Off The Record: తెలంగాణపై మోదీ అదిరిపోయే ప్లాన్

Off The Record: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 May 2026 6:45 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణపై మోదీ అదిరిపోయే ప్లాన్

Off The Record: ఉత్తర భారతదేశంలో బీజేపీ హిందుత్వ ఫార్మూలా సూపర్ హిట్టైంది. గత పన్నెండళ్ల కాలంలో.. ఒక్కో రాష్ట్రాన్ని ఖాతాలో వేసుకుంటూ పోతోంది. చివరికి బెంగాల్ కూడా కమలం లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు కమలం పార్టీ టార్గెట్ అంతా.. దక్షిణాదిపైనే అందున తెలంగాణ మరింత ప్రత్యేకం. ఇంకాస్త గట్టిగా శ్రమిస్తే... గెలవొచ్చు అనేది బీజేపీ నమ్మకం. ఐతే ఇక్కడ హిందుత్వ ఫార్మూలా ఒక్కటే సరిపోదు. ఆ సాంప్రదాయ రాజకీయానికి తోడు.. ఇక్కడి స్థానిక అంశాలు, ప్రాంత అస్తిత్వ, భావోద్వేగంతోనే తెలంగాణలో గెలిచే అవకాశం ఉందని అధిష్టానం బావిస్తోందట. కేవలం హిందుత్వ సెంటిమెంట్, జాతీయత ఒక్కటే వర్కౌట్ కాదనే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం బలంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు అనేవి ఉత్తరాది రాష్ట్రాల్లా హిందూత్వం చుట్టూ తిరగవు. ఇక్కడ ప్రాంతీయ భావోద్వేగాలు, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వంతో పాటు వర్గాల ప్రభావం చాలా కీలకంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని కమలం పార్టీ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బలమైన సామాజిక వర్గాలు, ప్రభావశీల కుటుంబాలు, ఆంధ్ర సెటిలర్ ఓటర్లు, సినీ, సాంస్కృతిక వర్గాలు...ఇలా ప్రతి సెక్షన్‌ను టార్గెట్ చేస్తూ లాంగ్ టర్మ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోడీ తాజా హైదరాబాద్ పర్యటనలో కూడా ఇదే వ్యూహం స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైకి చూస్తే సాధారణ అధికారిక కార్యక్రమాల్లా కనిపించినా...తెరవెనుక మాత్రం తెలంగాణ రాజకీయాలకు బలమైన సంకేతాలు పంపించారని ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్‌ను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే... ప్రతి కార్యక్రమం వెనుక ఒక పొలిటికల్ మెసేజ్ దాగి ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డికి చెందిన ఆసుపత్రిని ప్రారంభించడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గానికి సానుకూల సంకేతం పంపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా మరింత హాట్ టాపిక్ అయింది. అక్కడితో ఆగకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘ భేటీ నిర్వహించడం కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ భేటీలు కేవలం మర్యాదపూర్వక సమావేశాలు కావని... రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేసే అవకాశాలపై ముందస్తు చర్చలేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినీ, సాంస్కృతిక రంగానికి చెందిన తనికెళ్ల భరణి వంటి ప్రముఖులతో మోడీ ప్రత్యేకంగా కలవడం కూడా ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజంలో ప్రభావం ఉన్న వర్గాలను మెల్లగా దగ్గర చేసుకుంటూ... తెలంగాణలో బీజేపీ తన బేస్‌మెంట్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి కీలక నగరాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా..? లేక టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతుందా..? అన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే హైదరాబాద్‌తో పాటు పలు అర్బన్ ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంక్ ప్రభావం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్ల మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్లాన్ వేసింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ ఎన్నికలను సెమీ ఫైనల్ పోరుగా కమలం భావిస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో భేటీ అయ్యారనే చర్చ సాగుతోంది.హైదరాబాద్ లోని ఆంధ్ర సెటిలర్ల ఓట్లే టార్గెట్ గా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేకపోలేదు.

జనసేనకు యువత ఓటు బ్యాంకు బలం, టీడీపీకి సెటిలర్ వర్గాల్లో ఒక స్థాయి ఓటు బ్యాంక్ ఉందనే అంచనాలు లేకపోలేదు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. ఇకా రాజకీయంగా నల్గొండ,ఖమ్మం జిల్లాల్లో బీజేపీ ప్రభావం అత్యంత బలహీనంగా ఉంది.దీంతో ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే ఒకప్పటి టీడీపీ కంచుకోటగా ఉన్న జిల్లాలపై బీజేపీ కన్నేసిందట. ఏపీ తరహా కూటమి తెలంగాణలో ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేశారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందటా.. అందుకే ముందుగా స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల కలయికతో ఒక ట్రయల్ రన్ ప్రయోగం చేస్తున్నారనే టాక్.‌. అక్కడ సక్సెస్ అయితే అదే మోడల్‌ను అసెంబ్లీ ఎన్నికల వరకు తీసుకెళ్లాలని కమలం పార్టీ ఆలోచిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓట్ల బదిలీ సక్సెస్ అయితే... వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడా ఒకే చోటికి వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారటా.... దాంతో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చనే లెక్కల్లో బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం.

రాబోయే గ్రేటర్ మున్సిపల్, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆశించిన ఫలితాలు తీసుకురాలేకపోతే తర్వాత పార్టీ ప్రక్షాళనతో పాటు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతారనే టాక్ ఇప్పుడు పార్టీలో హల్‌చల్ చేస్తోందటా.. అవసరమైతే పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ తరహాలో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన ప్రజాదరణ కలిగిన పవర్‌ఫుల్ నేతలను తెలంగాణ బీజేపీలోకి చేర్చుకొని పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాన్ని కూడా అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ దిశగా కొందరు కీలక నేతలతో కమలదళం సైలెంట్‌గా టచ్‌లో ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మరి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. కమలం పార్టీ నిజంగానే కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుడుతుందా..? టీడీపీ,జనసేన,బీజేపీ కలయిక తెలంగాణలో గేమ్ ఛేంజర్ అవుతుందా..? లేక ఇవన్నీ కేవలం రాజకీయ ప్రచారానికే పరిమితమవుతాయా..? అన్నది రాబోయే స్థానిక ఎన్నికలతో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story