Burning Topic: హౌతీలకు సౌదీకి మధ్య ముదురుతున్న యుద్ధం!
Burning Topic: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేయడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి.
Burning Topic: హౌతీలకు సౌదీకి మధ్య ముదురుతున్న యుద్ధం!
Burning Topic: పశ్చిమాసియాలో మరో యుద్ధం ముంచుకొస్తోందా? యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల విజృంభన కొత్త సమస్యలను సృష్టిస్తోంది. హౌతీలకు, యెమెన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం జులైలో ముగియడంతో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి.ఇప్పటికే సనాతో పాటు యెమెన్‌లోని మూడోవంతు ప్రాంతాన్ని ప్రాంతాలను హౌతీలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఎర్ర సముద్ర తీరప్రాంతం, రేవు పట్టణాలపై హౌతీలు పట్టు సాధించారు.
ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన బాబ్ అల్-మండెబ్ జలసంధి సమీపంలోని మోచా ఓడరేవు పట్టణం, ధుబాబ్, పెరిమ్ ద్వీపం, హనిష్ దీవులను కూడా హౌతీలు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో యెమెన్ ప్రభుత్వ దళాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. సౌదీ అరేబియా మద్దతుతో యెమెన్ ప్రభుత్వ దళాలు హౌతీల ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు చేపట్టారు. ఇది కాస్తా హౌతీలకు ఆగ్రహం తెప్పించింది.
గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు.. అక్కడి చమురు, పర్యాటక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు ప్రారంభించారు. ఇంధన మౌలిక సదుపాయాలు, నౌకామార్గాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఈ వారాంతంలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన భయానక దాడుల్లో 13 మంది మరణించగా.. 300 మందికి పైగా గాయపడ్డారు.
సౌదీలో జరిగిన అత్యంత ప్రాణాంతక దాడి ఇది. ఈ దాడితో విదేశీ దౌత్య కార్యాలయాలు తమ పౌరులను విమానాశ్రయానికి దూరంగా ఉండాలని హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస దాడులతో సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటి దాకా తమ దేశానికి అండగా ఉంటుందని భావించిన అమెరికా కీలక సమయంలో చేయి ఇవ్వడం, మక్కా ఒప్పందం అక్కరకు రాకపోవడంతో సౌదీ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది.
హౌతీ తిరుగుబాటుదారుల దాడుల కారణంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ సహా కీలక ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ పరిణామాల మధ్య యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ - ఎంబీఎస్ ఎప్పుడు ఏ రాజభవనంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన భద్రతా బృందం ఆయన్ను రక్షించేందుకు ఎప్పటికప్పుడు బంకర్లు, పటిష్ఠ భద్రత ఉన్న వేర్వేరు ప్యాలెస్‌లకు తరలిస్తోంది.
ఎంబీఎస్ గత వారం ఓ కార్యక్రమంలో బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత నుంచే ఆయన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒక రాజభవనం నుంచి మరో రాజభవనానికి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భవనాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా బంకర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. యువరాజు భద్రత కోసం ఆయనకు అత్యంత విశ్వసనీయమైన ప్రత్యేక బృందాన్ని నియమించారు.
కాగా హౌతీలు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో ముందున్న సౌదీ అరేబియా ఎందుకు అడ్డుకోలేకపోయింది అనే చర్చ జరుగుతోంది. గత ఏడాది సౌదీ రక్షణ రంగానికి దాదాపు రూ.7 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల నుంచి అత్యాధునిక ఎఫ్-15 యుద్ధ విమానాలు, పేట్రియాట్, థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది.
అయినప్పటికీ సౌదీ భూభాగంలోని కీలక మౌలిక సదుపాయాలైన విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు హౌతీలు కొనసాగిస్తున్నారు. వేర్వేరు వేగంతో వచ్చే డ్రోన్లు, క్షిపణులను ఒకేసారి ప్రయోగించడం ద్వారా సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను హూతీలు గందరగోళానికి గురిచేస్తున్నారు. నిరంతర దాడుల వల్ల క్షిపణులను గాలిలోనే పేల్చివేసే ఇంటర్‌సెప్టర్ క్షిపణుల కొరత ఏర్పడుతోంది.
హౌతీల వద్ద బాలిస్టిక్ క్షిపణులతోపాటు ప్రయాణ సమయంలోనే దిశ మార్చుకోగల అధునాతన వ్యవస్థలు ఉన్నాయి. ఇవి సౌదీ అరేబియా ఉపయోగిస్తున్న పేట్రియాట్ ఇంటర్సెప్టర్లు, ఇతర రక్షణ వ్యవస్థలకు సవాల్ విసురుతున్నాయి. సౌదీ అరేబియా 22 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండటంతో విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలను ఒకేరీతిలో రక్షించడం అంత సులభం కాదు.
