Burning Topic: ఎన్డీఏ కూటమిలో డీఎంకే?
Burning Topic: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించే పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Burning Topic: ఎన్డీఏ కూటమిలో డీఎంకే?
Burning Topic: రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. ప్రస్తుతం తమిళనాట ఇదే మాట వినిపిస్తోంది..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే అక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది విజయ్ పార్టీ టీవీకే. ప్రభుత్వ ఏర్పాటుకు మరికొన్ని సీట్లు అవసరం కాగా అనూహ్యంగా ప్లేట్ పిరాయించింది కాంగ్రెస్ పార్టీ.
దశాబ్దాలుగా డీఎంకేతో కొనసాగుతున్న స్పేహాన్ని విడిచిపెట్టి టీవీకేకు మద్దతునిస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిపోయింది. డీఎంకేతో పాటు కూటమిలో ఉన్న వీసీకే, వామపక్షాలు, ఐయూఎంఎల్ స్టాలిన్‌తో చర్చించి టీవీకేకి మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడాన్ని డీఎంకే అధినేత స్టాలిన్ జీర్ణించుకోలేకపోయారు. ఆ పార్టీ తమకు వెన్నుపోటు పొడించిందని బాహటంగా విమర్శించారు డీఎంకే నాయకులు. తాము ఇకపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వలోని ఇండీ కూటమిలో కొనసాగబోమని స్టాలిన్ ప్రకటించారు.
తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాలకు నాంది పలికిన పార్టీ డీఎంకే 1967 నుంచి బలమైన పార్టీగా ఎదిగి ఎన్నో ఒడుదొడుకుల్ని చూసింది. రాజకీయంగా అత్యంత కఠిన పరీక్షలను కూడా ఎదుర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో తిరిగి బలోపేతం అయ్యేందుకు అవసరమైన అన్ని అవకాశాలనూ ఉపయోగించుకోడానికి సిద్దమవుతున్నారు స్టాలిన్. ప్రస్తుతం డీఎంకే కూటమి విచ్చిన్నమైంది. కూటమి చెదిరినా పెద్దగా నష్టం ఉండదని డీఎంకే నాయకులు అంటున్నారు. ఎందుకంటే.. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం, స్థిర ఓటుబ్యాంకు ఉంది. దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లేందుకు పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ అధినేత ఎం.కె.స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ‘బంతిని గోడకు కొడితే ఎలా వేగంగా తిరిగొస్తుందో.. అలాగే మళ్లీ డీఎంకే తిరిగొస్తుంది. శ్రేణులంతా ఉత్సాహంగా ఉండండి. వివిధ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండండి’ అంటూ పిలుపునిచ్చారు.
తమకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ మీద ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు డీఎంకే కార్యకర్తలు. ఈ ప్రభావం జాతీయ రాజకీయాల మీద కూడా పడబోంది.సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోందని చెబుతున్నారు. పార్లమెంట్‌లో తమ ఎంపీల సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను కూడా మార్చాలని, కాంగ్రెస్ నేతలతో కలిసి కూర్చోలేమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు డీఎంకే ఇప్పటికే లేఖ రాసింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ, ఇది తమకు కూడా అంది వచ్చిన సరికొత్త అవకాశంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. రాజ్యాంగ సవరణలు చేపట్టాలన్నా, కీలక బిల్లులను ఏకపక్షంగా ఆమోదించాలన్నా ఇది అత్యవసరం. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఎన్డీయేకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, భారీ సంస్కరణల కోసం మరిన్ని పార్టీల మద్దతు అవసరం.
కాంగ్రెస్‌తో బంధం తెంచుకున్న డీఎంకేని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరుపుతున్నాయని తమిళనాడులో విస్తృత ప్రచారం జరుగుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లుగా.. టీవీకే, కాంగ్రెస్ ఒక్కటైన నేపథ్యంలో ఆ రెండు పార్టీలు వ్యతిరేకించే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమితో చేతులు కలపడానికి స్టాలిన్ సిద్ధమయ్యారని చెబుతున్నారు. డీఎంకేకు లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ వస్తే ఎన్డీయే కూటమి బలపడుతుంది. ఎన్డీయేకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, భారీ సంస్కరణల కోసం మరిన్ని పార్టీల మద్దతు అవసరం. ముఖ్యంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. ఒకవేళ డీఎంకే తన ఎంపీలతో ఎన్డీయేలోకి వస్తే, బీజేపీకి అప్రతిహతమైన బలం చేకూరుతుంది. ఇదే జరిగితే దక్షిణాదిలో బీజేపీకి ఒక బలమైన మిత్రపక్షం దొరికినట్లవుతుంది.
బీజేపీ, డీఎంకేల దోస్తీ కొత్తేమీ కాదు. డీఎంకే గతంలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉంది. కాబట్టి పాత సంబంధాలను పునరుద్ధరించడం సాధ్యమేనని బీజేపీ వర్గా లు అంటున్నాయి. అయితే ఇక్కడ కొన్ని అడ్డంకులు కూడా ఉన్నా యి. ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్ముకున్న డీఎంకే, హిందుత్వ వాదాన్ని వినిపించే బీజేపీతో కలవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని భావిస్తున్నారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు బీజేపీతో విభేదాలు సృష్టించాయి. ఈ విషయాల్లో రెండు పార్టీలు రాజీపడాల్సి ఉంటుంది. ఉమ్మడి ప్రయోజనాల కోసం వైరుద్యాలనుపక్కన పెట్టడం కొత్తేమీ కాదని, గతంలో కరుణానిధి కూడా వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, ఢిల్లీలో జరుగుతున్న అంతర్గత చర్చలు మాత్రం ఏదో పెద్ద మార్పు రాబోతోందని సూచిస్తున్నాయి. ఒకవేళ స్టాలిన్ నిజంగానే ఎన్డీయేతో కలిస్తే తమిళనాడుతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ మార్పలు ఖాయం.




