Off The Record: టీడీపీలో కొత్త కమిటీలు..సీనియర్ల ఔట్.. లోకేష్ వ్యూహం అదేనా?
Off The Record: టీడీపీ కొత్త కమిటీల్లో అనంతపురం జిల్లా సీనియర్ నేతలకు మొండిచేయి. యువతకు ప్రాధాన్యతనిస్తూ పార్టీని ప్రక్షాళన చేస్తున్నారా?
Off The Record: టీడీపీలో కొత్త కమిటీలు..సీనియర్ల ఔట్.. లోకేష్ వ్యూహం అదేనా?
Off The Record: ఏపీలో అధికార టీడీపీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఉమ్మడి అనంతపురం నుంచి యువతకు ప్రాధాన్యం దక్కినా.. పలువురు సీనియర్లకు నిరాశే ఎదురైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత కమిటీలోని కీలకమైన వ్యక్తులను ఈసారి పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరోలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు రాయదుర్గం నుంచి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మరోమారు చోటు దక్కించుకున్నారు. జాతీయ అధికార ప్రతినిధులుగా రాయదుర్గం నియోజకవర్గం నుంచి దీపక్ రెడ్డి, పెనుకొండ నుంచి ఎంపీ పార్థసారథి ఎంపికయ్యారు. రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా మడకశిర నుంచి మరోమారు గుండుమల తిప్పేస్వామిని కొనసాగించారు. గత కమిటీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న పరిటాల శ్రీరాంను కొత్త కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎంపిక చేశారు.
గుంతకల్లు నుంచి పత్తి హిమబిందు, రాప్తాడు నుంచి రంగయ్య, కదిరి నియోజకవర్గం నుంచి ఫర్వీన్ భానును తాజా కమిటీలో కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించారు. అత్యధికంగా అనంతపురం నగరం నుంచి దేవెళ్ల మురళి, కొండవీటి భావన, ఉమర్ ముక్తియార్, ఆదినారాయణ, సంగా తేజశ్విని, పొలన్న, బీవీ వెంకట్రాముడిని రాష్ట్ర కార్యదర్శులుగా ఎంపిక చేశారు. బీవీ వెంకట్రాముడికి మీడియా కమిటీలోనూ ప్రాధాన్యం కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నుంచి సామకోటి ఆదినారాయణ, రాప్తాడు నుంచి రామసుబ్బమ్మ, పెనుకొండ నుంచి నిమ్మల అంబరీష్, పుట్టపర్తి నుంచి నరసింహులును కార్యదర్శులుగా నియమించారు.
గత కమిటీలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జాతీయ, రాష్ట్ర కమిటీలో నేతలకు ప్రాధాన్యం దక్కింది. కొత్త కమిటీలో చాలా మంది సీనియర్లను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాలకు కొత్త కమిటీలో అస్సలు ప్రాతినిథ్యం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి ఎవరికి ప్రాధాన్యం లేకపోవడంపై తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి టు మెన్ కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడుసహా పలువురు నేతలకు ప్రాతినిథ్యం దక్కింది. తాజా కమిటీలో ఎవరికీ చోటు దక్కకపోవడంపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి నుంచి ఈ సారి జాతీయ, రాష్ట్ర కమిటీలో ఎవరికీ చోటు దక్కలేదు. గుంతకల్లు నుంచి పత్తి హిమబిందు మినహా ఎవరికీ పదవులు దక్కలేదు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఒక్క నాయకుడికి రాష్ట్ర కమిటీలో స్థానం లేకపోవడం గమనార్హం. గతంలో మంత్రి పయ్యావుల కేశవ్‌కు స్థానం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి గత కమిటీలో చాలా మందికి ప్రాతినిథ్యం ఉన్నా.. కొత్త కమిటీలో ఒక్కరికీ పదవి రాకపోవడంపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కదిరి నియయోజకవర్గం నుంచి ఫర్వీన్ బాను మినహా ఎవరికీ పదవులు దక్కలేదు. అన్నగారి ఇలాకా హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ మినహా ఈ కమిటీలో ఎవరికీ పదవులు రాలేదు. గత కమిటీలో కీలక పదవులు అనుభవించిన జిల్లా నేతలకు ఈ కమిటీలో స్థానం లేకుండా పోయింది. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలకు అధిష్టానం కొత్త కమిటీలో షాక్ ఇచ్చింది.
తాజాగా ప్రకటించిన కమిటీలో యువతకు ప్రాధాన్యం కల్పించారు. పూర్తిగా సీనియర్లు, గత కమిటీలో కీలక పదవుల్లో ఉన్న వారిని పక్కన పెట్టడం వెనుక అనేక సర్వేలు, కారణాలు పనిచేశాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ సంస్కరణలలో భాగంగా పార్టీని ప్రక్షాళన చేస్తున్నారని... కమిటీ ఎంపికపై యువనేత నారా లోకేష్ ప్రభావం ఉందన్న చర్చ ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఇకపై పార్టీలో కష్టపడన వారికే పదవులు దక్కుతాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొత్త కమిటీలో చాలామంది సీనియర్లను పక్కన బెట్టడం.. ఆశించిన వారికి పదవులు దక్కకపోవడం ఆయా వర్గాలకు చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారట. పార్టీలో ముందు నుంచీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఓ బలమైన సామాజికవర్గానికి కమిటీలో అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కొత్త కమిటీల కూర్పు ఉమ్మడి జిల్లాలో కీలక నేతలకు పదవులు లేకుండా పోవడం.. యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏ రకంగా పనిచేస్తుందోనన్న చర్చ మొదలైంది. ఇంతకీ పార్టీని బలోపేతం చేయడంలో కొత్త కమిటీలో చోటు దక్కించుకున్నవారు ఏమేరకు కష్టపడతారో చూడలి.