భారీ భూభాగం అంతటా ‘పూర్తిస్థాయి రక్షణ కవచాన్ని’ నిర్మించడం అసాధ్యం. హౌతీల వరుస దాడులను తిప్పికొట్టే క్రమంలో సౌదీ క్షిపణి నిరోధక ఇంటర్సెప్టర్లపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడుతోంది 225 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కింగ్ ఖలీద్ విమానాశ్రయం, చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, పవిత్ర నగరాలను నిరంతరం కాపాడుకోవడం పేట్రియట్ లేదా థాడ్ వ్యవస్థలకు కూడా సవాలుగా మారింది.
హౌతీల దాడులు కేవలం సైనికపరమైన సవాలుగానే కాకుండా, సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను కూడా కలవరపెడుతున్నాయి. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘విజన్ 2030’ కి ఈ దాడులు అతిపెద్ద గొడ్డలిపెట్టుగా మారాయి. సౌదీని కేవలం చమురు ఆధారిత దేశంగా కాకుండా పర్యటక, వ్యాపార, అంతర్జాతీయ ఈవెంట్లకు అంతర్జాతీయ హబ్‌గా మార్చాలని భావిస్తుండగా.. విమానాశ్రయంపై జరిగిన ఈ దాడి పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.
డబ్ల్యూపీసీ ఎనర్జీ కాంగ్రెస్సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజే ఈ దాడి జరగడం సౌదీ భద్రతపై అనేక అనుమానాలు రేకెత్తించింది. దాడుల సమాచారాన్ని ముందస్తుగా మెసేజ్‌ల ద్వారా చేరవేసే విధానాన్ని సౌదీ నిలిపివేయడంతో అధికారిక ప్రకటన రావడానికి ముందే విదేశీ ఎంబసీలు తమ పౌరులను అప్రమత్తం చేయాల్సి వచ్చింది. ఈ దాడులు సౌదీ సైనిక బలాన్ని తగ్గించకపోవచ్చు కానీ, ఆర్థికంగా, మానసికంగా సౌదీ అరేబియా స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయి.
యెమెన్‌లో 1990 ప్రాంతంలో ఒక చిన్న వేర్పాటువాదసంస్థగా ప్రారంభమైన హౌతీ సంస్థ ఇవాళ నేడు అత్యంత సంపన్నదేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాకు పక్కలో బల్లెంలాగా మారింది. సద రాష్ట్రంలో జైదీ మైనార్టీలు ఈ సంస్థ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అనంతరం ప్రభుత్వంతో నేరుగా పోరు ప్రారంభించింది. హౌతీలకు ఇరాన్ వీరికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకారం అందిస్తోంది. ఆయుధాలు ఉపయోగించడంలో వీరికి హెజ్బుల్లా లాంటి సంస్థలు సాయపడుతున్నాయి.
సుదీర్ఘకాలంగా జరుగుతున్న అంతర్యుద్ధంతో హుతీలు బలం పెంచుకున్నారు. 2014లోరాజధాని సనాను ఆక్రమించిన నాటి నుంచి హౌతీ తమ ఆయుధ సంపత్తిని విపరీతంగా పెంచుకున్నారు. 2015లో ప్రభుత్వంతో పోరాడుతున్న తరుణంలో వీరికి వ్యతిరేకంగా సౌదీ అరేబియా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య ప్రత్యక్ష పోరు జరుగుతోంది. ఏకంగా రియాద్పైనే హౌతీ దళాలు దాడులు జరుపుతున్నాయి.
సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుస దాడులకు పాల్పడుతుండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలోనే హూతీల దాడులు పెరిగాయా? అని విలేకరులు ప్రశ్నించగా, ఎన్నికలపై ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందో తనకు తెలియదని చెప్పారు.
ఆ అంశాన్ని తాను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా సౌదీ అరేబియా అమెరికాకు కీలక ప్రాంతీయ భాగస్వామి. ఆ దేశంపై దాడులు పెరిగి, అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే వాషింగ్టన్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్యకు దిగాలా? లేదంటే సౌదీ రక్షణ వ్యవస్థలకు సహకారం అందిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచాలా? అనే అంశాలపై అమెరికా నిర్ణయం కీలకం కానుంది.




