Burning Topic: సోషల్ మీడియాపై మెటా సంచలన నిర్ణయం!
Burning Topic: పిల్లల మానసిక ఆరోగ్యంపై దెబ్బతీస్తున్నారనే కేసుల్లో 17 బిలియన్ డాలర్ల (రూ. 1.62 లక్షల కోట్లు) రాజీ ఒప్పందానికి సిద్ధమైన మెటా. 18 ఏళ్లలోపు వారికి కఠిన నిబంధనలు.
Burning Topic: సోషల్ మీడియాపై మెటా సంచలన నిర్ణయం!
Burning Topic: మంచి వెనుకే చెడు ఉంటుంది. సాంకేతిక విప్లవం కారణంగా క్షణాల్లో సమాచారం అందుతుంది. అంతే కాదు వినోదం కూడా మన చేతిలోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లతో తమ కమ్యూనికేషన్ పరిధిని పెంచుకుంటున్నారు. ఏ ఇంటిలో చూసినా ఒకే ఫిర్యాదు.. పిల్లలు చదువులు, ఆటలను పక్కన పెట్టి సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోంది, ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై, చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా అతిగా వాడటం వల్ల చిన్నారుల్లో ఆందోళన, నిరాశ, ఒంటరితనం వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే దీనికి అలవాటు పడటం వల్ల ఏకాగ్రత తగ్గి, మార్కులు తగ్గుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.దీంతో టీనేజర్లు చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా కంట్రోల్ చేయాలనే డిమాండ్ మొదలైంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ తరహా నియంత్రణలు అమల్లోకి వచ్చాయి.
సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ నెట్‌వర్క్ యాప్స్ ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్.. ఇవన్నీ అమెరికాకు చెందిన మెటా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పని చేస్తున్నాయి. కాగా గత కొంత కాలంగా అగ్రరాజ్యంలో మెటా చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సంస్థ నిర్వహించే సోషల్ మీడియా వేదికలు చిన్నారులు, యువత మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. పిల్లలు గంటల తరబడి యాప్‌లలోనే గడిపేలా మెటా తన అల్గారిథమ్‌లను రూపొందించింది. ఈ కారణంగా టీనేజర్లలో శారీరక సమస్యలు పెరుగుతున్నాయని మెటా అంతర్గత పరిశోధనల్లో తేలినా, ఆ నివేదికలను దాచిపెట్టింది. పిల్లల మానసిక ఆరోగ్యం కంటే కంపెనీ లాభాలకే ప్రాధాన్యత ఇచ్చారని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడగంతో అక్కడి ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. మెటా సంస్థ తమ లాభాల కోసం పిల్లల భద్రతను విస్మరించిందంటూ అమెరికాలోని దాదాపు 47 రాష్ట్రాలు కోర్టుల్లో దావాలు వేశాయి.
అయితే ఈ న్యాయపోరాటంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుల విచారణను ముగించేందుకు.. దాదాపు 17 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కనెన్సీలో రూ.1.62 లక్షల కోట్లు చెల్లించేలా రాజీ ఒప్పందానికి మెటా ముందుకొచ్చింది. ఇందులో వర్జీనియా రాష్ట్రానికి గ్యారంటీగా 353 మిలియన్ డాలర్లు అందనున్నాయి.. వర్జీనియా అటార్నీ జనరల్ కార్యాలయానికి చెందాల్సిన 353 మిలియన్ డాలర్లతో పాటు, 2016 ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి థర్డ్ పార్టీలకు మెటా యూజర్ల సమాచారాన్ని షేర్ చేసినందుకు అదనంగా 11 మిలియన్ డాలర్లు వర్జీనియాకు అందనున్నాయి. 1990ల నాటి బిగ్ టొబాకో సెటిల్‌మెంట్ల తర్వాత రాష్ట్ర స్థాయి వినియోగదారుల పరిరక్షణ చరిత్రలో ఇదే అతిపెద్ద సెటిల్‌మెంట్లలో ఒకటి. ఈ చారిత్రక కేసు విచారణ, సెటిల్‌మెంట్ ఆమోద ప్రక్రియ యూనైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టులో ముగిశాయి. టెక్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ జరిమానాల్లో ఒకటిగా నిలిచింది.
కాగా మెటా సంస్థ ఈ చెల్లింపులతో పాటుగా పిల్లలను రక్షించేందుకు వీలుగా కొన్ని కఠినమైన భద్రతా ఫీచర్లను అమలు చేయాల్సి ఉంటుంది. ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్18 ఏళ్లలోపు వినియోగదారులకు పలు కఠినమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిపి రోజుకు గరిష్ఠంగా రెండు గంటల వినియోగ పరిమితి ఉంటుంది. ఈ పరిమితిని అధిగమించాలంటే తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఎండ్‌లెస్ స్క్రోలింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం 15 నిమిషాలు వాడిన తర్వాత, అలాగే 60, 90 నిమిషాల వద్ద తప్పనిసరి పాజులు వస్తాయి. అలాగే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టీనేజర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీడ్, స్టోరీస్, ఎక్స్‌ప్లోర్, రీల్స్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ అయిపోతుంది. పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు ఉండవు.
మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం మెటాలో కృత్రిమ మేథకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రాజెక్ట్ ఓటీ పేరిట ఓ ప్రణాళిక సిద్ధం మెటా సీఈఓ జుకర్‌బర్గ్ చేశారు. ఉద్యోగులను రెండు దశల్లో 60 శాతానికి కుదించి.. ఏఐ ఏజెంట్లతోనే ఎక్కువ పనిచేయించుకోవాలన్నది మెటా ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. మెటా అంతర్గత ప్రణాళికలో భాగంగా సిబ్బందిని రెండు విడతల్లో 60 శాతానికి కుదించడం మొదటి లక్ష్యం. మేలో తొలి విడతలో లేఆఫ్‌లు జరిగాయి కూడా. నవంబరులో మరికొంత మందిని తొలగించాలనుకున్నా.. ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఒక కారణమైతే.. ఏఐ ఏజెంట్లు మెటా ఆశించిన స్థాయిలో ఉత్పాదకత ఇవ్వడం లేదని అంతర్గత విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రణాళిక ఏ మేరకు విజయవంతం అవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




