Off The Record: తెలంగాణలో సువేందు అధికారి సీన్ రిపీట్? సీఎం రేవంత్‌పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..
Off The Record: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Off The Record: తెలంగాణలో సువేందు అధికారి సీన్ రిపీట్? సీఎం రేవంత్‌పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. హిందూత్వ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి "నాతో కలిసి పనిచేయండి,మీ గమ్యానికి చేరుస్తానన్న" మోదీ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి మాటలు వస్తే వెంటనే మర్చిపోతారు..కానీ.. ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు అదే కామెంట్‌ను ఎంపీ అరవింద్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డికి మోదీతో స్పెషల్ లింక్ ఉందేమో నాకు తెలీదు.. బీజేపీలో నేను చిన్న కార్యకర్తను అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా బెంగాల్ రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తూ..సువేందు అధికారి ఎలా టీఎంసీ నుంచి బీజేపీలో చేరాడో.. తెలంగాణలో కూడా అలాంటి పరిణామాలు జరుగొచ్చేమో అంటూ అరవింద్ అనుమానం వ్యక్తం చేయడం మరింత సంచలనంగా మారింది. అసలు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల వెనుక రాజకీయ లెక్కలేంటి..? కాంగ్రెస్‌లో గందరగోళం సృష్టించే మాస్టర్ ప్లానా..? అన్న చర్చ మొదలైంది.ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం ఇవన్నీ బీజేపీ రాజకీయ డ్రామాలంటూ కొట్టి పారేస్తున్నారు.. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం మోదీ కామెంట్,అరవింద్ వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే ఏదో పెద్ద రాజకీయ మైండ్ గేమ్ నడుస్తోందంటూ అనుమానాలు ఉత్పన్నమవుతున్నయట.
ఇక ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు..ఏకంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేయడం మరింత అగ్గి రాజేసింది.. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టి.. పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చారంటూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుబట్టడం రచ్చకు దారితీసింది.. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా అరవింద్ తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు.. 2034 వరకు నేనే సీఎం.. తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. అంటే 2039 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టే అంటూ ఎదురుదాడి చేశారాయన. ఇంకా పదేళ్లు దేశంలో బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో హిందుత్వ, జాతీయత, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల మాటలు పెరిగాయని, ఆయన మా పార్టీలోకి రావడానికి ఆరాటపడుతూ.. మోడీని ఇంప్రెస్ చేస్తున్నారంటూ అరవింద్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శలేనా..? లేక నిజంగానే భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు బీజేపీ స్కెచ్ వేస్తోందా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు రాజకీయ ఆరోపణలు.. మరోవైపు వ్యక్తిగత విమర్శలు.. తెలంగాణ రాజకీయాలు మాటల తూటాలతో వేడేక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధ పోరు రాబోయే రోజుల్లో మరింత హాట్ టాపిక్‌గా మారే అవకాశం లేకపోలేదు.
ఇక నిజామాబాద్ రాజకీయాలపై కూడా ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లాకు రావాల్సిన నిధులు రావడం లేదని.. అభివృద్ధి పనులు ఆగిపోయాయని రాజకీయ బాణాలు సంధించారు. ఉన్నట్టుండి ఎంపీ చేసిన సంచలన ఆరోపణ ఏంటంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా బలహీనపర్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్‌ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. నిజామాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మర్చిపోయారని ఆరోపించారు.. ఇందూరు ప్రజలను మోసం చేస్తే వాళ్ళు ఊరుకోరు అంటూ అరవింద్ హెచ్చరించారు. ఎన్నికల ముందు దేవుళ్లకు ఇచ్చిన హామీలనే నిలబెట్టని రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెడతాడా” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పెంచుతున్నాయి.. ఒకవైపు కాంగ్రెస్ – బీజేపీ మధ్య మాటల యుద్ధం.. మరోవైపు రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయాలపై కొత్త ఊహాగానాలు. ఇంకోవైపు బీజేపీ నేతల వరుస కామెంట్లు.. ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఒకవైపు మోదీ మాట.. మరొకవైపు అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఇవన్ని తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులకు దారి తీస్తాయా ..? నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరగబోతుందా..? లేక ఇవన్నీ రాజకీయ వేడి పెంచే మైండ్ గేమ్ వ్యూహాలేనా..? ఎంపీ అర్వింద్ మాటల రాజకీయం ఎటు మలుపులు తిరుగుతోందో ! చూడాలి మరి.




