OFF THE RECORD: మంచిర్యాల కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు!

OFF THE RECORD: మంచిర్యాల కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మంతెన జగన్ మోహన్ రావు వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు.. శాంతిభద్రతలపై డీజీపీ తీవ్ర ఆగ్రహం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2026 10:53 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: మంచిర్యాల కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు!

OFF THE RECORD: మంచిర్యాల కాంగ్రెస్‌లో కాకరేగుతోంది..! అధికార పార్టీ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సీనియర్ నేత మంతెన జగన్ మోహన్ రావు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటివరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరు.. నేడు బద్ధ శత్రువులుగా మారిపోయారు.

సమస్యేంటంటే.. వీరి రాజకీయం కేవలం మాటలకే పరిమితం కావడం లేదు. ఏకంగా భౌతిక దాడుల వరకు వెళ్లింది! ఎంపీ వంశీకృష్ణ, జగన్ మోహన్ రావు ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో మొదలైన చిచ్చు.. ఆ తర్వాత దండేపల్లి మండలం తాళ్లపేటలో బతుకమ్మ, దసరా వేడుకల వేళ దావానలంగా మారింది.

ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. భౌతిక దాడులకు దిగారు! ఎమ్మెల్యే అనుచరులపై ప్రత్యర్థి వర్గం జరిపిన దాడిలో తీవ్ర రక్తపాతం జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అయితే ఈ ఇద్దరు నాయకుల రాజకీయ ఆధిపత్య పోరు మధ్యలో నలిగిపోతోంది మాత్రం పోలీసులే! తాళ్లపేట ఘటన తర్వాత జగన్ మోహన్ రావు వర్గానికి చెందిన ఆరుగురిపై కేసులు నమోదు చేసి, నలుగురిని రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ మోహన్ రావు..

అర్థరాత్రి వేళ తాళ్లపేట చేరుకుని ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగుతుందోనని పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బైపాస్ లోని జగన్ మోహన్ రావు ఇంటిని వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు! తాళ్లపేటలో భారీ పికెటింగ్ ఏర్పాటు చేశారు. డీసీపీ స్వయంగా వార్నింగ్ ఇచ్చినా నాయకుల దాడులు, ప్రతిదాడులు మాత్రం తగ్గడం లేదు.

పోలీసులు ఒక పక్షానికే కొమ్ము కాస్తున్నారంటూ ఫిర్యాదులు నేరుగా డీజీపీ దాకా వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ బాస్.. రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీలకు గట్టిగానే క్లాస్ పీకారు! 'ఏదైనా సరే.. శాంతి భద్రతలు అదుపు తప్పకూడదు' అని ఆర్డర్ వేశారు.

డీజీపీ క్లాస్‌తో అలర్ట్ అయిన సీపీ అంబర్ కిషోర్ ఝా.. రాత్రివేళల్లో స్వయంగా బైక్‌పై జిల్లా కేంద్రంలో పర్యటించి రంగంలోకి దిగారు. పాన్ షాపుల సోదాలు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ, ఘటనపై ప్రత్యేక 'సిట్' ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ సీన్‌లోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది! కాంగ్రెస్ వర్గపోరుతో జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని డీజీపీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఒక 'యువ ఐపీఎస్' అధికారి నియామకాన్ని కోరింది.

కాంగ్రెస్ నాయకుల రాజకీయం ఇప్పుడు ఖాకీలకు తీవ్ర తలనొప్పిగా మారింది. మరి ఈ సిట్ విచారణ, బీఆర్ఎస్ ఎంట్రీ తర్వాత మంచిర్యాల పొలిటికల్ డ్రామా ఇంకేన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్