BurningTopic: ట్రంప్ పరువు తీసిన మెలోని

BurningTopic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య వివాదం ఏంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Jun 2026 7:03 AM IST
BurningTopic
X

BurningTopic: ట్రంప్ పరువు తీసిన మెలోని

BurningTopic: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత.. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. డొనాల్డ్ ట్రంప్ తన వాచాలత్వంలో తరచూ వివాదాలకు కారణమవుతూ వార్తల్లో నిలుస్తుంటారు. దేశాధ్యక్షుని హోదాలో ఉండి హుందాతనం కోల్పోవడం అమెరికాకు కూడా తలవంపులు తప్పడం లేదు. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మీద నోరు పారేసుకొని ఇరు దేశాల మధ్య దౌత్య వివాదాలకు కారణమయ్యారు డొనాల్డ్ ట్రంప్. ఇటాలియన్ టెలివిజన్ నెట్‌వర్క్ "లా7" అమెరికా అధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఉక్రెయిన్‌ అంశంపై ప్రశ్నించగా, ట్రంప్‌ మాత్రం సందర్భం లేకుండా మెలోనీ ప్రస్తావన తెచ్చారు. ఫ్రాన్స్‌లో జరిగిన 52వ జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెలోని తనతో ఫొటో దిగాలని బతిమిలాడిందని చెప్పుకొచ్చారు. తనకు ఇష్టం లేకున్నా ఆమె పరిస్థితి చూసి జాలిపడి అంగీకరించానని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇటలీలో తీవ్ర ప్రకంపణలకు కారణమయ్యాయి.

వాస్తవానికి జీ7 శిఖరాగ్ర సమావేశంలో డొనాల్డ్ ట్రంప్, జార్జియా మెలోనీ పలు సందర్భాల్లో పక్కపక్కనే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఫొటో కోసం ఆమె ప్రాధేయపడినట్లుగా ఎక్కడా కనిపించలేదు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై మెలోని సోషల్ మీడియా వేదిక ద్వారా ఖండించారు. "డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం. ఆయన మాటలు విని ఆశ్చర్యపోయాను. అమెరికా అధ్యక్షుడు తన మిత్రదేశాల నాయకులతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. అయితే ఇది మొదటిసారి కాదు" అని మెలోని వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల శత్రువుల పట్ల ట్రంప్ చూపాల్సిన కఠిన వైఖరి మిత్రదేశాలపై కనిపిస్తోందని కూడా ఆమె విమర్శించారు. "అమెరికాకు, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకుల విషయంలో ఆయన ఇంత దృఢంగా వ్యవహరించడం కనిపించదు. కానీ మిత్రదేశాల నాయకుల విషయంలో మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని మండిపడ్డారు.

ట్రంప్ ఒక విషయం గుర్తుంచుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు మెలానియా.. తాను కానీ, ఇటలీ దేశం కానీ ఎప్పుడూ ఎవరినీ బతిమిలాడవు అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. మొలోని స్పందన ఇటలీ రాజకీయ వర్గాల్లో విస్తృత మద్దతు పొందింది. ఈ వివాదం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపింది. ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అవి కేవలం మెలోనినే కాకుండా మొత్తం ఇటలీ దేశాన్నే అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 21, 22 తేదీల్లో అమెరికాలో జరగాల్సిన తన అధికారిక పర్యటనను తజాని రద్దు చేసుకున్నారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో, "అధ్యక్షుడు ట్రంప్ చేసిన తీవ్రమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఇటలీ ప్రజలందరినీ బాధించాయి. అందుకే అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని వెల్లడించారు.

డొనాల్డ్ ట్రంప్, మెలోని మధ్య విభేదాలు కొత్తవి కావు. గతంలో పోప్ చేసిన కొన్ని వ్యాఖ్యల విషయంలో కూడా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇరాన్‌ యుద్ధంపై పోప్‌ లియో శాంతి సందేశం ఇవ్వడం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. యుద్ధం విస్తరించకుండా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలని పోప్‌ పిలుపునిచ్చారు. అయితే. ట్రంప్‌ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పోప్ వామపక్ష భావజాలానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ భద్రతా అంశాలపై పోప్‌ మాట్లాడటం తగదని చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను మొలోని తప్పుపడ్డారు. ట్రంప్‌ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని, పోప్‌ అభిప్రాయాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే మెలోని తన విధానాలను విమర్శించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటివరకు మిత్రురాలిగా భావించిన మెలోనీ.. తనకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారనే భావన ఆయనలో ఏర్పడింది.

