Burning Topic: గంగ యమునా నదుల ఉగ్రరూపం.. ఉత్తర భారతంలో వరదలు!
Burning Topic: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉధృతి; యూపీ, అస్సాం, హిమాచల్‌లో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం. సహాయక చర్యలు ముమ్మరం.
Burning Topic: గంగ యమునా నదుల ఉగ్రరూపం.. ఉత్తర భారతంలో వరదలు!
Burning Topic: దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ కశ్మీర్, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్ర నష్టం వాటిల్లింది.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కుండపోత వానలు, వరదలతో అల్లాడిపోతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లోని సుమారు 2.5 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. భారీ వర్షాలు, వరదల వల్ల గడిచిన 24 గంటల్లోనే కనీసం 18 మంది మరణించారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన వేర్వేరు వర్షపు ప్రమాదాల్లో 4 మంది మృతి చెందారు. కాన్పూర్, ఉన్నావో, బదాయూన్, కన్నౌజ్, హర్దోయ్, బలియా, బహ్రైచ్, ఫరూఖాబాద్ జిల్లాల్లో పిడుగుపాట్లు, ఇతర ప్రమాదాల వల్ల ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రయాగ్‌రాజ్, వారణాసి, బలియా, బదాయూన్ వంటి ప్రాంతాల్లో గంగా, యమునా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వందలాది పడవలను మోహరించారు.
550కి పైగా పడవలు, మోటార్ బోట్లను ఉపయోగిస్తున్నారు. ఆహార పొట్లాలు, తాగునీరు అందిస్తున్నారు. 3,700 మందికి పైగా ప్రజలు ప్రత్యేక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిన్న ఒక్క రోజే 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం నీట మునిగి కెనాల్‌ను తలపించింది. వర్షం కారణంగా నగరంలోని దాదాపు 6వేల ఇళ్లలోకి నీరు చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
దీంతో వారంతా రూఫ్‌టాప్‌లు, పైఅంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రయాగ్‌రాజ్‌లో వరద పరిస్థితిపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. అటు ఈశాన్య రాష్ట్రం అస్సాంను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
బ్రహ్మపుత్రా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్, చరైడియో, కర్బీ ఆంగ్లాంగ్, ధేమాజీ జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 32 వేల మంది ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి.
ఈ ఏడాది వరదల కారణంగా ఇప్పటివరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల వారీగా చూస్తే శివసాగర్‌లో అత్యధికంగా 53 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటిలో 3,198.77 హెక్టార్ల పంట భూములు మునిగిపోయాయి.
దీంతో వ్యవసాయ పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది.దాదాపు 3 వేల మంది సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులకు అధికారులు నిత్యావసరాలు, ఇతర సహాయాన్ని అందిస్తున్నారు.
అస్పాంలో ప్రతి ఏడాది రుతుపవనాల సమయంలో వరదలు సాధారణమే. ఈ ఏడాది ఇప్పటివరకు అసోంలో వరదల ప్రభావం భారీగా ఉంది. రాష్ట్రంలోని 25 జిల్లాలు, 2,734 గ్రామాల్లో 12 లక్షల మందికి పైగా ఏదో ఒక దశలో వరదల బారిన పడ్డారు.
ముఖ్యంగా బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు భారీ వర్షాలకు ఉప్పొంగడంతో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు, ఇతర మౌలిక వసతులు ముంపునకు గురవుతుంటాయి. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. అస్పాంలోఇప్పటికీ వేలాది మంది వరద ప్రభావంలో ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు. జలాశయాల నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రానున్న రోజుల్లో వర్షపాతం, నదుల నీటిమట్టాలపై వరద పరిస్థితి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విగిడిపడటంతో పరిస్థితి బీభత్సంగా మారింది.
చండీగఢ్-సిమ్లా జాతీయ రహదారి తో పాటు కల్కా-సిమ్లా ప్రపంచ వారసత్వ రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అటు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఉదంపూర్ జిల్లాలోని జమ్మూ , శ్రీనగర్ జాతీయ రహదారి మీద కొండచరియలు విరిగిపడి రోడ్డు దెబ్బతింది. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలలో మేఘ విస్పోటనాలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి.
మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా మహారాష్ట్రల్లో కుండపోత వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం భారత వాతావరణశాఖ హెచ్చరించింది.




