Off The Record: విజయనగరంలో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్!

Off The Record: వైసీపీని వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో మారుతున్న ఆధిపత్య సమీకరణాలు, రెండు పార్టీల్లోనూ జోరుగా చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2026 8:49 AM IST
Off The Record
X

Off The Record: విజయనగరంలో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్!

Off The Record: మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ మార్పు టీడీపీలో కొత్త సమీకరణాలకు తెరతీస్తే.. వైసీపీలో మాత్రం కార్యకర్తల్లో జోష్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది.

వైసీపీలో మజ్జి శ్రీనివాసరావు డామినేటింగ్ నేచర్‌తో వ్యవహరించేవారని, పార్టీలో ఒక ప్రత్యేక పవర్ సెంటర్‌గా ఎదిగారనే అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బొత్స కుటుంబంతో విభేదించే ధోరణితో శ్రీను రాజకీయంగా ఎదిగారని కొందరు నాయకులు పేర్కొంటున్నారు.

పార్టీలో ప్రతి ఒక్కరి పనులు ఒకే విధంగా జరిగేవి కావని.. కొందరికి మాత్రమే శ్రీను అందుబాటులో ఉండేవారన్న చర్చ కూడా ఉంది. బొత్సను నేరుగా కలవడానికి అన్ని సందర్భాల్లో అవకాశం లేకపోవడంతో.. పలువురు నాయకులు, కార్యకర్తలు శ్రీనును ఆశ్రయించాల్సి వచ్చేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితిని క్రమంగా తనకు అనుకూలంగా మార్చుకుని శ్రీను పార్టీలో కీలక శక్తిగా ఎదిగారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనను కలవడం, రాజకీయంగా సన్నిహితంగా ఉండటం కొందరు నాయకులకు ఇబ్బందిగా మారిందన్న చర్చ కూడా అప్పట్లో పార్టీలో సాగిందని నేతలు గుర్తుచేస్తున్నారు. కార్యకర్తల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు పలువురు శ్రీను వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొన్నారనే ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

అయితే అప్పట్లో అధికార పార్టీగా ఉన్న నేపథ్యంలో ఈ అంశాలపై బహిరంగంగా మాట్లాడేందుకు చాలామంది వెనుకంజ వేశారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి దూరమై టీడీపీలో చేరడంతో.. ఇన్నాళ్లూ ఉన్న అంతర్గత ఆధిపత్య సమీకరణాలు మారుతున్నాయా.. అన్న చర్చ మొదలైంది.

శ్రీను పార్టీ నుంచి వెళ్లిపోవడంతో వైసీపీ కేడర్‌లో స్వేచ్ఛ పెరిగిందని, నాయకులు మరింత స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తంగా.. ఒకప్పుడు వైసీపీలో పవర్ సెంటర్‌గా కనిపించిన మజ్జి శ్రీను.. ఇప్పుడు పార్టీ మారడంతో అదే వైసీపీలో కొత్త జోష్‌కు కారణమయ్యారా అన్నది విజయనగరం రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

ఇదిలా ఉండగా, విజయనగరం టీడీపీలో చిన్న శ్రీను ఎంట్రీ.. అప్పుడే గుబులు మొదలైందా..? నిన్నటి వరకు వైసీపీలో ఉంటూ టీడీపీపై రాజకీయ పోరాటం చేసిన నేత.. ఇప్పుడు అదే టీడీపీ గూటికి చేరారు. అయితే చిన్న శ్రీను రాకను కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇక తమ రాజకీయ పరిస్థితి ఏంటి..? అంటూ లెక్కలు వేసుకుంటున్నారట. ఎందుకంటే.. జిల్లాలో ఇప్పటికే తమకంటూ ఓ వర్గం.. ఓ పరిధి.. ఓ పవర్ ఉన్న నాయకుల మధ్యకు చిన్న శ్రీను వచ్చారు.

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా.. ఇప్పటికే జిల్లాలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న నాయకుల మధ్య చిన్న శ్రీను ఎంట్రీ కొత్త సమీకరణాలకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉన్నప్పుడు డామినేటింగ్ నేచర్‌తో వ్యవహరించిన చిన్న శ్రీను.. టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహా రాజకీయ శైలిని కొనసాగిస్తారా.. అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

చిన్న శ్రీనుకు పార్టీలో కీలక బాధ్యత ఇస్తే.. ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటి.. జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న పవర్ బ్యాలెన్స్ మారుతుందా.. ఎవరికి ప్రాధాన్యం పెరుగుతుంది.. ఎవరికి తగ్గుతుంది.. చిన్న శ్రీను రాక.. టీడీపీకి బలం చేకూర్చే నిర్ణయమా.. లేక ఇప్పటికే ఉన్న నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చే పరిణామమా.. ఇదే ఇప్పుడు విజయనగరం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

మరి చిన్న శ్రీను టీడీపీలో కొత్త శక్తిగా ఎదుగుతారా..లేక.. అక్కడి పాత నాయకత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతారా.అదే సమయంలో.. వైసీపీలో చిన్న శ్రీను ఖాళీ చేసిన రాజకీయ స్పేస్‌ను ఎవరు భర్తీ చేస్తారు. చిన్న శ్రీను పార్టీ మార్పు.. రెండు పార్టీల్లోనూ కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలుకనుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్