Off The Record: రేవంత్ మిత్రుడికే ఎమ్మెల్సీ!

Off The Record: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక ఉత్కంఠ. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పేరు పరిశీలనలో ముందు వరుసలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Sept 2026 8:49 AM IST
Off The Record
X

Off The Record: రేవంత్ మిత్రుడికే ఎమ్మెల్సీ!

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ నలుగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు తుది ఘట్టానికి చేరింది. ప్రభుత్వం పంపే పేర్లను గవర్నర్ ఆమోదించాల్సి ఉండటంతో, వివాద రహితులు, పార్టీకి సుదీర్ఘకాలం సేవ చేసిన వారి పేర్లను మలిచేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం గాంధీభవన్‌లో తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతోంది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన అసలైన నిబద్ధత కలిగిన నేతలకే అవకాశమివ్వాలని పట్టుదలతో ఉన్నారట.

ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చి, అందరి కంటే ముందు వరుసలో నిలిచిందనే చర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది. పున్నా కైలాష్ నేత... విద్యార్థి ఉద్యమాల నుంచి రూపుదిద్దుకున్న పక్కా మాస్ లీడర్.

విద్యార్థి దశలోనే ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడి నాయకుడిగా ఎదిగిన చరిత్ర ఆయన సొంతం. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం ఆయనకు అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారింది.

రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న 'జనగణన - బీసీ సామాజిక న్యాయం' లైన్‌కు అనుగుణంగా కైలాష్ నేత వంటి ఉద్యమ నేపథ్యం ఉన్న బీసీ నాయకుడిని చట్టసభకు పంపితే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల్లోకి బలమైన సానుకూల సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తోందట.

పార్టీకి విధేయుడిగా ఉంటూనే, బీసీ కోటాను భర్తీ చేసేందుకు కైలాష్ నేత సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేస్తున్నారట.. రాజకీయాల్లో విశ్వసనీయతకు అసలైన పరీక్ష మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎదురైంది. ఆనాడు రాష్ట్రంలో నడిచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ హవాలో కాంగ్రెస్ నాయకులను చేర్చుకునేందుకు అధికారపక్షం సర్వశక్తులూ ఒడ్డింది.

పున్నా కైలాష్ నేతకు కూడా అధికార పార్టీ నుంచి మైండ్ బ్లాకింగ్ ఆఫర్లు వచ్చాయన్నది బహిరంగ రహస్యం! ప్యాకేజీలతోపాటు పదవుల ఎర వేసినా.. కైలాష్ నేత మాత్రం రూపాయికి లొంగలేదు, అధికారానికి తలవంచలేదు.

'నా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ జెండానే పట్టుకుంటా' అని భీష్మించుకు కూర్చున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీకి రక్షణ కవచంలా నిలబడ్డ ఆ నిబద్ధతనే ఇవాళ ఆయనను ఎమ్మెల్సీ రేసులో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.

అన్నింటినీ మించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పున్నా కైలాష్ నేత అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడైన నాయకుడు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ నేటి వరకు... ఆయన వేసిన ప్రతి అడుగులోనూ, ఇచ్చిన ప్రతి పిలుపులోనూ కైలాష్ నేత ముందువరుసలో నిలిచారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న పూర్తి విశ్వాసం, బీసీ సామాజికవర్గం అండ, పార్టీ పట్ల చెరగని నిబద్ధత.. ఇవన్నీ పున్నా కైలాష్ నేతకు ఎమ్మెల్సీ సీటును దాదాపు ఖరారు చేశాయని నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అధిష్టానం నుంచి కూడా సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనే వార్తలతో ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే సంబరాలకు సిద్ధమవుతున్నారు..

పార్టీని నమ్ముకుని, పదవుల ఎరను తృణప్రాయంగా తిరస్కరించిన ఒక నిఖార్సైన కార్యకర్తకు, నాయకుడికి కాంగ్రెస్ పాలనలో సముచిత స్థానం దక్కబోతోందనడానికి ఈ పరిణామాలే ప్రత్యక్ష నిదర్శనం.

పున్నా కైలాష్ నేతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడం ఇక అధికారిక ప్రకటన మాత్రమే బాకీ ఉందా..? లేదా చివరి నిమిషంలో ఏమైనా సమీకరణాలు మారతాయా..? అన్నది ఉత్కంఠగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story