Burning Topic: మహా విషాదం నుంచి నేపాల్ ఎప్పుడు కోలుకుంటుందో ?

Burning Topic: నేపాల్‌లో భీకర ఆకస్మిక వరదలు. వెయ్యి దాటిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు. భారత్ సహాయక బృందాల గుర్తింపు చర్యలు. నిసార్ శాటిలైట్ పాత్రపై చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Sept 2026 8:23 AM IST
Burning Topic
X

Burning Topic: మహా విషాదం నుంచి నేపాల్ ఎప్పుడు కోలుకుంటుందో ? 

Burning Topic: ప్రకృతి సృష్టించిన విలయతాండవ విషాదం నుంచి ఇప్పట్లో నేపాల్ కోలుకునేలా లేదు. ఆకస్మిక వరదలు ఈ హిమాల రాజ్యంలో తీవ్ర వినాశనాన్ని మిగిల్చాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులోని భోటె కోషి నదిలో ఉద్ధృతి పెరగడంతో ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులకు కూడా భారీగా నష్టం వాటిల్లడం తెలిసిందే.

ఈ ఘోర ఆకస్మిక వరదల్లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య వేయి దాటిపోయింది. టిబెట్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోయని చైనా చెబుతున్నా వాస్తవ సంఖ్య దాచినట్లు స్పష్టమవుతోంది. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం ఇంకా దాదాపు నాలుగు వేల మంది ఆచూకీ లభించలేదు.

వీరిలో దాదాపు 590 మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. నేపాల్ సైన్యం, విపత్తు బృందాలు ఇప్పటివరకు దాదాపు 11,800 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

నేపాల్‌ వరద విలయం ఇంకా వేలమంది ఆచూకీ తెలియడం లేదు. గాలించిన కొద్దీ మృత దేహాలు బయట పడుతూనే ఉన్నాయి, భవన శిథిలాలు, పేరుకుపోయిన బురద కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి.

వరద ధాటికి శిథిలమైన నువాకోట్‌ జిల్లాలోని బెత్రావతిలోని ఓ ఇంట్లో 23 మృతదేహాలు బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. . అవన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఖననం చేయడానికి తరలించారు. ఈ మృత దేహాలు ఒకే కుటుంబానికి చెందినవా? లేక చుట్టుపక్కల వాళ్లు తలదాచుకునేందుకు వచ్చి మరణించారా? లేదంటే కొట్టుకు వచ్చిన మృతదేహాలా? అని పరిశీలిస్తున్నారు.

మరోవైపు నేపాల్‌ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌ సమీపంలోని గండక్‌ నదిలో లభించాయి. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను నేపాల్‌కు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు టిబెట్-నేపాల్ సరిహద్దులో హిమాలయాల్లోని హిమానీనదం శిథిలాలు, బండరాళ్లతో ఏర్పడిన సరస్సు కారణంగా ఇంకా వరద ముప్పు పొంచే ఉంది. ఈ కారణంగా బోటెకోషి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది.

చైనా ఇస్తోన్న సమాచారం ఆధారంగా దిగువ ప్రాంత ప్రజలను నేపాల్‌ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయిన వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఈ హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

త్రిశూలి నదిలో కొత్తగా వచ్చిన వరద ధాటికి మరో వంతెన కొట్టుకుపోయింది. వరద ప్రభావిత జిల్లాల్లోని నివాసితులు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమాయక చర్యలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి.

నేపాల్‌కు సహాయక చర్యల్లో సహకరించేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్‌ నిపుణులను పంపించింది భారత్. 11 టన్నుల సహాయక సామగ్రితో విమానం నేపాల్‌కు చేరుకుంది.ఎం నేపాల్ సైన్యానికి తోడుగా భారత్, చైనా, జపాన్, అమెరికా, ఎమిరేట్స్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు సహాయక చర్యల్లో మద్దతు అందిస్తున్నాయి.

బ్రిడ్జ్ యూనిట్లు, ఫ్రీజర్లు, జనరేటర్ సెట్లు, సోలార్ ల్యాంపులు, డీఎన్ఏ టెస్టింగ్ కిట్లు, అత్యవసర సహాయక సామగ్రితో పాటు టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఫుడ్ ప్యాకెట్లు, మందులు వంటి సామగ్రి అందుతున్నారు. డీఎన్ఏ విశ్లేషణలో నైపుణ్యం కలిగిన దాదాపు 18 మంది భారత ఫోరెన్సిక్ నిపుణులు ఆగస్ట్ 29 నుంచి నేపాల్‌లో పనిచేస్తున్నారు.

మరోవైపు గుర్తుతెలియని మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు సరిపోక తాత్కాలిక ఖననాలు చేపట్టారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు పూర్తయిన తర్వాతే అవశేషాలను బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల జాడ కోసం వెతుకుతున్న వేలాది మంది ప్రజలతో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి.

భారీ వరదల కారణంగా నేపాల్‌లోని సుమారు 11 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పర్ త్రిశూలి ప్రాజెక్టు నుంచి గత వారాంతంలో 250 మందిని రక్షించగా, మరో 42 మంది కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది.

మరోవైపు రసువా, నువాకోట్‌లలోని సుమారు 6 సొరంగాలు, 11 ప్రాజెక్టులలో 930 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

సమయం గడుస్తున్న కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటంతో బాధితులు బతికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సొరంగం చుట్టూ పేరుకుపోయిన దట్టమైన బురద, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.

బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు కొండ ప్రాంతాన్ని పేలుడు పదార్థాలతో పేల్చి సొరంగాల్లోకి గాలిని పంపింగ్ చేస్తున్నాయి. మరోవైపు హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఇషా ఫౌండేషన్‌ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సూచించారు.

రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్‌లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు.. హిమాలయ ప్రాంతం అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం.

ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్‌ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలన్నారు జగ్గీ వాసుదేవ్‌. నేపాల్‌ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నేపాల్‌ భారీ ఆకస్మిక వరదల్లో ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల బృందం కూడా ఆచూకీ లేకుండా పోయింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహాల్లో ఒకటైన నిసార్‌ ఏం చేస్తోంది?. అనే చర్చ జరుగుతోంది. నేపాల్ విలయంలో ముందుగానే హెచ్చరికలు పంపకుండా నిద్రపోయిందా? అనే విమర్శలు వస్తున్నాయి.

నిసార్‌ను భూమిపై జరిగే మార్పులను మిల్లీమీటర్‌ స్థాయి ఖచ్చితత్వంతో గుర్తించేలా ఇస్రో-నాసాలు దీనిని అభివృద్ధి చేశాయి. హిమాలయాల్లో ఆకస్మిక వరదలు, మంచు, నీరు, రాళ్లు, బురద కదలికలతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈ విపత్తుకు సంబంధించి నిసార్‌ ఏం గుర్తించింది? అనేది తెలియడం లేదు.

హిమనదులు, క్రియాశీల టెక్టానిక్‌ ప్రాంతాలు, వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రమాదకరంగా మారుతున్న హిమాలయాలు.. నిసార్‌ పరిశీలనకు కీలక ప్రాంతాల్లో ఒకటి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిసార్ కొన్నివారాల క్రితమే ఆకృతి, పరిమాణం, తదితర భూమిపై వచ్చే మార్పులను గుర్తించింది. కానీ కీలక సమయంలో దీని సేవలు అందలేదని చెబుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story