Off The Record: బీజేపీలో కల్లోలం.. ఆ ఇద్దరు నేతలకు ఎక్కడ చెడింది.?
Off The Record: తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయం బట్టబయలైంది! ఎంపీ లక్ష్మణ్ మరియు ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య లేఖల యుద్ధం ఎందుకు మొదలైంది?
Off The Record: బీజేపీలో కల్లోలం.. ఆ ఇద్దరు నేతలకు ఎక్కడ చెడింది.?
Off The Record: తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ మరింత ముదిరింది. ముఖ్యనేతల మధ్య..వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా కమలదళంలో ఫిర్యాదు లేఖ కలకలం రేపుతోంది. నిన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వార్, అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర పార్టీలో ఓ కేంద్రమంత్రి, ఓ సీనియర్ ఎంపీల పెత్తనం ఎక్కువైందని ఇటీవల ప్రధానికి లేఖ రూపంలో ఫిర్యాదులు అందాయనే ప్రచారం పార్టీలో పెద్ద దుమారమే రేగింది. దీన్ని కొనసాగింపుగా పార్టీలో నేతల మధ్య రాజకీయ మంటలకు దారితీసింది. ముఖ్యంగా లేఖ మంటలు ఇద్దరు ఎంపీల కేంద్రంగా మారిపోయింది. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మధ్య పోటాపోటీ చిట్ చాట్ వ్యాఖ్యలతో అంతర్గత పోరుకు మరింతా ఆజ్యం పోసినట్టైంది.
ఇప్పటికే పార్టీలో కొత్త, పాత అంటూ ఆధిపత్య పోరు జోరుగా నడుస్తోంది. ఇదిలా ఉండగానే..పార్టీలో ఇద్దరు కీలక నేతల తీరు నచ్చక ఇటీవల ప్రధాని మోదీకి లేఖ పంపించారనే ప్రచారం పార్టీలో రచ్చ లేపింది. ఓ కేంద్ర మంత్రి, ఓ సీనియర్ ఎంపీ పెత్తనం ఎక్కువైందని, ప్రతి దాంట్లో వారి జోక్యం పెరిగిపోయిందని ,గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులు అంటూ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెల్లాయట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతల తీరులో మార్పు రాకుంటే పార్టీలో మేము ఉండాలా? లేదా ? అని ఎంపీలు, ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. ఇదే విషయంపై మీడియా చిట్ చాట్ లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ లేఖల సంస్కృతి పార్టీ హిస్టరీలోనే లేదని కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారాయన.. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్.. దీనికి కౌంటర్ గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ రచ్చకు దారితీసింది.
ఎంపీ లక్ష్మణ్ చిట్ చాట్ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే ఎంపీ అరవింద్ చిట్ చాట్ పెట్టడంతో వీళ్లిద్దరి మధ్య అంతర్గత పోరుగా మారింది. పార్టీలో లేఖల సంస్కృతి లేదని లక్ష్మణ్ అనడంపై అరవింద్ తనదైన శైలిలో సెటైరికల్ డైలాగులు పేల్చారు. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ... 2004 నుండి ఇప్పటివరకు ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాదాపుగా 1120 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరిగితే గెలిచింది 18 ఎమ్మెల్యే స్థానాలు. దీని గురించి గూగుల్ ను అడిగినా చెబుతుంది కదా.? దీనికి లేఖ రాయడం ఎందుకు స్టేషనరీ దండగ అంటూ సెటైర్లు పేల్చారు. అలాగే లేఖలు రాసే సంస్కృతి లేదని లక్ష‌్మణ్ అనడం విడ్డూరమని, గతంలో స్వయంగా నా మీదనే అధిష్టానానికి లేఖ రాశారు..నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి, బూతులు తిడుతున్నట్లు అధిష్టానానికి లేఖలో ఫిర్యాదు చేశారని అరవింద్ మండిపడ్డారు. నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ ఇంత బలంగా ఎలా ఉంటుంది..తెలంగాణలోనే నెంబర్ వన్ జిల్లాగా నిజామాబాద్ బీజేపీ ఉంది. నేను ఇంతవరకు పార్టీని కానీ..లక్ష్మణ్ ను కానీ ఒక్కసారి కూడా తిట్టలేదు.. ఏదైనా అంటే కేసీఆర్ నే తిట్టిన కానీ అది కూడా బూతు మాటలు అనలేదు. కావాలంటే ఏఐలో వెతికినా నేను బూతులు మాట్లాడినట్టు దొరకవు...అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ అరవింద్. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనే చర్చ జరుగుతోంది.
మున్సిపల్ ఫలితాల తర్వాత పార్టీలోని పరిణామాలపై ఎంపీ అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మెట్‌పల్లిలో కాంగ్రెస్ కు బీజేపీ కౌన్సిలర్ క్రాస్ ఓటు వేయడం.. అక్కడ బీజేపీ కౌన్సిలర్స్ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీనిపై అరవింద్ స్పందిస్తూ... 30 ఏండ్ల నుండి పార్టీలో పాతుకుపోయి కోవర్ట్ లుగా పనిచేస్తున్న వారందరు.. పార్టీ నుంచి వెంటనే వెళ్ళిపోవాలని హెచ్చరించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా పార్టీలోని ఇద్దరు నేతల తీరుపై మోడీకి లేఖ రాశారనే వార్త వైరల్ అయింది. దాన్ని ఊటంకిస్తూ పార్టీలో లేఖల సంస్కృతి లేదని లక్ష్మణ్ కొట్టిపారేయడం,,గతంలో రాసిందేంటనీ అరవింద్ సెటైర్స్ వేయడంతో ఒక్కసారిగా పార్టీలో అలజడి రేపుతోంది. ఎంపీలు లక్ష్మణ్, అరవింద్ మధ్య రాజుకున్న చిట్ చాట్ వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయట. అసలు లేఖ రాసింది నిజమా ? కాదా ? అనే దానికంటే ఈ ఇద్దరు ఎంపీల మధ్య పేలిన మాటలు, సైటర్స్ పైనే జోరుగా చర్చించుకుంటున్నారట. అసలు వీరిద్దరు ఎందుకు లేఖాస్త్రంపై పోటాపోటీగా స్పందించారనే చర్చ లేకపోలేదు.
ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విస్తరణ జరిగితే తెలంగాణ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతోనే నేతల మధ్య పోటీ తీవ్రంగా పెరిగిందట. కేబినెట్ బెర్త్ పై కీలక నేతలు కన్నేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ రేసులో భాగంగానే.. డైలాగ్స్, సైటైర్లతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఒకవైపు జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ , మరోవైపు నిజామాబాద్ ఎంపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ రేసులో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ తరుణంలోనే ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలోనే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయటా..
మొత్తానికి తెలంగాణ బీజేపీలో లేఖల రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నేతల అంతర్గత పోరుపై అధిష్టానం దృష్టి సారించి ఫుల్ స్టాప్ పెడుతుందా ? లేక పార్టీ అంతర్గత సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.




