Off The Record: మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు!

Off The Record: మంచిర్యాల కాంగ్రెస్‌లో భగ్గుమన్న అంతర్గత విభేదాలు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీ వంశీకృష్ణ వర్గాల మధ్య తీవ్రమవుతున్న రాజకీయ పోరు. పూర్తి వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Sept 2026 8:39 AM IST
Off The Record
X

Off The Record: మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు!

Off The Record: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు జన్మదిన వేడుకలు సాధారణ కార్యక్రమాలకే పరిమితం కాలేదు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు హాజరై ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ బైక్ ర్యాలీతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఈ వేదికపై మంత్రుల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. పార్టీ సీనియర్లు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోమంటూ శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక అదే వేదికపై ప్రేమ్‌సాగర్‌రావు కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ఎంపీ వంశీ కృష్ణను గెలిపించడానికి కాంగ్రెస్ శ్రేణులు అహర్నిశలు కృషి చేశాయని, కానీ ఇప్పుడు కార్యకర్తలు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. హైకమాండ్ మాట విని వంశీ కృష్ణను పార్లమెంటుకు పంపామని, అయితే ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. దళిత కార్డు ముసుగులో మంత్రులు, ఎంపీలు కాంగ్రెస్ కేడర్‌ను అణచివేస్తున్నారని మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తనను మానసికంగా వేధిస్తున్నారని, నా కార్యకర్తలతో ఆటలు ఆడితే మాత్రం ఊరుకోబోనని హెచ్చరించారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

మంచిర్యాల కాంగ్రెస్‌లో విభేదాలకు గూడెం పర్యటన ఘటన మరో మలుపుగా మారిందంటున్నారు. ఎంపీ వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెం పర్యటన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి నిరసనకుతోడు ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన నేతగా ప్రచారంలో ఉన్న మంతెన జగన్మోహన్‌రావు నిర్వహించిన కార్యక్రమాలు.. మంత్రి, ఎంపీ వర్గంతో ఆయన సాన్నిహిత్యం.. స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమయ్యాయన్న చర్చ మొదలైంది. మంచిర్యాల నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు, లక్షెట్టిపేటకు చెందిన కొందరు కౌన్సిలర్లు ఒక వర్గం నుంచి మరో వర్గం వైపు వెళ్లారన్న ప్రచారం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే.. ఎన్నికల సమయంలో ఒక్కటైన నాయకత్వం.. ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా మారుతోందా..? అన్న ప్రశ్న కాంగ్రెస్ కేడర్‌లో వినిపిస్తోంది.

ఒకవైపు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ తమ రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తుండగా.. మరోవైపు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తనకు మద్దతుగా ఉన్న నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్‌సాగర్‌రావు చేసిన ఘాటు వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఎంపీకి మద్దతుగా కొందరు దళిత నాయకులు స్పందించడం.. ఈ రెండు వర్గాల మధ్య వివాదం రాజకీయ స్థాయిని దాటి వర్గాల మధ్య చర్చగా మారుతున్న సంకేతాలను ఇచ్చింది. ఇక మంచిర్యాలలో పట్టు సాధించేందుకు ఇరువర్గాల రాజకీయ కదలికలు కొనసాగితే.. కేడర్‌లో ఈ విభజన మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందన్న చర్చ లేకపోలేదు. ఒకే పార్టీ కానీ రెండు రాజకీయ కేంద్రాలు. మంచిర్యాల కాంగ్రెస్‌లో మొదలైన ఈ అంతర్గత పోరు.. చివరకు ఎటువైపు దారితీస్తుందన్నదే తేలాల్సి ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్