Burning Topic: భారత్‌తో కలిసి అమెరికా మూన్ బేస్ మిషన్!
Burning Topic: చంద్రుడిపై శాశ్వత మూన్ బేస్ నిర్మాణం కోసం ఇస్రోను భాగస్వామిగా ఆహ్వానించిన నాసా.
Burning Topic: భారత్‌తో కలిసి అమెరికా మూన్ బేస్ మిషన్!
Burning Topic: ఆకాశంలో తెల్లగా మెరిసిపోతూ కనిపించే చందమామను ఇష్టపడంది ఎవరు? ఆ గ్రహం మీదకు వెళ్లాలని, అక్కడే కాపురం కూడా పెట్టాలని మానవుని శతాబ్దాల స్వప్నం.. అనే ఆశ కలగానే మిగిలిపోవడం లేదు. చంద్ర గ్రహం మీద రహస్యాలు ఛేదించడానికి నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో చాలా వరకూ సత్ఫలితాలను కూడా ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 20న తొలిసారిగా చంద్రుని మీద అడుగు పెట్టిన ఘనతను సాధించారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసా అపోలో 11 మిషన్ ద్వారా దీన్ని విజయవంతం చేసింది. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌లో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రగ్రహ యాత్ర 'ఆర్టెమిస్-2' విజయవంతంగా పూర్తయింది. నలుగురు వ్యోగాములు చంద్రున్ని దగ్గర నుంచి చూసి వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాముల కోసం శాశ్వత ఆవాసం నిర్మించాలని ‘నాసా’ ఒక రోడ్‌మ్యాప్ సిద్ధంచేసింది.
చందమామపై శాశ్వత మానవ ఉనికిని ఏర్పాటు చేయాలన్నదే నాసా లక్ష్యం. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మానవుల నివాసానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. అక్కడ దాదాపు నిరంతరంగా సూర్యరశ్మి లభిస్తుంది. మంచు రూపంలో నీటి నిల్వలు ఉన్నాయి. భవిష్యత్తులో వ్యోమగాముల జీవనానికి, పరిశోధనలకు ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది.
నాసా తయారు చేసిన ప్రణాళిక ప్రకారం 2026 నుండి 2032 వరకు మూడు ప్రధాన దశల్లో అన్ని వసతులతో కూడిన ఒక భారీ మూన్ బేస్ నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో 2029 వరకూ చంద్రుడి ఉపరితలంపై సురక్షితమైన, నమ్మదగిన ప్రవేశానికి కావాల్సిన ప్రాథమిక సమాచార సేకరణ చేస్తారు. ఆ తర్వాత 2029 నుండి 2032 చేపట్టే రెండో దశలో మూన్ బేస్‌ను పూర్తి వసతులతో నిర్మిస్తారు.. ఆ తర్వాత మూడో దశలో భాగంగా 2032 తర్వాత మానవ నివాసాన్ని సుస్థిరం చేయడం మొదలు పెడతారు.
మరోవైపు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ప్రతిష్టాత్మక చంద్రయాన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా 2023 జులై 14న చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి LVM3-M4 రాకెట్ ద్వారా ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో 'విక్రమ్ ల్యాండర్' విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో చంద్రుడిపై అంతరిక్ష నౌకను దింపిన నాల్గవ దేశంగా, దక్షిణ ధ్రువ సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ఈ ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టారు. శివ అనేది మానవాళి సంక్షేమం, శుభానికి సంకేతం. చంద్రయాన్-3 విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలకు గౌరవంగా ఈ పేరులో 'శక్తి' ని చేర్చారు. చంద్రునిపై శివశక్తి పాయింట్ దగ్గర ఉన్న నేల గతంలో వైవిధ్యమైనదని వెల్లడించే ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచింది.
చంద్రయాన్-3 సాంకేతిక పరంగా ఇది భారత్‌కు ఒక పెద్ద విజయమైనా అంతకంటే పెద్ద రహస్యం దీనివల్ల బయటపడింది. విక్రమ్ ల్యాండర్ తన ప్రయోగాలు పూర్తి చేశాక దానిలో కొంత ఇంధనం మిగిలింది. ఈ ఇంధనంలో ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా అనుకోని ఒక సాహసం చేశారు. ఇంజిన్లను మళ్లీ మండించి విక్రమ్‌ను చంద్రుడి ఉపరితలం నుంచి 50 సెంటీమీటర్ల పైకి లేపి కొద్ది దూరంలో ల్యాండ్ అయ్యేలా చేశారు. ఆ మంటల ధాటికి చంద్రుడిపై ఉన్న 3 సెంటీమీటర్ల పైపొర గాల్లోకి లేచింది.
ఈ ప్రయోగంతో చంద్రుడి ఉపరితలంపై ఎంతో మెత్తగా, దూదిలా ఉండే పొడి మట్టి పొర తొలగిపోయింది. ఇలా ఎలాంటి డ్రిల్లింగ్ మిషన్ లేకుండానే చంద్రుడి అంతర్భాగంలో ఉన్న మట్టిని పరిశీలించే అరుదైన అవకాశం శాస్త్రవేత్తలకు దొరికింది.చంద్రుడి మట్టి ఒకేలా కాకుండా పలు పొరలుగా ఉందని గుర్తించారు. పైభాగం పొర చాలా మెత్తగా ఉండగా, కింద భాగం మరింత ఘనంగా ఉందని తేలింది.
ఈ నేపథ్యంలో చంద్రుడిపై మానవ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా చేపడుతున్న ప్రతిష్ఠాత్మక మూన్ బేస్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఇస్రోను నాసా ఆహ్వానించింది. భారత్, అమెరికా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆర్టెమిస్ అకార్డ్స్ కింద మూన్ బేస్ కార్యక్రమంలో భాగం కావాలని ఇస్రోను నాసా కోరింది.
భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్షాన్ని పరిశోధించేందుకు, సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు సైతం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది. అంతరిక్ష రంగంలో పరస్పరం సహకరించేందుకు ఉన్న అవకాశాలపై ఇరుదేశాల సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూపులు గత వారం బెంగళూరులో సమావేశమై చర్చలు జరిపాయి.. ఆర్టిమిస్ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతాయి’’ అని ఈ జాయింట్ వర్కింగ్ గ్రూపు తాజాగా ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది.
ఇటీవల విజయవంతమైన నాసా-ఇస్రో సంయుక్త నిసార్ మిషన్ కూడా చర్చకు వచ్చింది. భూమిని పరిశీలించేందుకు నాసా, ఇస్రో కలిసి ఈ మిషన్‌ను చేపట్టాయి. ఈ మిషన్ విజయంతో రెండు దేశాల అంతరిక్ష సంస్థల మధ్య సహకారానికి మరింత ఊతం లభించింది. నిసార్ మిషన్ తర్వాత కూడా అంతరిక్ష శాస్త్రం, సాంకేతిక రంగాల్లో మరిన్ని సంయుక్త కార్యక్రమాలను చేపట్టాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపైనా కలిసి పనిచేయాలని చర్చించాయి.
అంతరిక్షంతో పాటు కీలక సాంకేతిక రంగాల్లో భారత్- అమెరికా సహకారాన్ని పెంచేందుకు ట్రస్ట్ కార్యక్రమం కింద కూడా చర్చలు కొనసాగుతున్నాయి. రక్షణ, కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో భాగంగా అంతరిక్ష రంగంలోనూ కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.




