Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఈసారి అదృష్టవంతులు ఎవరు?
Off The Record: తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందా?
Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఈసారి అదృష్టవంతులు ఎవరు?
Off The Record: తెలంగానలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది. నామినేటెడ్ పదవులతో పాటుగా మంత్రివర్గంలో చోటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అందుకోసం గాడ్ ఫాదర్ ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ పదవీ లేక ఉన్న నేతలంతా.. అగ్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పాకులాడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చోటు దక్కలేదు. క్యాబినెట్ ర్యాంకుతో మంత్రివర్గ ఆహ్వానితుడిగా బోధన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించారు. మంత్రి పదవికి ఉన్న క్రేజ్ ప్రభుత్వ సలహాదారు పదవికి దక్కకపోవడంతో మంత్రి యోగం కోసమే నేతలు పట్టుబడుతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినప్పటికీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై హస్తాం పార్టీలో కొంతమేరకు అసంతృప్తి రగులుతోంది. యోగ్యత లేక పక్కన పెడుతున్నారా లేక ఉమ్మడి జిల్లాపై చిన్న చూపా అనే కోణంలో జోరుగా చర్చ నడుస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు తీరని అన్యాయమే జరుగుతుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని నమ్ముకొని బతుకుతున్న తమకు సరైన గుర్తింపు దక్కటం లేదని సీనియర్లు వాపోతున్నారట. పార్టీ పరమైన పదవుల్లో చేయూత లేక..ఇటు ప్రభుత్వంలో భాగం కాలేకపోవడంతో వారంతా తెగ ఫీల్ అవుతున్నారట. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరైన స్థాయిలో పదవులు మట్టుకు వరించలేదు. బాల్కొండ నియోజకవర్గంలో మానాల మోహన్ రెడ్డి, అనిల్, అన్వేష్ రెడ్డిలకు కీలకమైన కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తాహర్విన్ హంగాన్‌కు పదవి వచ్చింది. ఇక కామారెడ్డి జిల్లాలో కాసుల బాలరాజుకు పదవి వరించింది. పిసిసి, డిసిసి కార్యవర్గంలో పదవులు ఇచ్చినప్పటికీ పలువురు సంతృప్తి చెందటం లేదు. పార్టీ పదవులతో ఒరిగిందేమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులను చేపట్టిన నేతల పదవీకాలం త్వరలోనే ముగిస్తోంది. ఈసారి పొడిగింపు ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పదవీకాలం పొడిగిస్తే.. ఇప్పటి వరకు ఏ పదవీ రానీ అసంతృప్త నేతలతో గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారట. ఒకవేళ పొడిగించకపోతే ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న సీనియర్ నేతలతో ముప్పు తప్పదనే ఆందోళన సైతం నెలకొంది
మంత్రివర్గం విస్తరణపై ఊహాగానాలు మరోసారి పెరగడంతో పదవుల కోసం నేతలు అగ్ర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆది నుండి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మీ కాంతారావు, మదన్‌మోహన్ రావులు ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ముగ్గురు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. వీరందరిలో సీనియార్టీ పరంగా సుదర్శన్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఐతే రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పెద్దపీట దక్కడం జరిగింది. సామాజిక సమీకరణ పేరుతో బోధన్ ఎమ్మెల్యేకు దురదృష్టం పట్టుకోగా తాజాగా మరోసారి ఆయన పేరు తెరమీదకి వస్తోంది. ఇప్పటికే కీలకమైన పదవిలో కొనసాగుతున్నందున బీసీ సామాజిక వర్గం నుండి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అదృష్టం వరించే వీలున్నట్లుగా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో సైతం జోరుగా చర్చ జరుగుతుంది.
ఇక కామారెడ్డి జిల్లాలో లక్ష్మీకాంతరావు, మదన్‌మోహన్ రావులకు మంత్రి యోగం వస్తుందా అంటే అందుకు బలం చేకూర్చే అంశాలు ఏమీ లేవు. మొదట్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పేరు బలంగా వినిపించినప్పటికీ ఆ తర్వాత ప్రచారమే లేకుండా పోయింది. ఇలా ఎవరికి వారు తమకు పదవి వరిస్తుందని, అమాత్య పదవి కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఎవరికి పదవి వరిస్తుందో వేచి చూడాల్సిందే.




