Burning Topic: ఫ్రాన్స్ ను వణికిస్తున్న విద్యార్థుల ఆందోళనలు!

Burning Topic: ఫ్రాన్స్‌లో మౌలిక వసతుల లేమి, బడ్జెట్ కోతలపై దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ విద్యార్థి నిరసనలు. హింసాత్మక ఘటనలు, వేలల్లో అరెస్టులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 10:34 AM IST
Burning Topic
X

Burning Topic: ఫ్రాన్స్ ను వణికిస్తున్న విద్యార్థుల ఆందోళనలు!

Burning Topic: గత కొద్ది రోజులుగా పారిస్ వీధులన్నీ నినాదాలతో హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు చేతబూని, హక్కుల కోసం పోరాడుతున్న వేలాది మంది విద్యార్థుల ఆగ్రహంతో ఫ్రాన్స్ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రేగిన ఈ నిరసన జ్వాలలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్యారిస్‌లో ఒక ప్రాంతంలోని ఓ చిన్న పాఠశాలలో గత నెల మొదలైన ఈ ఆందోళన అంతకంతకూ పెద్దదై దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ఈ ఆందోళనలు క్రమంగా మార్సెలీ, లియాన్, రెన్నెస్, స్ట్రాస్ బర్గ్, నాంటెస్, లిల్లీ, టౌలౌస్, బోర్డో, నైస్, కేన్ తదితర నగరాలకు వ్యాపించాయి. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కూడా రోడ్లపైకి వచ్చి వీరికి మద్దతు తెలుపుతున్నారు.

ఫ్రాన్స్‌లోని పాఠశాల్లో మౌలిక వసతుల లేమి, నిధుల కొరత, ఉపాధ్యాయుల కొరత ఈ ఆందదోళనకు ప్రధాన కారణాలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల చాలా క్లాసులు జరగడం లేదు.

క్లాస్‌రూమ్‌లలో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో క్లాస్‌లో 32 నుండి 40 మంది వరకు విద్యార్థులు ఉండటంతో సరిగ్గా చదువుకోవడానికి వీలు పడటం లేదని వారు వాపోతున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘమైన క్లాస్ టైమ్‌టేబుల్స్ ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ బడ్జెట్ కోతల్లో భాగంగా విద్యా రంగానికి నిధులు తగ్గించడాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అనేక స్కూల్ భవనాలు దెబ్బతిని, కనీస నిర్వహణ కరువైంది. పైకప్పుల నుండి నీరు కారడం, ఎలుకల బెడద, శీతాకాలంలో చలిని, వేసవిలో వేడిని తట్టుకునే కనీస సౌకర్యాలు లేకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. యూనివర్సిటీ ప్రవేశాల కోసం ఉపయోగించే ఆన్‌లైన్ పోర్టల్ చాలా క్లిష్టంగా ఉండటం, తద్వారా ఉన్నత చదువులకు సమాన అవకాశాలు లభించకపోవడం కూడా విద్యార్థుల్లో అసంతృప్తిని పెంచింది.

ఈ సమస్యలను పరిష్కరించి, పాఠశాలలకు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలలను దిగ్బంధించి విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. కాగా ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్‌ లెకోర్ను, విద్యాశాఖ మంత్రి ఎడోర్డ్‌ జెఫ్రే విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరు చివరి నాటికి ఈ సమస్యలపై తొలి నివేదికను ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రధాని మంత్రులను ఆదేశించారు.

అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలకు విద్యార్థులు సంతృప్తి చెందలేదు. ఈ నిరసనలు సోషల్ మీడియా ద్వారా మరింత ఉధృతంగా మారాయి. దేశవ్యాప్తంగా దాదాపు 900 పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి. ఆందోళనలు క్రమంగా విశ్వ విద్యాలయాలకు కూడా వ్యాపించాయి. 30 విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలోనూ దిగ్బంధంచారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కోతలపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తూ వారు ఉద్యమంలో భాగమయ్యారు.

కాగా విద్యార్థుల ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు మొదలైంది. ఇరాన్‌ యుద్ధం కారణంగా పెట్రోలు ధరలు పెరిగిపోవడం, ప్రజావసరాల కోసం పెడుతున్న ఖర్చులు తగ్గించడంపై సామాన్య ప్రజానీకంలో తీవ్రమైన అసంతృప్తి ఈ ఉద్యమానికి మరింత ఆజ్యం పోసింది. దాదాపు 2.56 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూనియన్లు మాత్రం ఈ సంఖ్య 4.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాయి.

మొదట శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారింది. ఆందోళనకు దిగిన విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు బలప్రయోగం చేయడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. ఆందోళన చేపట్టిన విద్యార్థుల్లో కొందరు దురుసుగా ప్రవర్తిచడంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు హింసకు దిగారు. కొన్ని చోట్ల నిరసనకారులు రాళ్లు విసరడం, వాహనాలు, బస్‌ షెల్టర్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు జరిగాయి.

ఈ ఘర్షణలలో ఇప్పటివరకు 215 మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరు విద్యార్థులకు చేతులు తెగిపోవడం, దవడలు పగిలిపోవడం వంటి తీవ్రమైన గాయాలయ్యాయి. అదనంగా 70 మందికి పైగా పాఠశాల సిబ్బంది, దాదాపు 600 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 6,000 మందికి పైగా వ్యక్తులను పోలీసులు చేశారు. వీరిలో సుమారు 85% మంది మైనర్లే కావడం గమనార్హం.

విద్యార్థులపై ప్రాన్స్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, టియర్‌గ్యాస్‌లు ఉపయోగంచడంపై ప్రతిపక్ష నేత ఆరులిన్‌ లీ కాక్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హింస భరించలేనదని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థి విద్యార్థి ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఆందోళనకారులపై పోలీసుల చర్యను అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్‌ నునెజ్‌ సమర్థించుకున్నారు. నిరసలు దొమ్మీలుగా మారిపోయాయని, పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది మే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు అధ్యక్ష పీఠాన్ని ఎక్కిన మేక్రాన్‌ మూడోసారి పోటీ చేసే అవకాశం లేకపోవడం గమనార్హం.

మరోవైపు ప్రాన్స్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటికి మతం, వలసలను ముడి పెట్టారాయన. ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనలు పాఠశాలల గురించి కావని, అదుపులేని సామూహిక వలసల ఫలితమేనని ట్రంప్ పేర్కొన్నారు.

ఒకప్పుడు గొప్ప దేశంగా ఉన్న ఫ్రాన్స్‌ను ఇస్లాం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో.. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో లాస్‌ ఏంజెల్స్‌, శాన్‌డియాగో నగరాలను ఇరాన్‌ తుడిచిపెట్టేసుకోవచ్చుఅన్నట్లు మాట్లాడిన తీరుపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఘాటుగా స్పందించారు.

మన కథను మనమే రాసుకోకపోతే ఇతరులు రాస్తారని, దేశంలో పరిణామాలను ఇతరులు తమకు అనుకూలంగా అన్వయించుకోవడానికి అనుమతించవద్దని ఆయన హెచ్చరించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్