Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ ?

Off The Record: ఉన్నత విద్య కోసం సుదీర్ఘ సెలవుపై వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఆమె స్థానంలో అశోక్ గెహ్లాట్ లేదా ముకుల్ వాస్నిక్‌కు బాధ్యతలు?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Sept 2026 8:06 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ ?

Off The Record: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమించే దిశగా ఏఐసీసీ కసరత్తు ప్రారంభించిందట. త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు గాంధీభవన్ వర్గాలు.

దీప్ దాస్ మున్షి స్థానంలో 2025 ఫిబ్రవరి 14న మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆమె పార్టీ కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ఏఐసీసీ పరిశీలకురాలిగా కూడా వ్యవహరించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన ఆమె, 2009లో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 30,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తాజాగా మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారట. దీంతో 10 నెలలపాటు తాను అందుబాటులో ఉండలేనని హైకమాండ్‌కు విన్నవించారట మీనాక్షి నటరాజన్. దీంతో ఏఐసీసీ ఆమె లీవ్‌కు క్లియరెన్స్ కూడా ఇచ్చేసిందట. అయితే నెక్స్ట్ ఎవరు అనేదానిపై హై కమాండ్ దృష్టిసారించిందట.

సాధారణ ఎన్నికలకు ఇక రెండేళ్ల సమయమే ఉండటంతోపాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని టాక్.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్ కోసం పలువురు సీనియర్ నాయకుల పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోందట. ప్రధానంగా అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్లు రేసులో ముందున్నట్లు సమాచారం. వీరితోపాటు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్ పేరు కూడా ఏఐసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారని సమాచారం.

అయితే.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. సంక్షోభ సమయాల్లో పార్టీని నడిపించగల వ్యూహకర్తగా అశోక్‌ గెహ్లాట్‌కు మంచి పేరుంది.

ప్రస్తుత ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య నిమిత్తం సుదీర్ఘ సెలవుపై వెళ్లనుండటంతో, ఆమె స్థానంలో గెహ్లాట్ పేరును పార్టీ అధిష్ఠానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అపార రాజకీయ అనుభవం ఉన్న గెహ్లాట్ వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ముకుల్ వాస్నిక్ పేరు కూడా ఇ‌న్‌ఛార్జ్ రేసులో బలంగా వినిపిస్తోంది. ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ముకుల్ వాస్నిక్‌‌కు ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కూడా.

రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా విజయవంతంగా పనిచేయడంతోపాటు వివాదరహితుడిగా కూడా ఆయనకు పేరుంది. దక్షిణాది రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతోపాటు నాయకుల మధ్య సమన్వయం తీసుకురాగల నేతగా పేరుండటం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.

గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్ గోహిల్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోందని టాక్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన గోహిల్‌కు చట్టసభలు, రాజ్యాంగపరమైన అంశాలపై పూర్తి పట్టు ఉంది. గతంలో గుజరాత్ ప్రభుత్వంలో ఆర్థిక, విద్యా శాఖల మంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం కలిసి వచ్చే అంశాలు.

ఢిల్లీ, బిహార్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కూడా గోహిల్ పనిచేశారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయంచేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు దిగ్విజయ్.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం ఉన్నారు.

ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై వారం రోజుల్లో ఏఐసీసీ ఒక క్లారిటీ ఇవ్వబోతోందట. అప్పటి వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగనుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్