Off The Record: షాకిస్తున్న కేసీఆర్ వ్యూహం!
Off The Record: నల్లగొండలో అధికార కాంగ్రెస్‌ను ఎదిరించేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో ఇతర పార్టీల ఆందోళనలకు మద్దతు ఇస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Off The Record: షాకిస్తున్న కేసీఆర్ వ్యూహం!
Off The Record: నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న కొత్త రాజకీయ వైఖరి.. స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్‌పై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ నేతలు.. ఒంటరి పోరుకు బదులుగా ఇతర పక్షాల ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతున్నారు.
గతంలో బీజేపీ నేత నాగం వర్షితారెడ్డిపై పోలీసుల తీరును ఖండించిన బీఆర్ఎస్, తాజాగా సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓఆర్ఆర్ బాధితుల సమస్యలపై బీజేపీతో కలిసి గళం విప్పడం, ఇప్పుడు సీపీఎంతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి వెళ్లడం వంటి పరిణామాలు నల్లగొండలో విభిన్న రాజకీయ కూర్పునకు సంకేతంగా మారుతున్నాయి..
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు.. గులాబీ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు అద్దం పడుతున్నాయి. సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి ఆందోళనల్లో పాల్గొనడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం జరుగుతోంది.
ఒకవైపు బీజేపీ భావజాల నేతలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తూనే, మరోవైపు వామపక్ష భావజాలం ఉన్న సీపీఎం పోరాటాలకు బహిరంగ మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులను ఒకే వేదికపైకి తెచ్చే 'త్రిముఖ వ్యూహం' అమలు చేస్తున్నారన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది..
అయితే ఇతర పార్టీల ఆందోళనలకు మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్... అదే ప్రజా సమస్యలపై సొంతంగా ప్రత్యేక ఉద్యమాలు ఎందుకు చేపట్టడం లేదనే ప్రశ్న ఇప్పుడు సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.
నియోజకవర్గంలో స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిపై పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసి సొంతంగా పోరాడితే రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
కేవలం ఇతర పార్టీల ఆందోళనలకు మద్దతు ఇవ్వడం వల్ల తాత్కాలిక ప్రయోజనం ఉండవచ్చు కానీ, కేడర్‌లో పూర్తిస్థాయి జోష్ నింపడానికి స్వతంత్ర పోరాటాలు కూడా అవసరమనే చర్చ పార్టీలో గుసగుసలుగా వినిపిస్తోంది..
నల్లగొండ గడ్డపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్న తరుణంలో, ఆయనను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది.
మున్సిపల్ ఎన్నికల సమయంలో కొన్ని వార్డుల్లో కుదిరిన అవగాహనలే ఇప్పుడు మరో రూపంలో బయటపడుతున్నాయనే అంచనాలున్నాయి. మర్రిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం వంటి కొన్ని అంశాలపై బీఆర్ఎస్ నేరుగా పోరాడినప్పటికీ, పెద్ద ఎత్తున జరిగే ప్రజా ఆందోళనల్లో మాత్రం ఇతర పార్టీలతో కలిసికట్టుగా ముందుకు సాగడం గమనార్హం..
ప్రస్తుతానికి బీజేపీ, సీపీఎం, బీఆర్ఎస్ల మధ్య కనిపిస్తున్న ఈ సమన్వయం కేవలం నిర్దిష్ట ప్రజా సమస్యలపై పరస్పర మద్దతా? లేక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జరుగుతున్న రాజకీయ సర్దుబాటా? అనేదానిపై స్పష్టత లేదు.
ఏది ఏమైనప్పటికీ, అధికార కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చే అవకాశం ఉందా అనే కోణంలో జరుగుతున్న ఈ పరిణామాలు నల్లగొండ రాజకీయ ముఖచిత్రాన్ని వేడెక్కిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే... నల్లగొండలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న ఈ 'కొత్త కూర్పు' వ్యూహం భవిష్యత్తు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. స్వతంత్ర పోరాటాల ద్వారా పార్టీని నిలబెట్టడమా? లేక ఇతర పార్టీలతో కలిసి సంయుక్త పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టడమా..? అనే మీమాంసలో గులాబీ పార్టీ ప్రయాణిస్తోంది.
ఈ వ్యూహం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టనుందనేది కాలమే నిర్ణయించాలి.




