Off The Record: నల్గొండలో కొత్త దోస్తీ!
Off The Record: నల్లగొండలో బీజేపీ తీరుపై చర్చ సాగుతోంది. రీల్స్ కోసం పబ్లిసిటీ స్టంట్లు, వర్గపోరు, బీఆర్ఎస్ నేతలతో రహస్య దోస్తీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Off The Record: నల్గొండలో కొత్త దోస్తీ!
Off The Record: నల్లగొండ జిల్లాలో ఒకవైపు అధికార కాంగ్రెస్ స్పీడ్. మరోవైపు ఆధిపత్యం కోసం గులాబీ దళం ఆరాటం.. మరి ఈ రెండింటి మధ్య నల్లగొండ బీజేపీ ఏం చేస్తోంది..? ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన పేరిట బీజేవైఎం, బీజేపీ నేతలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు.
అక్కడివరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బీజేపీ చేసిన యాక్షన్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఇచ్చిన రియాక్షన్‌తో నల్లగొండ టౌన్ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి, ఫర్నిచర్ ధ్వంసం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అనంతరం బిజెపి కార్యాలయంపై దాడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో ఫ్లెక్సీలను చింపివేశారు. నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి జరిగి, సీనియర్ సిటిజన్, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన వర్షిత్ రెడ్డి తల్లి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైతే... నల్లగొండ కమలనాథులు ఏమయ్యారన్న ప్రశ్న జిల్లా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.
ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేనప్పుడు, కేడర్‌కు ఇచ్చే సందేశం ఏంటి..? ప్రత్యర్థులు దాడి చేస్తే తిప్పికొట్టడం దేవుడెరుగు.. కనీసం ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చే నాథుడే కరువయ్యాడు.
దాడి జరిగిన తర్వాత పార్టీ ఆఫీస్‌కు వచ్చిన కొందరు నేతలు.. "మేము ఈ గొడవలో లేము" అని చెప్పడానికే వచ్చినట్లు ప్రవర్తించడం నల్లగొండ బీజేపీలోని గ్రూపు తగవులకు పరాకాష్ట కాదా..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కొంతమంది నేతలకు మంత్రి క్యాంపు కార్యాలయం మీద దాడి విషయమే తెలవదని చెప్పడం కోసమెరుపు.
అసలు నల్లగొండ బీజేపీలో ఈ స్థాయిలో వర్గపోరు రగులుతుండటానికి కారణమేంటి..? ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి.. సోషల్ మీడియాలో లైక్‌లు, రీల్స్‌లో వ్యూస్ కోసం జిల్లా అధ్యక్షుడు నాగం వేస్తున్న అడుగులే కారణమా..? ఆందోళనల పేరిట రోడ్లపైకి రావడం, కావాలనే రచ్చ సృష్టించి పోలీసులతో వాగ్వాదానికి దిగడం, దాన్ని కెమెరాల్లో బంధించి రీల్స్ చేసుకోవడం..
ఇదేనా నాయకత్వ లక్షణం అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. సీనియర్లను, గ్రౌండ్ లెవెల్ కేడర్‌ను పక్కనబెట్టి, కేవలం క్రెడిట్ వార్ కోసం, పబ్లిసిటీ స్టంట్ల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారన్న ఆగ్రహం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోందట.
ఈ కథలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. బీజేపీ జిల్లా అధ్యక్షుడి వెనుక ఉన్న BRS మాజీ ఎమ్మెల్యే అభయహస్తమేనన్న టాక్ లేకపోలేదు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డికి నడుస్తున్న ఆ 'రహస్య స్నేహం' వెనుక ఉన్న రాజకీయ స్వార్థం ఏంటి..? గతంలో ఇదే కంచర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన నేత..
ఇప్పుడు ఆయన భుజంపై చెయ్యి వేసి నడవటం వెనుక ఉన్న పొలిటికల్ స్కెచ్ ఏంటి..? సిద్ధాంతపరంగా శత్రువులైన BRS, బీజేపీ నేతల మధ్య ఈ రకమైన 'క్రాస్ పాలిటిక్స్' నడుస్తుంటే.. అధిష్టానం ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది అనే చర్చ రెండు పార్టీల కేడర్లో వినిపిస్తోంది.
బిజెపిలో ఓ బీసీ నాయకుడుని దెబ్బతీయడానికి నల్గొండలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ కుమ్మక్కై ఆ నేత ఓటమికి కారణమయ్యారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిందని ఆరోపణలు ఉన్నాయి.
ముందస్తు వ్యూహం లేకుండా మంత్రి క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఊహించలేకపోవడం.. నల్లగొండ బీజేపీ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనం అని కొంతమంది సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు సీనియర్-జూనియర్ గ్యాప్, మరోవైపు కుల రాజకీయాలు, అంతకుమించి రాష్ట్ర స్థాయి నేతల అతి జోక్యం.. నల్లగొండ కమలాన్ని రోజురోజుకూ బలహీనపరుస్తున్నాయట. కష్టపడి పనిచేసే బీసీ నేతలను పక్కనబెట్టి, కేవలం రీల్స్ నమ్ముకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మిగిలేది సున్నా మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
రీల్స్ వ్యూస్ పెరిగినంత మాత్రాన రాజకీయ గ్రాఫ్ పెరిగిపోతుందా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కెమెరా ముందు వేసే స్టంట్లు తాత్కాలికంగా వార్తల్లో నిలబెట్టవచ్చు కానీ.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించిపెట్టలేవన్న అభిప్రాయం రాజకీయ విమర్శకుల్లో వినిపిస్తోంది. సిద్ధాంతాలను పక్కనబెట్టి సాగిస్తున్న ఈ రహస్య దోస్తీలు, సొంత పార్టీలోని వర్గపోరు నల్లగొండ బీజేపీని ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి.




