BurningTopic: టెలిగ్రామ్ ఫౌండర్ సంచలనం.. టెలిగ్రామ్ నిషేధిస్తే లీకులు ఆగవు?
BurningTopic: నీట్ లీకేజీల నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం!
BurningTopic: టెలిగ్రామ్ ఫౌండర్ సంచలనం.. టెలిగ్రామ్ నిషేధిస్తే లీకులు ఆగవు?
BurningTopic: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు NTA నిర్వహించే 'నీట్' పరీక్ష ఈ ఏడాది తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పేపర్ లీకేజీలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల కేటాయింపు, అసాధారణ ర్యాంకులపై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు విచారణ, సీబీఐ దర్యాప్తు జరిగాయి. బీహార్, గుజరాత్, రాజస్థాన్‌లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపణలతో పలువురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై విద్యార్థులు, దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. NTA నిర్వహణలోని లోపాలపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా మరోసారి జూన్ 21న నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ పై తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నీట్ పునఃపరీక్ష సందర్భంగా తప్పుడు ప్రచారాలకు కొన్ని ముఠాలు టెలిగ్రామ్ యాప్‌ను ఉపయోగించమే ఇందుకు కారణం. పరీక్ష ముగిసిన తర్వాత కొందరు పాత మెసేజ్‌లు ఎడిట్ చేసి, పశ్నపత్రాలను అందులో అప్‌లోడ్ చేస్తూ పరీక్షకు ముందే పేపర్ లీకయినట్లు నకిలీ ఆధారాలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాల కట్టడికి టెలిగ్రామ్‌లో ఇదివరకే పోస్టు చేసిన మెసేజ్‌లను సవరించే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను ఈ నెల 30 వరకు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు.పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సెక్షన్ 69A కింద తన అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల 22 వరకూ టెలిగ్రామ్ ప్లాట్‌ఫాం యాక్సెస్‌పై నియంత్రణ ఉంటుందని, 30వ తేదీ వరకూ మెసేజ్ ఎడిటింగ్‌పై ఆంక్షలు కొనసాగుతాయని ఎన్‌టీఏ వెల్లడించింది.
నీట్ ఎగ్జామ్ మే 3న జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.ఈ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో, మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.గత కొన్ని వారాలుగా టెలిగ్రామ్‌లో ‘పేపర్ లీక్డ్ నీట్’, ‘రీ- నీట్ 2026’, ‘ప్రైవేట్ మాఫియా’, ‘రీ నీట్ మాఫియా’ తదితర పేర్లతో బహిరంగంగా ఛానళ్లు నడుపుతూ నీట్ పేపర్ ఇప్పిస్తామనే ఆశచూపి అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్న ముఠాలపై కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ నిరంతరం నిఘా ఉంచిందని ఎన్‌టీఏ వెల్లడించింది. ఎన్‌టీఏతో పాటు బిహార్, గుజరాత్, రాజస్థాన్ పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగి నకిలీ ఛానళ్లు, గ్రూపులు, బాట్స్ తొలగించినట్లు పేర్కొంది. సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో పరీక్షకు ముందు సమర్థ చర్యల్లో భాగంగా టెలిగ్రామ్‌పై తాత్కాలిక నియంత్రణ విధించాల్సి వచ్చిందని ఎన్‌టీఏ వివరించింది.
కేంద్ర ప్రభుత్వం తమ యాప్‌పై విధించిన తాత్కాలిక నిషేధంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టెలిగ్రామ్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ పావెల్ దురోవ్. ఈ నిర్ణయం తప్పు చేసిన వాళ్లకు కాకుండా భారత్‌లోని 15 కోట్ల మంది టెలిగ్రామ్ వినియోగదారులకు శిక్ష విధించినట్లుగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.పేపర్ లీక్ సమస్యను పరిష్కరించకుండా.. నిందితులపై చర్యలు తీసుకోకుండా యాప్‌ను నిషేధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. టెలిగ్రామ్‌ను నిషేధించినంత మాత్రాన లీకులు ఆగవని.. నిందితులు ఇతర యాప్‌ల నుంచి కూడా అక్రమాలకు పాల్పడతారని అన్నారు. లీక్ అయిన పరీక్ష మెటీరియల్‌ను, అక్రమాల్లో భాగమైన వందలాది ఛానళ్లను తొలగించాం. తేదీలకు సంబంధించిన మోసాలను నివారించేందుకు ‘ఎడిటెడ్’ అనే లేబుల్‌ను కూడా మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాం. అని వివరించారు. మరో వైపు ఈ నిషేధాన్ని టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టు లో సవాల్ చేసింది. దీంతో ఈ విషయంపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
కాగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో టెలిగ్రామ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.ఈ యాప్‌ను ‘కొత్త డార్క్ వెబ్’గా పేర్కొంటూ.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులు, డ్రగ్ ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు టెలిగ్రామ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆరోపించింది.. గోప్యతకు సంబంధించి టెలిగ్రామ్‌లో ఉన్న అధునాతన ఫీచర్లు క్రిమినల్ నెట్‌వర్క్‌లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. పిల్లలపై లైంగిక దాడుల వంటి దృశ్యాలను ఈ యాప్ గ్రూప్‌ల్లో విపరీతంగా షేర్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవసీ సెట్టింగ్‌లతో యూజర్లు తమ టెలిగ్రామ్ ఐడీలు, ఫోన్ నంబర్లు వంటి గుర్తింపు వివరాలను దాచిపెట్టేందుకు వీలు లభిస్తోంది. క్రిమినల్స్ డార్క్ వెబ్ లింక్‌లతో పరస్పరం అనుసంధానం చేసుకుంటున్నారు. దీంతో అధికారులు వారిని ట్రాక్ చేయలేకపోతున్నారు’’ అని కేంద్రం తమ అఫిడవిట్‌లో ఆరోపించింది.
టెలిగ్రామ్’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. లక్షలాది మంది విద్యార్థులు నోట్స్ షేర్ చేసుకోవడానికి మరియు పరీక్షల తయారీకి టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి సమయంలో యాప్‌ను బ్యాన్ చేయడం విద్యార్థుల చదువును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. నిందితులు టెలిగ్రామ్ కాకుంటే వాట్సప్‌లోనూ పేపర్లు లీక్ చేస్తారని అన్నారు. అలా అని వాట్సప్‌ను కూడా బ్యాన్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. పేపర్ లీక్ మాఫియాను వదిలేసి, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. కాగా రాహుల్ గాంధీ విద్యార్థుల భవితవ్యంతో రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం కపట నీతిని అవలంభించడం తగదని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు.