వాస్తవానికి మొదట్లో ట్రంప్, మెలోని మధ్య సంబంధాలు బాగానే ఉండేది.. వీరిద్దరిదీ కూడా రైట్‌వింగ్‌ భావజాలం వలసల నియంత్రణ, జాతీయవాద విధానాలు వంటి అనేక అంశాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. 2025లో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు యూరోపియన్‌ నుంచి హాజరైన ఏకైక నాయకురాలు కూడా ఆమెనే. మెలోనీ అందం, తెలివితేటలు రెండూ ఉన్న నాయకురాలు’ అంటూ ట్రంప్ కొనియాడారు. కానీ ఇరాన్‌ యుద్ధం తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. హర్ముజ్‌ జలసంధి భద్రత, ఇరాన్‌పై ఒత్తిడి వంటి అంశాల్లో అమెరికా వైఖరికి ఇటలీ పూర్తి మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో పాల్గొనేందుకు మెలోనీ నిరాకరించడంతో ట్రంప్‌లో అసంతృప్తి పెరిగింది. మెలోనీకి ధైర్యం లేదని, అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో ఆమె సరైన నాయకత్వం చూపడం లేదంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ఇద్దరి మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. ఇరాన్‌ యుద్ధం, నాటో బాధ్యతలు, పశ్చిమ దేశాల పాత్ర వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ట్రంప్‌ తన అసంతృప్తిని దాచుకోలేదు. యూరప్‌ అమెరికాను ఒంటరిగా వదిలేసిందని, నాటో మిత్రదేశాలు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని వ్యాఖ్యానించారు. అయితే మెలోనీ ఈ వ్యాఖ్యలను నేరుగా ఖండించారు. అమెరికా–యూరప్‌ భాగస్వామ్యం ఇప్పటికీ బలంగానే ఉందని, పశ్చిమ దేశాల మద్దతును తక్కువ చేసి చూపడం సరైంది కాదని ఆమె స్పష్టం చేసింది. ట్రంప్‌ తరచూ చేస్తున్న ‘యూరప్‌ మమ్మల్ని వదిలేసింది’ అన్న వ్యాఖ్యలను మెలోనీ ఖండించగా.. ట్రంప్‌ కూడా తన వైఖరి నుంచి వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని చర్చిస్తున్న దృశ్యాలు కనిపించినా.. వారి మధ్య అంత స్నేహపూర్వక వాతావరణం లేదని అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది.

మరోవైపు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంతర్జాతీయ నాయకులతో స్నేహపూర్వక, దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించానికి ప్రాధాన్యత ఇస్తారు. యూరోపియన్ యూనియన్‌లో తనదైన నాయకత్వంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇతర పశ్చిమ దేశాల నాయకులతో కలిసి G7 సదస్సుల్లో ఇటలీకి ప్రాధాన్యతనిస్తూ, గ్లోబల్ డిప్లొమసీని కొనసాగిస్తున్నారు. మరోవైపుఅంతర్జాతీయ వేదికలపై మెలోని తరచూ భారత ప్రధాని మోదీతో కలిసి కనిపిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు మెలోడీగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం పొందాయి . ఇటీవల రోమ్ పర్యటనలో మోదీ మెలోనికి భారతీయులందరికీ పరిచయమైన మెలోడీ టాఫీలను బహుమతిగా అందించడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.తాజా జీ7 సదస్సులో కూడా మెలోని, మోదీ మధ్య సరదా సంభాషణలు ఆకట్టుకున్నాయి. మనం సోషల్ మీడియాలో ఫేమస్ అని వ్యాఖ్యానించారు మెలోని.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story