Burning Topic: అగ్నిగుండంగా మారిన పశ్చిమాసియా
Burning Topic: పశ్చిమాసియాలో ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ట్రంప్-నెతన్యాహూల మధ్య విభేదాలు మరియు హర్మూస్ జలసంధిలో జరిగిన ప్రమాదంపై పూర్తి విశ్లేషణ.
Burning Topic: అగ్నిగుండంగా మారిన పశ్చిమాసియా
Burning Topic: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎంతకీ తగ్గడం లేదు. ఓవైపు కాల్పుల విరమణ అమలు, చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు అప నమ్మకాలతో పరస్పర దాడులు పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ జలసంధి గుండా వాణిజ్య రవాణాను ఇరాన్ సమర్థవంతంగా అడ్డుకోవడాన్ని నిరోధించేందుకు అమెరికా దళాలు సాగిస్తున్న కార్యకలాపాల సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఆపరేషన్లలో భాగంగా యూఎస్ మిలిటరీ అపాచీ హెలికాప్టర్లతో పాటు ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఎఫ్‌ఏ-18, ఎఫ-35 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను రంగంలోకి దించింది. ప్రమాదం జరిగిన సమయంలోనే రీపర్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో.. అపాచీ హెలికాప్టర్ ఇరాన్ కాల్పుల్లో కూలిపోయిందా లేదా ఏదైనా సాంకేతికలోపం తలెత్తిందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటినుంచి యూఎస్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడం ఇదే మొదటిసారి. హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాను పునరుద్ధరించడానికి వాషింగ్టన్, టెహ్రాన్ దేశాల మధ్య పలుసార్లు చర్చలు జరుగుతున్నప్పటికీ... ఆ ప్రాంతంలో యూఎస్ సైన్యం తన దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే అపాచీ హెలికాప్టర్లు ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ ధృదీకరించారు. హెలికాప్టర్ ధ్వంసమవగా.. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల వల్ల ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనమైందని ట్రంప్ పేర్కొన్నారు.
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడులతో పరిస్థితులను మరింతగా దిగజార్చడం ట్రంప్‌కు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో నెతన్యాహుకు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారని కథనాలు వస్తున్నాయి.
' బీబీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది' అని నెతన్యాహుకు ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై మరింత దూకుడుగా వ్యవహరిస్తే ప్రపంచ దేశాల మద్దతు కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించినట్లు తెలిపారు. ప్రస్తుతం దౌత్య చర్చలకు అవకాశాలు ఉన్నాయని, అలాంటి సమయంలో భారీ సైనిక చర్యలు చేపడితే సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది.
కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్‌పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. ఇరాన్‌లో శాంతి ఒప్పందం కోసం అమెరికా చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చల నుంచి తమను దూరం పెట్టినందుకు నెతన్యాహూ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు అనే సంకేతాన్ని అమెరికాకు పంపేందుకే ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఇకపై దక్షిణ లెబనాన్‌లోని హిజ్బు స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ ఉండకపోవచ్చు. అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా? ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఒత్తిళ్లు కారణంగానే నెతన్యాహూ దాడులు చేపట్టారని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షునికి, ఇజ్రాయెల్ ప్రధానికి మధ్య విబేధాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న నెతన్యాహూను ట్రంప్ పదేపదే హెచ్చరించడం ఆసక్తి కలిస్తోంది. అయితే ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ మాత్రం దీన్ని ‘ప్రేమికుల మధ్య వచ్చే చిన్నపాటి గొడవ’గా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది. ‘‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి లోతైన స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్నపాటి ఘర్షణలుజరుగుతుంటాయి, అలాగే కొన్నిసార్లు వారి సంభాషణల్లో వాతావరణం కాస్త వేడెక్కుతుందని లీటర్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించిన తర్వాతే ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేసినట్లు చెబుతున్నారు. తమ దేశంపైకి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను స్పందించకుండా ఇజ్రాయెల్ ఊరికే భరించలేదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకున్నారని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు.
కాగా ప్రతీకార దాడులను నిలిపివేస్తున్నట్టు ఇరాన్, ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేశాయి. తాజాగా రెండు దేశాలు క్షిపణుల వర్షం కురిపించుకోవడంతో ఇరుదేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని శాంతి, సుస్థిరతను నెలకొల్పాలని ట్రంప్.. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులను నిలిపివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కానీ ఆ దేశం మిత్ర పక్షాలు కానీ కవ్వింపులకు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని చెప్పింది. దేశ రక్షణ కోసం ఎలాంటి ముప్పును అయినా ఎదుర్కొంటామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అటు తాము కూడా ఇరాన్‌పై దాడులు నిలిపివేశామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. కానీ ఇరాన్ పొరపాటున తిరిగి తమపై దాడి చేస్తే, బలప్రయోగంతో తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణకు పూర్తి హక్కు ఉందని, దానిని అవసరమైనంత మేరకు ఉపయోగించుకుంటుందని అన్నారు.




