Off The Record: మార్కాపురంలో అన్నా రాంబాబు వ్యాఖ్యల కలకలం!
Off The Record: వైయస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం. వెన్నుపోటు రాజకీయాలపై హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం.
Off The Record: మార్కాపురంలో అన్నా రాంబాబు వ్యాఖ్యల కలకలం!
Off The Record: మార్కాపురంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చకు వేదికగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని అన్నా రాంబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి.. పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రానున్న సంస్థాగత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కేడర్‌ను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సూచించారు. అయితే.. ఈ సమావేశంలో అన్నా రాంబాబు చేసిన ‘వెన్నుపోటు’ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి.
పార్టీలో ఉంటూనే ఇతరులకు ప్రయోజనం చేకూరేలా పనిచేయడం, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం సహించేది లేదంటూ ఆయన హెచ్చరించారు. వెనుక ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి ‘అట్టుకు అట్టున్నర వడ్డిస్తాం’ అన్నవిధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే.. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్న విషయాన్ని మాత్రం అన్నా రాంబాబు స్పష్టం చేయలేదు. దీంతో ఆయన చేసిన హెచ్చరికలు మార్కాపురం వైసీపీలో ఎవరిని ఉద్దేశించాయన్నదానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
అన్నా రాంబాబు ఎవరి పేరూ ప్రస్తావించలేదు.. కానీ ‘వెన్నుపోటు’ వ్యాఖ్యలు మాత్రం మార్కాపురం వైసీపీలో కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. అసలు ఆయన ఎవరిని టార్గెట్ చేశారు..? పార్టీలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి..? ఈ హెచ్చరికలు ఎవరికి వెళ్లాయి..?
అన్న చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. పార్టీలో ఉంటూ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవన్న సందేశాన్ని అన్నా రాంబాబు తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.
ముఖ్యంగా ఎన్నికల సమయంలో వ్యక్తిగత విభేదాలు, వర్గ రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందన్న నేపథ్యంలో.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని.. స్థానిక స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది మాత్రం ఆయన వెల్లడించకపోవడంతో.. ఈ వ్యవహారం మార్కాపురం వైసీపీలో మరింత ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు.. మార్కాపురం మున్సిపల్ ఎన్నికలపైనా అన్నా రాంబాబు ఫోకస్ పెట్టారు. రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలని.. స్థానికంగా పార్టీ బలాబలాలను అంచనా వేసుకుని ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత హడావుడి చేయడం కంటే.. ముందుగానే పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలన్న వ్యూహంతో మార్కాపురం వైసీపీ నాయకత్వం ముందుకు వెళ్తున్నట్లు సమావేశం ద్వారా స్పష్టమైంది.
ఇక అన్నా రాంబాబు చేసిన మరో కీలక వ్యాఖ్య.. ఆయన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత ఇచ్చేలా ఉంది. ‘నేను మార్కాపురంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’ అంటూ ఆయన ప్రకటించారు.
దీంతో మార్కాపురం నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలన్న తన వైఖరిని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుంచి వైసీపీ తరఫున తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలన్న సంకేతాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.
దీంతో మార్కాపురం వైసీపీ రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక.. ‘వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు వాళ్లపై చర్యలు తీసుకుంటాం’ అంటూ అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి.
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యక్తం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష రాజకీయాలపై కూడా ఆయన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేస్తూనే.. భవిష్యత్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను అన్నా రాంబాబు వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకుండా పనిచేయాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నుంచి భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు కూడా మార్కాపురం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి.
మొత్తంగా మార్కాపురం వైసీపీ సమావేశంలో మూడు అంశాలు ప్రధానంగా కనిపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయడం.. అభ్యర్థుల ఎంపికపై ముందస్తు కసరత్తు చేయడం.. పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేలా హెచ్చరికలు చేయడం.
వీటితోపాటు తాను రాబోయే 2029 ఎన్నకల్లో మార్కాపురం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నా రాంబాబు చేసిన ప్రకటన కూడా సమావేశంలో కీలకంగా మారింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలపైనా మార్కాపురంలో చర్చత మొదలైంది.
అయితే.. అన్నా రాంబాబు చేసిన ‘వెన్నుపోటు’ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. పేర్లు చెప్పకుండా ఆయన చేసిన హెచ్చరికలు పార్టీ అంతర్గతంగా ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి..?
మార్కాపురం వైసీపీలో ఏమైనా విభేదాలు ఉన్నాయా..? లేక ఎన్నికల ముందు కేడర్‌ను అప్రమత్తం చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై అన్నా రాంబాబు నుంచి మరింత స్పష్టత వస్తే తప్ప.. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటన్నది తేలే పరిస్థితి లేదు.




