Off The Record: నారాయణపేట కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు!
Off The Record: నారాయణపేట కాంగ్రెస్‌లో వర్గపోరు, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి నియోజకవర్గానికి దూరం కావడం, పీఏ జోక్యంపై పార్టీ వర్గాల్లో ముమ్మర చర్చ సాగుతోంది.
Off The Record: నారాయణపేట కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు!
Off The Record: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచే నియోజకవర్గం నారాయణపేట. ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులే అంటుంటారు. ప్రజలు రాజకీయాలపై చైతన్యవంతంగా స్పందించే ఈ నియోజకవర్గంలో చిన్న పరిణామం కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది.
దాదాపు పదేళ్లపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎస్.రాజేందర్ రెడ్డి రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి సంచలన విజయం సాధించారు. యువ నేతగా, మహిళా నాయకురాలిగా, కొత్త ఆశలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన పర్ణిక రెడ్డి విజయం నారాయణపేట రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే కాదు.. నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం, పార్టీని సమన్వయం చేయడం, నాయకులు, కార్యకర్తలను ఒకే వేదికపై ఉంచడం అసలైన సవాల్. ఇక్కడే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన పర్ణిక రెడ్డికి ఆది నుంచీ అండగా నిలిచింది ఆమె మేనమామ కుంభం శివకుమార్ రెడ్డేనని రాజకీయ వర్గాలు చెబుతాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన.. గతంలో డీసీసీ అధ్యక్షుడిగానూ పని చేశారు.
ఎన్నికల సమయంలోనూ.. గెలిచిన తర్వాత కూడా నియోజకవర్గ రాజకీయ వ్యవహారాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండేదని స్థానిక నాయకులు చెబుతుంటారు. అయితే కొంతకాలంగా కుంభం శివకుమార్ రెడ్డి కూడా గతం మాదిరిగా చురుకుగా వ్యవహరించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి కూడా వివిధ కారణాల వల్ల నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడపకపోవడం రాజకీయంగా కొత్త పరిస్థితులకు దారి తీసిందని చెబుతున్నారు.
ఎమ్మెల్యే లేరు. కానీ అధికార కేంద్రం మాత్రం నడుస్తోందా..? ఇదే ఇప్పుడు నారాయణపేట రాజకీయాల్లో ప్రధాన చర్చ. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే ఎవరిని ఆశ్రయించాలి..? పార్టీ కార్యకర్తలు ఎవరిని సంప్రదించాలి..? ప్రభుత్వ శాఖల్లో పనులు చేయించుకోవాలంటే ఎవరిని కలవాలి..?
ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే పేరు వినిపిస్తోందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న పీఏ మాధవ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాల్లో అసాధారణ ప్రభావాన్ని సంపాదించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో కూడా ఆయన జోక్యం పెరిగిందని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారట. ఎమ్మెల్యే చెప్పాల్సిన విషయాలు, ఎమ్మెల్యే స్థాయిలో ఉండాల్సిన నిర్ణయాలు కూడా పీఏ ద్వారానే జరుగుతున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
నారాయణపేటలో మరో హాట్ టాపిక్.. అక్రమ ఇసుక, మట్టి వ్యవహారాలు. ముఖ్యంగా ధన్వాడ ప్రాంతంలో ఇసుక, మట్టి తవ్వకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాల వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తుండగా.. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఈ వ్యవహారాల్లో ఎమ్మెల్యే పీఏ పేరు కూడా వినిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ, మైనింగ్ అధికారులపై ప్రభావం చూపుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. సంబంధిత శాఖలు స్పందించాల్సి ఉంది. అయినప్పటికీ రాజకీయంగా మాత్రం ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి చికాకులు తెచ్చిపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.కేవలం ఇసుక, మట్టి వ్యవహారాలే కాదు..
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, సంక్షేమ పథకాల ఎంపిక, స్థానిక అభివృద్ధి పనులు, మున్సిపాలిటీ నిర్ణయాలు వంటి అంశాల్లో కూడా పీఏ మాధవ రెడ్డి జోక్యం పెరిగిందని కొందరు పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారట.
కార్యకర్తలను పక్కన పెట్టి కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారని.. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో చాలా మంది సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్‌లో మూడు పవర్ సెంటర్లా..? అన్న టాక్ లేకపోలేదు. ప్రస్తుతం నారాయణపేట కాంగ్రెస్‌లో మూడు వర్గాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
ఒకవైపు ఎమ్మెల్యే వర్గం... మరోవైపు సీనియర్ నాయకుల వర్గం.. ఇంకోవైపు పీఏ ప్రభావంతో నడుస్తోందని చెబుతున్న మరో వర్గం..
ఈ పరిణామాలతో పార్టీ కార్యక్రమాల్లో కూడా సమన్వయం లోపిస్తోందని నాయకులు చెబుతున్నారట. ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి..? ఎవరు స్టేజ్‌పై కూర్చోవాలి..? ఎవరిని పిలవాలి..? వంటి చిన్న చిన్న అంశాలే పెద్ద వివాదాలుగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధన్వాడ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు సంకేతమని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా బీజేపీ బలం పెరుగుతోందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు పరస్పరం సహకరించుకోకపోవడం.. కార్యకర్తల్లో అసంతృప్తి పెరగడం.. స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోవడం వంటి అంశాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఎడాది కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉండటం కూడా ఈ వివాదాలకు ప్రధాన కారణమా..? అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అవును.. ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఎక్కువకాలంగా నియోజకవర్గంలో ప్రత్యక్షంగా అందుబాటులో లేరన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు, కార్యకర్తలు, స్థానిక నాయకులు ఆమెను తరచుగా కలిసే అవకాశం లేకపోవడంతో మధ్యవర్తుల ప్రాధాన్యం పెరిగిందని చెబుతున్నారు.
దీంతో కింది స్థాయి నాయకులు తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
"ఎమ్మెల్యే లేని చోట.. ఇతరులే ఎమ్మెల్యేలుగా మారిపోయారు" అనే వ్యాఖ్యలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే పీఏ వ్యవహారశైలి, పార్టీ అంతర్గత విభేదాలపై కొందరు సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఈ వ్యవహారం ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్లిందని ప్రచారం ఉన్నప్పటికీ.. దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. అయినా సరే.. నారాయణపేట కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర నాయకత్వం దృష్టిని ఆకర్షిస్తున్నాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.




