిటీల్లో మరికొన్ని స్థానాలు దక్కేవన్న అభిప్రాయాలున్నాయి. కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జిల్లా కీలక నేతలు పని చేశారన్న ఆరోపణలున్నాయి. ఇవన్నీ ప్రశ్నించే వారిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం దుమారం రేపుతోంది. పైగా పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని పక్కనబెట్టి.. తమ చుట్టూ తిరిగే వారికి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలు ఇప్పుడు జిల్లా బీజేపీలో వేడి పెంచుతున్నాయి.

మంచిర్యాల బీజేపీలో ఇప్పుడు అసలు చర్చ పార్టీ వర్సెస్ ప్రత్యర్థి పార్టీలు కాదు. పార్టీ లోపలే నాయకత్వం వర్సెస్ అసమ్మతి వర్గం అన్నట్టుగా మారింది. ‘కార్పొరేట్ బీజేపీ’ మోడల్ వద్దు.. కార్యకర్తల బీజేపీ కావాలి అంటూ అసమ్మతి వర్గం గళమెత్తుతోంది. జిల్లా కమిటీని పునర్వ్యవస్థీకరించి.. బూత్ స్థాయి నుంచి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లిపై వస్తున్న ఆరోపణలను పార్టీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది..? అసమ్మతి నేతల ఫిర్యాదులపై విచారణకు ఆదేశిస్తుందా..? లేక ప్రస్తుత నాయకత్వానికే మద్దతుగా నిలుస్తుందా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్న నేతలు అప్పట్లో బీఆర్‌ఎస్‌తో.. ఇప్పుడు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని, పార్టీ బలోపేతం కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా బీజేపీలో మొదలైన ఈ అంతర్గత పోరు.. రాబోయే రోజుల్లో మరింత ముదురుతుందా..? లేక అధిష్టానం జోక్యంతో సద్దుమణుగుతుందా..? అనేది వేచి చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్