Burning Topic: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు ఓటమి తప్పదా ?

Burning Topic: పశ్చిమాసియా సంక్షోభం, బహుముఖ యుద్ధాల వేళ ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Oct 2026 7:56 AM IST
Burning Topic
X

Burning Topic: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు ఓటమి తప్పదా ?

Burning Topic: పశ్చిమాసియాలో నెలకొత్త తీవ్ర సంక్షోభ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల ముందు నిలిచింది. ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు అక్టోబర్ 27న పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడతాయి. అక్టోబర్ 28 ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభ దశలోనే తొలి ఫలితాల సరళి స్పష్టమయ్యే అవకాశం ఉంది.

అక్టోబర్ 29 మధ్యాహ్న సమయానికి అన్ని ఓట్ల లెక్కింపు పూర్తయితే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే నవంబర్ 4వ తేదీ అధికారిక ఫలితాల ప్రకటనకు గడువుగా నిర్ణయించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన 'నెస్సెట్' లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 స్థానాల మద్దతు అవసరం.

ఇజ్రాయెల్‌లో 73 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని సర్వేలు సూచిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే ఓట్ల ప్రభావం దాదాపు రెండు స్థానాల వరకు ఉండవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సమీప ప్రత్యర్థి గాడి ఐసెన్‌కోట్‌ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది. ఈ సారి జరగబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత తీవ్రంగా పోటీపడే ఎన్నికల్లో ఒకటిగా నిలుస్తాయని నిపుణులు పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఆ దేశంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అలాగే గాజా, లెబనాన్, ఇరాన్‌లతో కొనసాగుతున్న బహుముఖ యుద్ధాల నేపథ్యంలో ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నాయకత్వానికి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి.అక్టోబర్ 7 దాడులకు నెతన్యాహునే కారణమని ఆయన విమర్శకులు ఆరోపిస్తున్నారు. నెతన్యాహు ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచారని, రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాలను పొడిగించారని, గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రవర్తన కారణంగా దాని అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీశారని కూడా వారు ఆరోపిస్తున్నారు.

కాగా ఎన్నికల ముందు వెలువడిన చివరి ఓపీనియన్ పోల్స్ ప్రకారం, ఇజ్రాయెల్‌లో ఏ ఒక్క కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇరాన్, హమాస్‌లపై యుద్ధ వాతావరణాన్ని, జాతీయ భద్రతను బెంజిమన్ నెతన్యాహు తన ప్రచారంలో ప్రధానంగా వాడుకున్నారు. అయినప్పటికీ, ఆయన సొంత కూటమి 61 సీట్ల మార్కును అందుకోవడం కష్టంగా మారింది. నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి.

ఒకవేళ చిన్న మితవాద పార్టీలు థ్రెషోల్డ్ దాటి నెతన్యాహుకు మద్దతు ఇస్తే ఆయన మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. నెతన్యాహుకు ప్రధాన పోటీదారుగా మాజీ సైనిక చీఫ్ గాడి ఐసన్‌కోట్ నేతృత్వంలోని 'యాషర్' పార్టీ నిలిచింది. అక్టోబర్ 7 వైఫల్యాలు, దేశంలో పెరిగిన జీవన వ్యయం వంటి అంశాలపై విపక్షాలు నెతన్యాహును గట్టిగా నిలదీస్తున్నాయి. విపక్షాలు అన్నీ కలిసి నెతన్యాహును గద్దె దించాలనే ఒకే ఒక లక్ష్యంతో నాన్-అగ్రెషన్ ఒప్పందం చేసుకున్నాయి.

మరోవైపు.. ఇజ్రాయెల్‌ ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు తన మద్దతు ఉంటుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. నెతన్యాహు కాకుండా మరో నేత అధికారంలోకి వస్తే ఇరాన్‌ విషయంలో అమెరికాపై మరింత బాధ్యత పడవచ్చన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇజ్రాయెల్‌ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే, ట్రంప్‌ మద్దతు నెతన్యాహు కూటమి ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఏ పార్టీకి మద్దతు రాని పక్షంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించే వరకూ నెత్యన్యాహూ తాత్కాలిక ప్రధానిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆయన చక్రం తిప్పే అవకాశం ఉందని జిందాల్ స్టడీ సెంటర్ ఫర్ ఇజ్రాయెల్‌కు చెందిన డాక్టర్ ఖిన్విరాజ్ జింగిద్ చెబుతున్నారు.

ఇలా ఉంటే బెంజమిన్ నెతన్యాహును ఓడించేందుకు ఆ దేశంలోని ప్రతిపక్షాలు నడుంబిగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికలలో ఓటు వేసేందుకు విదేశాల్లో స్థిరపడ్డ ఇజ్రాయెలీలు స్వదేశానికి క్యూకట్టారు. తమ దేశాన్ని ఎవరు పాలించాలనే నిర్ణయంలో భాగస్వాములు కావడానికి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఈసారి దాదాపు 67 వేల మంది ఇజ్రాయెలీలు ఎన్నికల కోసం స్వదేశానికి చేరుకునే అవకాశం ఉంది.

ఈ ఓట్లు ఎవరికి అనుకూలంగా మారతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. విదేశాల్లో నివసించే సాధారణ ఇజ్రాయెల్‌ పౌరులకు పోస్టల్‌ లేదా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ సదుపాయం లేకపోవడంతో, ఓటు వేయాలంటే స్వయంగా దేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తుండగా, యూరప్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా ప్రాంతాల నుంచి కూడా పలువురు బయలుదేరుతున్నారు. వీరిలో చాలామంది తమ ప్రయాణ ఖర్చులను తామే భరిస్తున్నారు.

విదేశీ ఓటర్లు పెద్ద సంఖ్యలో స్వదేశానికి రావడం ఎన్నికల సమీకరణాల్లో ప్రాధాన్యం పొందవచ్చు. అయితే, ఆ ఓట్లు ఏ పార్టీకి పడతాయి, ఎంతమంది నిజంగా ఓటు వేస్తారు, మొత్తం ఫలితాలపై ఎంత ప్రభావం చూపుతారు అన్నది ఇంకా స్పష్టంగా లేదు. అందువల్ల నెతన్యాహుకు ఓటమి ముప్పు పొంచి ఉందని ఇప్పుడే తేల్చేయడం సరికాదు.

కానీ పోటీ గట్టిగా ఉన్న ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. విదేశాల నుంచి వస్తున్న ఈ ఓటర్ల తీర్పు ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నెతన్యాహు ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచారని, రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాలను పొడిగించారని, గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రవర్తన కారణంగా దాని అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీశారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి, ఆయనను అధికారం నుంచి తప్పించాలని చూస్తున్న ప్రతిపక్ష కూటమికి మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్