Burning Topic: ప్రకృతి ప్రకోపానికి అల్లాడుతున్న హిమాలయాలు!

Burning Topic: నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమానీనదం కూలి ఆకస్మిక వరదలు. రెండోసారి ముప్పు పొంచివున్న తరుణంలో భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Aug 2026 8:03 AM IST
Burning Topic
X

Burning Topic: ప్రకృతి ప్రకోపానికి అల్లాడుతున్న హిమాలయాలు!

Burning Topic: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమానీనదం కుప్పకూలిపోవడంతో సంభవించిన భారీ ఆకస్మిక వరదలతో నేపాల్ ప్రస్తుతం అతలాకుతలమవుతోంది. ఈ ఘోర విపత్తు నుంచి నేపాల్ ఇప్పుడిప్పుడే కోలుకునేలా లేదు. ప్రకృతి నేపాల్‌ భూభాగాన్నే పగబట్టిందా అన్నట్టు రెండోసారి భారీ వరద ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ పర్వత పరిశోధన సంస్థ, వాతావరణ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

నేపాల్, టికెట్ సరిహద్దుల్లో వ్యర్థాలు పేరుకుపోయి నదులు బ్లాక్ అవ్వడంతో.. కృత్రిమ సరస్సులు మరోసారి బద్దలై.. యమధర్మరాజు వెంటాడినట్టు భారీ వరద ముప్పు వెంటాడుతోందట. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.

దీని ప్రధాన కేంద్రం చైనా- నేపాల్ సరిహద్దుల్లో ఉంది. అందుకే ఈ భూకంపం ప్రభావం చైనాపై కంటే నేపాల్‌పై ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఫలితంగా మరోసారి వరద ప్రళయం ముంచెత్తనుందని గ్రహించిన అధికారులు.. ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ హిమపాతం వల్ల ఏర్పడిన 'బ్యారియర్ లేక్'.. రానున్న 72 గంటల్లో ఎప్పుడైనా బద్దలయ్యే ప్రమాదం ఉందని చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయాల్లో గ్లేషియర్ కుప్పకూలడం వల్ల ఈ విపత్తు సంభవించిందని అంచనా.

ఛోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదుల కలయిక వద్ద కొండచరియలు, మంచు వ్యర్థాలు అడ్డుపడటంతో ఒక కృత్రిమ సరస్సు ఏర్పడింది. ఇది రాబోయే 3 రోజుల్లో అంటే సెప్టెంబర్ 1 నాటికి.. ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదం ఉందట.

అందుకే చైనా దీనిపై లెవెల్-IV అత్యవసర అలర్ట్ ప్రకటించింది. ఈ సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరి పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు అంటే.. దాదాపు 1200 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌తో సమానమన్న మాట.

అంత వరద ఒకేసారి వచ్చి చేరే అవకాశం ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ ఈ అడ్డుకట్ట తెగితే ఎగువన చైనా వైపు, దిగువన ఉన్న నేపాల్ వైపు తీవ్ర ప్రాణనష్టం జరుగుతుందని చైనా హెచ్చరించింది.

చైనా-నేపాల్ సరిహద్దుల్లోని హిమాలయ పర్వతాల్లో గ్లేసియర్ కూలిపోవడంతో బుధవారం రోజున ఉదయం త్రిశూలి, భోటే కోశి నదుల్లో ఒక్కసారిగా ఉప్పెనలా వరద ముంచుకొచ్చింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరంలోని హిమానీనదంలో కొంత భాగం కూలిపోయింది.

దీంతోపాటు పర్వత శిథిలాలు కూడా లోయలో పడ్డాయి. ఇది వేగంగా ప్రవహించి విధ్వంసం సృష్టించాయని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వరద విలయం తర్వాత వరద ముంపు ప్రాంతాల్లో కొండచరియలు, వ్యర్థాలు పేరుకుపోయి నదీ ప్రవాహాలు ఆగిపోయాయి.

దీంతో చైనా, నేపాల్ సరిహద్దుల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఇవి ఏ క్షణమైనా బద్దలైతే ఎగువ నుంచి సెకండ్ వేవ్ వరద ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోటేకోశి, త్రిశూలి నదీ తీర ప్రాంతాల ప్రజలను, సహాయక సిబ్బందిని నదులకు దూరంగా, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశించింది.

నేపాల్ వరద ప్రవాహం గండక్ నది ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తుండటంతో బీహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. కొండచరియలు, బురద శిథిలాలు నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో చైనా-నేపాల్ సరిహద్దుల్లో రెండు కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయి.

ఈ సరస్సుల్లో నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగిపోవడంతో చైనా వైపున ఉన్న ఒక డ్యామ్‌కు గండిపడి ఓవర్‌ఫ్లో అవ్వడం ప్రారంభమైంది. మరోసారి అంతకంటే తీవ్రమైన వరద ముప్పు పొంచి ఉందన్న నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ హెచ్చరికలతో అధికారులు సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.

రెస్క్యూ సిబ్బందిని, ప్రజలను సురక్షిత ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా.. ఢిల్లీ -ఖాట్మాండు మధ్య బస్సు సర్వీసును నిలిపివేశారు. ఆగస్ట్ 29న జరగాల్సిన నేపాల్ బస్సు సర్వీసును కూడా రద్దు చేశారు.

అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అంచనా వేయడానికి, బాధితులకు సహాయం అందించడానికి యూనిసెఫ్ సభ్యులు నువాకోట్‌కు చేరుకున్నారు.

నేపాల్‌లో హెలికాప్టర్లను ఉపయోగించి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక బృంద సభ్యులను కూడా హెలికాప్టర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story