Burning Topic: ఉత్కంఠ రేపుతున్న మోదీ-ట్రంప్ సమావేశం

Burning Topic: ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక భేటీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Jun 2026 6:53 AM IST
Burning Topic
X

Burning Topic: ఉత్కంఠ రేపుతున్న మోదీ-ట్రంప్ సమావేశం

Burning Topic: ఈ నెల 16, 17 తేదీల్లో ఫ్రాన్స్‌లో గ్రూప్ ఆఫ్ సెవెన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ వెళ్లారు. జీ సెవెన్ సదస్సు ముగించుకున్నాక.. ఈ నెల 17న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అత్యంత కీలక భేటీ జరగనుంది. ట్రంప్- మోదీ భేటీని వైట్ హౌస్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నెల 17న ఫ్రాన్స్‌లోని జీ7 సదస్సు నేపథ్యంలోనే సైడ్‌లైన్స్‌లో భాగంగా ఇరువురు నేతల సమావేశం జరగనుందని అమెరికా సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్, స్లొవేకియా దేశాల పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మోదీ, ట్రంప్ ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో కలుసుకున్న తర్వాత, మళ్లీ ఇప్పుడు నేరుగా ముఖాముఖి భేటీ కానుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

ప్రపంచ దేశాల్లో సైతం ఆసక్తిని రేపుతున్న మోదీ, ట్రంప్ మధ్య అత్యంత కీలకమైన భేటీ.. సున్నితమైన సమయంలో జరుగుతుండటంతో హాట్ టాపికైంది. ఇటీవల ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హర్ముజ్ జలసంధి'లో అమెరికా జరిపిన క్షిపణి దాడులు రెండు దేశాల మధ్య సత్సంబంధాలపై నీలినీడలు కమ్మేలా చేశాయి. ముఖ్యంగా జూన్ 10న జరిగిన ఒక దాడిలో భారత్‌కు చెందిన వాణిజ్య నౌక దెబ్బతిన్నది. అంతేకాక అందులో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ విషాదకర సంఘటన తర్వాత భారత్, అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ మోదీ, ట్రంప్ భేటీ కానుండటం, ఈ విభేదాలను పరిష్కరించుకుని ముందుకు సాగడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు.

రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక పూర్తి స్థాయి ఒప్పందం ఖరారు కాలేదు. దీంతో ఇదే ప్రధాన అజెండాగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా విధిస్తున్న కొన్ని సుంకాల నుంచి మినహాయింపు కోరుతున్న భారత్.. పలు కీలక అంశాల్ని ప్రస్తావించే అవకాశం ఉంది. భారత ఐటీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసా విధానం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్- అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన భద్రత కూడా ప్రాధాన్య అంశంగా ఉండనున్నట్లు సమాచారం.

మోదీ- ట్రంప్ భేటీ భారత్- అమెరికా దీర్ఘకాలిక సంబంధాలకు కీలకంగా మారనుంది. ఇటీవల కొన్ని అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నప్పటికీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. రక్షణ, సాంకేతిక రంగాలకు అవసరమైన క్రిటికల్ మినరల్స్ భద్రతపై వ్యూహాత్మక అడుగులు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. దాంతో పాటు అమెరికా - ఇరాన్ యుద్ధ పరిణామాలు, జావెలిన్ క్షిపణుల కొనుగోలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చించే అవకాశం లేకపోలేదు. మరోవైపు భారత్‌లో అమెరికా పెట్టుబడులను ఆకర్షించడం, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను పెంపొందించడంపైనా ఇరువురు నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్, ముఖ్యంగా AI మరియు ఇన్నోవేషన్ రంగాలలో ఉమ్మడి పరిశోధనలకు మోదీ, ట్రంప్ శ్రీకారం చుట్టనున్నారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story