Off The Record: నెల్లూరు మేయర్ పీఠం దక్కేది ఎవరికి ?

Off The Record: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ నెల్లూరు మేయర్ పీఠం హాట్ టాపిక్‌గా మారింది. ముస్లిం మైనార్టీల డిమాండ్, రేసులో ఉన్న నాయకుల వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Sept 2026 7:21 AM IST
Off The Record
X

Off The Record: నెల్లూరు మేయర్ పీఠం దక్కేది ఎవరికి ?

Off The Record: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కూటమి సన్నద్ధమవుతున్న వేళ నెల్లూరు నగర మేయర్ పీఠం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందట. నెల్లూరు మేయర్ పీఠానికి సంబంధించి రాజకీయ రిజర్వేషన్ ఎలా ఉండబోతుందో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

రొటీన్‌గా జరిగే రొటేషన్ పద్ధతి అనుసరిస్తారా...? లేదా అధికార పార్టీ పెద్దల ఇష్టా ఇష్టాలను పరిగణలోనికి తీసుకుంటారో అసలే తెలియదు. ఇదే సమయంలో ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈసారి నెల్లూరు మేయర్‌గా ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ విస్తృతంగా ప్రచారం జరుగుతోందట.

ఇందులో అధికార పార్టీ నుంచి అనుచరులుగా ఉన్న కొందరు నేతలు బాహాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తమ వర్గానికి ప్రథమ పౌరుడి పీఠం దక్కాలని డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీలో ఈ వ్యవహారం కాస్త గుంబనంగా కొనసాగుతోందట.

గతాన్ని గుర్తు చేస్తూ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చేది వైసీపీ అంటూ ఇటీవల ఓ నాయకుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ వాదన వినిపించారట. మొత్తంగా సింహపురి ప్రథమ పౌరుడి పీఠం కోసం ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి భలే గిరాకీ ఏర్పడిందట.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమంటూ ప్రభుత్వ వినేతలు ప్రకటన చేస్తున్నప్పటికీ రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇదే సమయంలో తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు కొన్ని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నేతలు తమకంటే తమకంటూ మేయర్ పీఠం కోసం డిమాండ్ మొదలుపెట్టాయట.

ఇప్పటికే మైనార్టీలు, బీసీలు అధికార పీఠం కోసం అర్రులు చాస్తున్నాటట. ఇందులో ముందుగా ముస్లిం మైనార్టీలు తలం తమ బలం, బలగాన్ని చూపుతూ మాకు అవకాశం దక్కావాల్సిందే అందుకు అందరూ సహకరించాలన్నంత స్థాయిలో ప్రధాన రాజకీయ పార్టీల ముందు అజెండాను పెట్టారట. ఇప్పుడు ఈ వ్యవహారం సింహపురిలోని ప్రధాన రాజకీయ పార్టీలలో తీవ్ర ఉత్కంఠను రేపుతోందట.

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై రిజర్వేషన్ల ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే... నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ అయ్యాక మొదట మహిళ కేటగిరిలో పులిమి శైలజారెడ్డి తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం ముగియకముందే పదవి నుంచి దించేశారు.

ఆ స్థానంలో ఆనం కుటుంబానికి అనుచరులుగా ఉన్న నంది మండలం భానుశ్రీను మేయర్‌గా ఎంపిక చేశారు. అనంతరం నగర మేయర్ పదవిని బిసి జనరల్ కోటాకు కేటాయించగా.. అప్పటి వైసీపీ నేతలు నగరానికి చెందిన అబ్దుల్ అజీజ్‌ను ఎంపిక చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో.. అబ్దుల్ అజీజ్ టిడిపి కండువా కప్పుకున్నారు.

ఇప్పటికీ టిడిపిలోనే కొనసాగుతూ ఉన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మేయిర్ పీఠాన్ని గిరిజన మహిళకు కేటాయించడంతో పొట్లూరి స్రవంతి ఆ బాధ్యతలు చేపట్టారు. ఆపై మరోసారి పాలక ప్రభుత్వం మారడంతో మేయర్ కొన్నాళ్లు వైసీపీలో మరికొన్నాళ్లు టిడిపిలో ఆపై తటస్థత కొనసాగించారు.

ముస్లిం మైనార్టీలు మేయరు పదవిని కోరడం వెనుక.. ఓటు బ్యాంకును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారట. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యాబలం ముస్లిం సామాజిక వర్గానికి వుందని లెక్కలతో సహా ప్రధాన రాజకీయ పార్టీల ముందు ఉంచుతున్నాయట.

తమ సంఖ్యా బలం ఆధారంగా రాజ్యాధికారంలో వాటా కావాలని ఎన్నికల సీజన్లో ఆయా వర్గాలు డిమాండ్ చేయడం సర్వ సాధారణమైనప్పటికీ తాజా డిమాండ్ వెనుక రాజకీయ ప్రతివ్యూహాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోందట.

మేయర్ పీఠంపై ముస్లిం మైనారిటీ సంఘాల ఆకాంక్ష కంటే కొందరు తమ రాజకీయ అవసరాల కోసం చేస్తున్న డిమాండ్‌గా అనుమానం వ్యక్తమవుతోందట. స్వపక్షంలోనే ఉన్న ప్రత్యర్థి వర్గాన్ని ఇరుకున పెట్టేందుకు ఒక సామాజిక వర్గాన్ని అస్త్రంగా ఎంచుకుని వ్యూహాత్మక యుక్తులు వేస్తున్నారన్న చర్చ కూడా అధికార పార్టీలో కొనసాగుతోందట.

మరోవైపు ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థలో కొనసాగిన రిజర్వేషన్ల ప్రక్రియను పరిశీలిస్తే ఈసారి ఓసీ జనరల్ కానీ.. ఓసీ మహిళకు గానీ మేయర్ పీఠం రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

బీసీ జనరల్ కేటాయిస్తే పదవిని దక్కించుకునేందుకు టిడిపి కూటమి నుంచి నగరానికి చెందిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీలోనూ ఒకరిద్దరు ప్రధాన బలహీన వర్గాలకు చెందిన యువ నేతలు పావులు కదుపుతున్నారట.

ఇక ఓసీ జనరల్, ఓసీ మహిళకు కేటాయించినట్లయితే... అధికార పార్టీలోనే ప్రస్తుత ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి, మరోవైపు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి సురేందర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవిల పేర్లు తెరపై వస్తున్నాయట.

కూటమిలోని జనసేన నుంచి ఒకరిద్దరు నాయకులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసిపి నుంచి మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఒకరిద్దరితోపాటు దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి ఈ ఎన్నికలతో అరంగేట్రం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఇంతకీ మేయర్ పీఠం ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందో.. ఆ స్థానానికి ఎవరు ఎన్నికవుతారో.. చూడాలి మరి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story